బీజేపీ హయాంలో 150లక్షల కోట్ల అవినీతి.. మోదీ జైలుకెళ్లడం ఖాయం..!

ఢిల్లీ మద్యం కుంభకోణంలో బినామీల పాత్ర ఉందంటూ సిసోడియా, కవితను విచారిస్తున్నారని, అలాంటి రాజకీయ వేధింపులు మానుకోకుంటే మోదీకి కూడా నియంతలకు పట్టిన గతే పడుతుందని హెచ్చరించారు.

Advertisement
Update:2023-03-14 18:25 IST

ఏప్రిల్ 14 నుంచి బీజేపీకో హఠావో.. దేశ్ కీ బచావో అనే కార్యక్రమాన్ని చేపట్టబోతున్నట్టు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు తెలిపారు. తొమ్మిదేళ్ల నరేంద్ర మోదీ పాలనలో దేశంలో సుమారు 150 లక్షల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని అన్నారాయన. దేశంలో అవినీతి పరులకు కొమ్ము కాస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ, ఏదో ఒక రోజు జైలుకెళ్లడం ఖాయమని స్పష్టం చేశారు.

అత్యంత ప్రమాదకరమైన మతతత్వ, అవినీతి పార్టీ బీజేపీ అని, బీజేపీ హయాంలోనే విజయ్ మాల్యా, లలిత్ మోదీ, అదానీ.. లక్షల కోట్లు కొల్లగొట్టారని అన్నారు కూనంనేని. దేశంలో 58 మంది బీజేపీ ఎంపీలు, 150 మంది ఎమ్మెల్యేలపై అవినీతి కేసులు ఉన్నాయని తెలిపారు. వారిపై కేసుల్లో విచారణలు లేవని, బీజేపీలో చేరితే పునీతులు, లేదంటే సీబీఐ, ఈడీ కేసులు అని విమర్శించారు. గతంలో కాంగ్రెస్ హయాంలో చిన్న చిన్న కుంభకోణాలకే ప్రభుత్వాలు కూలిపోయాయని, నేడు లక్షల కోట్ల అవినీతి జరిగినా పట్టింపు లేదని, చివరకు మోదీ, అమిత్ షా పై కేసులున్నా సీబీఐ, ఈడీ పట్టించుకోదని చెప్పారు. ఇలాంటి రాజకీయ అవినీతి తిమంగళాలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూలదోసేందుకు రాజ్యాంగ సంస్థలను దుర్వినియోగం చేస్తున్నారని, తొమ్మిదేళ్ల పాలనలో తొమ్మిది రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చేసిన ఘనత బీజేపీదని అన్నారు కూనంనేని. ఢిల్లీ మద్యం కుంభకోణంలో బినామీల పాత్ర ఉందంటూ సిసోడియా, కవితను విచారిస్తున్నారని, అలాంటి రాజకీయ వేధింపులు మానుకోకుంటే మోదీకి కూడా నియంతలకు పట్టిన గతే పడుతుందని హెచ్చరించారు. ఢిల్లీ, తెలంగాణ ప్రభుత్వాలు మోదీకి లొంగి పోయి ఉంటే లిక్కర్ స్కాం ఉండేది కాదని, ఎన్నికలు సమీపిస్తున్నందునే ప్రతిపక్ష పార్టీల ప్రభుత్వాలపై కుట్ర చేస్తున్నారని చెప్పారు.

బేజీపీకో హఠావో.. దేశ్ కీ బచావో పేరుతో ఏప్రిల్ 14 నుండి మే 18 వరకు తెలంగాణలోని 119 నియోజకవర్గాలలో సీపీఐ ఆధ్వర్యంలో ఇంటింటికీ పాదయాత్ర చేపట్టాలని నిర్ణయించినట్లు తెలిపారు. జూన్ 1 నుంచి 30 వరకు రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర చేపట్టి జులై మొదటి వారంలో హైదరాబాద్ లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామన్నారు. తెలంగాణ ఎన్నికల్లో బీజేపీని సింగిల్ డిజిట్ కి పరిమితం చేస్తామని, బండి సంజయ్ ని కూడా ఓడిస్తామని అన్నారు కూనంనేని.

Tags:    
Advertisement

Similar News