వైరా నియోజకవర్గంలో పొంగులేటిని నమ్మడం లేదా?

ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని వైరా ఎస్టీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరపున ఎవరు బరిలోకి దిగుతారనే విషయంపై ఉత్కంఠ నెలకొన్నది.

Advertisement
Update:2023-10-19 17:42 IST

వైరా నియోజకవర్గంలో పొంగులేటిని నమ్మడం లేదా?

బీఆర్ఎస్ పార్టీ బహిష్కరించడంతో కాంగ్రెస్‌లో చేరిన ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని వైరా నియోజకవర్గంలో నమ్మడం లేదా? తాను చెప్పిన వ్యక్తికి టికెట్ కేటాయించకపోతే వ్యతిరేకంగా పని చేస్తాడనే అనుమానాలున్నాయా? అంటే అవుననే సమాధానమే వస్తోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 10 నియోజకవర్గాల నుంచి బీఆర్ఎస్ అభ్యర్థులను అసెంబ్లీ గేటు తాకనివ్వను అని శపథం చేసిన పొంగులేటి.. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకే కొరకరాని కొయ్యగా మారినట్లు కనపడుతోంది.

ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని వైరా ఎస్టీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరపున ఎవరు బరిలోకి దిగుతారనే విషయంపై ఉత్కంఠ నెలకొన్నది. విజయాబాయి, మాలోతు రాందాసు వైరా టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఇందులో విజయాబాయి.. పొంగులేటి వర్గంగా ఉన్నారు. ఆమె టికెట్ కోసం పొంగులేటి తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ అంతర్గతంగా చేయించిన సర్వేలో విజయాబాయి కంటే రాందాసుకే ప్రజల మద్దతు ఎక్కువగా ఉన్నట్లు తేలింది.

కాంగ్రెస్‌లో ఎవరికి టికెట్ ఇచ్చినా గెలిపిస్తానని పొంగులేటి గతంలో చెప్పారు. కానీ ఇప్పుడు విజయాబాయికి కనుక టికెట్ ఇవ్వకపోతే తప్పకుండా వ్యతిరేకంగా పని చేస్తారని కొంత మంది కాంగ్రెస్ నాయకులు అనుమానిస్తున్నారు. అందుకు గతంలో జరిగిన సంఘటనలు ఉదహరిస్తున్నారు. 2018 ఎన్నికల సమయంలో పొంగులేటి.. బీఆర్ఎస్‌లో ఉన్నారు. ఆ సమయంలో తన అనుచరుడు రాములు నాయక్‌కు టికెట్ కోసం ప్రయత్నించారు. కానీ బీఆర్ఎస్ పార్టీ మదన్‌లాల్‌కు టికెట్ ఇచ్చింది. దీంతో మదన్‌లాల్‌ను ఓడించడానికి రాములు నాయక్‌ను స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దింపి అతడిని గెలిపించారు. ఈ విషయం అధిష్టానం వద్దకు కూడా వెళ్లింది. ఆ తర్వాతే పొంగులేటిని సీఎం కేసీఆర్ దూరంగా పెడుతూ వచ్చారు.

ఇప్పుడు కూడా పొంగులేటి సూచించే విజయాబాయికి కాకుండా రాందాసు నాయక్‌కు టికెట్ కేటాయిస్తే గతంలో జరిగినట్లే అవుతుందేమోనని స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ప్రజాదరణ లేని విజయాబాయికి టికెట్ కేటాయించడంపై కూడా కాంగ్రెస్ నాయకులు విముఖత చూపిస్తున్నారు. వైరాలో పొంగులేటి ఏం చేస్తారో అనే అనుమానాలతో కాంగ్రెస్ నాయకులు తలలు పట్టుకుంటున్నారు.

Tags:    
Advertisement

Similar News