బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య యూరియా వార్

తాము అధికారంలోకి వచ్చాక ఎరువులను ఉచితంగా పంపిణీ చేస్తామంటున్నారు కాంగ్రెస్ నేతలు. విద్యుత్ విషయంలో ఉచితాలకు కోత వేస్తామన్న నేతలు, ఎరువులు ఉచితంగా ఇస్తారా అంటూ ఎద్దేవా చేస్తున్నారు బీఆర్ఎస్ నేతలు.

Advertisement
Update:2023-09-10 07:27 IST

తెలంగాణలో యూరియా కొరత ఉంది - కాంగ్రెస్

యూరియా కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు- బీఆర్ఎస్

హఠాత్తుగా తెలంగాణలో యూరియా హాట్ టాపిక్ గా మారింది. రాష్ట్రంలో యూరియా కొరత లేకుండా చూడాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఎం కేసీఆర్‌ కు బహిరంగ లేఖ రాశారాయన. రైతులు అడిగినంత యూరియా అందుబాటులో ఉంచాలన్నారు. తెలంగాణలో రాబోయేది కాంగ్రెస్‌ ప్రభుత్వమేనని.. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి రైతులు వాడే ఎరువులను నూటికి నూరు శాతం ఉచితంగా సరఫరా చేస్తామన్నారు రేవంత్.

నిజంగానే కొరత ఉందా..?

రేవంత్ వ్యాఖ్యలను ఖండించారు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి. తెలంగాణలో యూరియా కొరత లేదని, నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని చెప్పారాయన. రైతులెవరూ ఆందోళన చెందవద్దన్నారు. ఈ సీజన్‌ లో ఇప్పటివరకు 9.93 లక్షల టన్నుల యూరియాను రైతులకు అందుబాటులో ఉంచినట్టు తెలిపారు నిరంజన్ రెడ్డి. ఇంకా 2.50 లక్షల టన్నుల నిల్వలున్నాయని, ఈ ఏడాది రుతుపవనాలు ఆలస్యం కావడం వల్ల 10 లక్షల ఎకరాల సాగు విస్తీర్ణం తగ్గిందని, ఇప్పుడున్న నిల్వలు సరిపోతాయని వివరించారు.

కృత్రిమ కొరత..

యూరియాకు కృత్రిమ కొరత సృష్టించేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని మండిపడ్డారు మంత్రి నిరంజన్ రెడ్డి. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 4 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో కృత్రిమంగా యూరియా కొరత సృష్టించి రాష్ట్రం మొత్తం అందుబాటులో లేదంటున్నారని ఇది కాంగ్రెస్ కుట్ర అని మండిపడ్డారు. కృత్రిమ కొరత సృష్టిస్తున్న డీలర్లు, సంఘాలపై కఠిన చర్యలు తీసుకుంటామని, వారి వెనక ఉన్న కాంగ్రెస్ నేతలకు బుద్ధి చెబుతామని హెచ్చరించారు నిరంజన్ రెడ్డి.

ఎన్నికల టైమ్ లో రైతులను ప్రసన్నం చేసుకోడానికి కాంగ్రెస్ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఇటీవల ఉచిత విద్యుత్ అంశం బెడిసికొట్టగా, ఇప్పుడు యూరియా విషయంలో తెలంగాణ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తోంది. తాము అధికారంలోకి వచ్చాక ఎరువులను ఉచితంగా పంపిణీ చేస్తామంటున్నారు కాంగ్రెస్ నేతలు. విద్యుత్ విషయంలో ఉచితాలకు కోత వేస్తామన్న నేతలు, ఎరువులు ఉచితంగా ఇస్తారా అంటూ ఎద్దేవా చేస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. 

Tags:    
Advertisement

Similar News