90సీట్లు మావే..! రేవంత్ రెడ్డి ధీమా

తెలంగాణలో కాంగ్రెస్ కి 90 సీట్లు ఖాయమని జోస్యం చెప్పారు రేవంత్ రెడ్డి. ఎవరి మద్దతు లేకుండా కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందన్నారు.

Advertisement
Update:2023-04-27 06:24 IST

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేడి రాజుకుంది. పార్టీ సమ్మేళనాల పేరుతో కార్యకర్తల్ని, నేతల్ని.. బీఆర్ఎస్ ఎన్నికలకు సంసిద్ధం చేస్తుంటే, కాంగ్రెస్ యాత్రలనే నమ్ముకుంది. ఓవైపు యాత్రలతో, మరోవైపు నిరసన కార్యక్రమాలతో బిజీగా ఉన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. తెలంగాణలో కాంగ్రెస్ కి 90 సీట్లు ఖాయమని జోస్యం చెప్పారాయన. ఎవరి మద్దతు లేకుండా కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందన్నారు. అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదే రాష్ట్రంలో 2లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు.

ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలో నిర్వహించిన నిరుద్యోగ నిరసన ర్యాలీలో పాల్గొన్న రేవంత్ రెడ్డి.. TSPSC పరీక్ష పత్రాల లీకేజీకి బాధ్యులైన చైర్మన్, సభ్యులను తొలగించాలని డిమాండ్‌ చేశారు. లీకేజీ ఘటనపై హైకోర్టు సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలన్నారు. పరీక్షలకు ప్రిపేర్ అయిన ఒక్కొక్క అభ్యర్థికి 1.6 లక్షల రూపాయల నిరుద్యోగ భృతి చెల్లించాలన్నారు. త్వరలో రాష్ట్రానికి ప్రియాంక గాంధీ వస్తారని చెప్పారు.

ఎంఐఎం ఏవైపో తేల్చుకోవాలి..?

ముస్లింల 4 శాతం రిజర్వేషన్‌ తొలగించడానికి రాష్ట్రం నీ జాగిరా అంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా పై మండిపడ్డారు రేవంత్ రెడ్డి. మైనార్టీలకోసం పోరాడేది కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని చెప్పారు. ఎంఐఎం ఎటువైపు ఉంటుందో అసదుద్దీన్ ఒవైసీ తేల్చుకోవాలన్నారు రేవంత్ రెడ్డి. తెలంగాణలో అకాల వర్షాలకు నష్టపోయిన రైతులకు వెంటనే పరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎకరాకు రూ.20 వేల చొప్పున పరిహారం ఇవ్వాలన్నారు. తడిసిన ధాన్యాన్ని వెంటనే ప్రభుత్వం కొనుగోలు చేయాలన్నారు. మామిడి రైతులకు ఎకరాకు రూ.50 వేలు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు రేవంత్ రెడ్డి.

Tags:    
Advertisement

Similar News