వారికి నగర బహిష్కరణ తప్పదు -రేవంత్
రాబోయే వందేళ్లపాటు గొప్ప నగరంగా ఉండేలా హైదరాబాద్‌ను తీర్చిదిద్దుతామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఔటర్ రింగ్‌రోడ్డు లోపల ఉన్న అన్ని మున్సిపాలిటీలను హెచ్‌ఎండీఏ పరిధిలోకి తెస్తామని చెప్పారు.
అభివృద్ధిని అడ్డుకునే వారికి నగర బహిష్కరణ తప్పదని హెచ్చరించారు సీఎం రేవంత్ రెడ్డి. పాతబస్తీలో మెట్రో రైలు విస్తరణ పనుల్ని అడ్డుకోవడానికి కొందరు కుటిల ప్రయత్నాలు మొదలు పెట్టారని, అలాంటి వారిని ఉపేక్షించబోమని చెప్పారాయన. శుక్రవారం పాతబస్తీ మెట్రో విస్తరణకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఆ కార్యక్రమం పూర్తయిన కొన్ని గంటలకే ఎవరో ఢిల్లీకి లేఖ రాశారని, మెట్రో నిర్మాణ పనుల్ని ఆటంక పరిచేందుకే ఆ లేఖ రాసినట్టు తమకు సమాచారం ఉందని, అలాంటి వారిని నగరం నుంచి బహిష్కరిస్తామని చెప్పారు రేవంత్ రెడ్డి. ఎల్బీనగర్ నియోజకవర్గం పరిధిలోని బైరామల్ గూడ జంక్షన్‌లో లెవల్ -2 ఫ్లైఓవర్‌ను సీఎం ప్రారంభించారు.
ఎల్బీనగర్ వస్తే నా గుండె వేగం పెరుగుతుంది..
2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్‌లో చేదు అనుభవం ఎదురైనా 2019 సార్వత్రిక ఎన్నికల్లో మల్కాజిగిరినుంచి ఎంపీగా ఎన్నికైన విషయాన్ని గుర్తు చేసుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఎల్బీనగర్ నియోజకవర్గం తనకు 30 వేల మెజార్టీ ఇచ్చిందని చెప్పారాయన. అలాంటి ఎల్బీ నగర్ కు వచ్చినప్పుడు తన గుండె వేగం పెరుగుతుందని అన్నారు రేవంత్ రెడ్డి. ఎల్బీనగర్ నుంచి హయత్‌నగర్ వరకు, ఎల్బీ నగర్ నుంచి శంషాబాద్ వరకు మెట్రో కారిడార్ ను విస్తరిస్తున్నట్టు చెప్పారు.
మూసీ అభివృద్ధికి టెండర్లు..
మూసీ నది పరిసరాల అభివృద్ధి విషయంలో తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇప్పటికే మూసీ అభివృద్ధికి టెండర్లు పిలిచామని చెప్పారు. హైదరాబాద్‌లో మూసీ కాలుష్యం నల్గొండ జిల్లాలో 50 వేల ఎకరాలను ప్రభావితం చేస్తోందన్నారు. వైబ్రంట్ తెలంగాణ 2050లో భాగంగా మూసీని ప్రక్షాళణ చేస్తున్నట్టు చెప్పారు రేవంత్ రెడ్డి. రాబోయే వందేళ్లపాటు గొప్ప నగరంగా ఉండేలా హైదరాబాద్‌ను తీర్చిదిద్దుతామన్నారు. ఔటర్ రింగ్‌రోడ్డు లోపల ఉన్న అన్ని మున్సిపాలిటీలను హెచ్‌ఎండీఏ పరిధిలోకి తెస్తామని చెప్పారు. రీజనల్ రింగ్‌రోడ్డు నిర్మాణంతో మరింత అభివృద్ధి జరుగుతుందని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి.