గరీబోళ్ల ఇండ్లు కూలగొట్టి హైడ్రా పేరుతో దందా
ప్రభుత్వం దిక్కుమాలిన చర్యలతో చివరికి ప్రజలు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చిందని ధ్వజమెత్తిన కేటీఆర్
హైడ్రా కూల్చివేతతో ఇబ్బంది పడిన వేదశ్రీ కుటుంబాన్ని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. కూకట్‌పల్లి నియోజకవర్గంలోని సున్నం చెరువు పరివాహక ప్రాంతాల్లో హైడ్రా బాధితుల ఇళ్లకు వెళ్లి పరిస్థితులను తెలుసుకున్నారు. అల్లాపూర్ పరిసర ప్రాంతంలో నివసిస్తున్నవేదశ్రీ కుటుంబాన్ని కలిసిన కేటీఆర్ హైడ్రా కూల్చివేత చేపట్టిన రోజు ఏం జరిగిందంటూ చిన్నారితో మాట్లాడారు. స్వయంగా కొనుగోలు చేసి తెచ్చిన బ్యాగు, పుస్తకాలు అందించారు. హైడ్రా కూల్చివేతల కారణంగా తమ పిల్లలు, కుటుంబం మొత్తం రోడ్డున పడిందని కేటీఆర్‌కు వేదశ్రీ కుటుంబ సభ్యులు రోదిస్తూ తెలిపారు. వేదశ్రీ కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు రూ. 50 వేల ఆర్థిక సాయాన్ని కేటీఆర్ చేతుల మీదుగా వేదశ్రీ కుటుంబానికి అందించారు. కేటీఆర్ వెంట ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు ఉన్నారు.
కేటీఆర్ మాట్లాడుతూ.. చిన్నారి వేదశ్రీ మీడియా ఛానల్‌లో తన గోడు వెలిబుచ్చిన తీరున తనను కలిచివేసిందని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. హైడ్రా కూల్చివేతల సమయంలో అధికారుల కాళ్లు పట్టుకున్నా స్కూల్ బ్యాగ్ తీసుకోనివ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ సర్కార్ ఇంత అమానవీయంగా ప్రవర్తించాల్సిన అవసరం ఉన్నదా? అని కేటీఆర్ నిలదీశారు. ప్రభుత్వం దిక్కుమాలిన చర్యలతో చివరికి ప్రజలు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చిందని ధ్వజమెత్తారు. ఎన్నికల్లో ఎన్నో హామీలు ఇచ్చిండ్రు. ఇందిరమ్మ ఇండ్లు కడుతం. ఇంటి నిర్మాణానికి రూ. 5 లక్షలు ఇస్తమన్నరు. ఒక్క ఇల్లయినా కట్టిండ్రా? ఒక్క ఇల్లు కూడా కట్టకుండానే నీ ప్రభుత్వం ఎన్ని
ఇండ్లను కూలగొట్టిందో ప్రజలు గమనిస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. నువ్వు వచ్చి సుమారు ఏడాది కొవచ్చింది ఒక్క ఇల్లయినా కట్టినవా? అని రేవంత్‌రెడ్డిని ఉద్దేశించి ప్రశ్నించారు. హైదరాబాద్‌లోనే కాకుండా రేవంత్‌రెడ్డి అరాచకం గురించి మాట్లాడుకుంటున్నారని తెలిపారు. నువ్వు నీ కేబినెట్ మంత్రులు ఏం చేస్తున్నారో ప్రజలంతా చూస్తున్నారు. గరీబోళ్ల ఇండ్లు కూలగొట్టి హైడ్రా పేరుతో దందా చేస్తున్నారు. బుచ్చమ్మది ఆత్మహత్య కాదు? రేవంత్‌రెడ్డి చేసిన హత్య. ఈ హత్య కేసును రేవంత్ రెడ్డి, హైడ్రాపైనా పెట్టాలని విరుచుకుపడ్డారు. బుచ్చమ్మ కుటుంబానికి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు చేసిన ఆర్థిక సాయాన్ని కేటీఆర్ గుర్తు చేశారు. హైడ్రా బాధితులందరికీ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు అండగా ఉంటారని ప్రజలెవరూ అధైర్యపడవద్దని కేటీఆర్ భరోసా ఇచ్చారు.