విద్యారంగంపై రేవంత్ ముద్ర.. తెలంగాణలో స్కిల్ యూనివర్శిటీ

యువతకు అధునాతన పరిజ్ఞానాన్ని అందించేందుకు, వారిలోని నైపుణ్యాలకు పదును పెట్టేందుకు స్కిల్ యూనివర్శిటీ ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి.

Advertisement
Update:2024-07-09 08:43 IST

బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణ విద్యారంగంలో గణనీయమైన మార్పులొచ్చాయి. పాఠశాలల అభివృద్ధినుంచి మొదలు పెడితే జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటు వరకు కేసీఆర్ మార్కు స్పష్టంగా కనపడుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక సీఎం రేవంత్ రెడ్డి విద్యారంగంపై తనదైన ముద్ర వేసేందుకు అడుగులు వేస్తున్నారు. ఐటీఐ కాలేజీలను అప్ గ్రేడ్ చేసేందుకు ఆల్రడీ పనులు మొదలయ్యాయి. ఇంటిగ్రేడెట్ హాస్టల్స్ ఏర్పాటుకోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. తాజాగా స్కిల్ యూనివర్శిటీ పేరుతో రేవంత్ రెడ్డి తన ఆలోచనను పట్టాలెక్కించబోతున్నారు. అన్నీ అనుకున్నట్టు జరిగితే, వచ్చే ఏడాది స్కిల్ యూనివర్శిటీ అడ్మిషన్లు ప్రారంభించే అవకాశముంది.

యువతకు అధునాతన పరిజ్ఞానాన్ని అందించేందుకు, వారిలోని నైపుణ్యాలకు పదును పెట్టేందుకు స్కిల్ యూనివర్శిటీ ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ లోని ఇంజినీరింగ్‌ స్టాఫ్‌ కాలేజీ ప్రాంగణంలోనే స్కిల్ యూనివర్శిటీ ఏర్పాటు చేస్తే బాగుంటుందని అధికారులకు సూచించారాయన. ఇక్కడ ఐటీ కంపెనీలు, పరిశ్రమలకు కూడా అందుబాటులో ఉంటుందని చెప్పారు. యూనివర్శిటీలో ఏయే కోర్సులు అందుబాటులో ఉండాలి, పాఠ్యాంశాలు ఎలా ఉండాలి, ఎప్పటినుంచి బోధన మొదలు పెట్టొచ్చు.. అనేదానిపై అధికారులు సమగ్ర నివేదిక రూపొందించాలని సూచించారు. జులై 23 లోపు స్కిల్ వర్శిటీ ఏర్పాటుకు అవసరమైన స్పష్టమైన ప్రతిపాదనలతో నివేదిక సమర్పించాలని చెప్పారు రేవంత్ రెడ్డి.

ఏపీలో కూడా కొత్త ప్రభుత్వం స్కిల్ సెన్సెస్ అనే ప్రక్రియ ప్రారంభించింది. పోటీ ప్రపంచంలో యువతకు సాధారణ విద్యా నైపుణ్యాలతోపాటు అదనంగా ప్రత్యేక నైపుణ్యాలు ఉంటేనే ఉపాధి సులువు అవుతుంది. కొన్ని సందర్భాల్లో కంపెనీలే శిక్షణ పేరుతో నామమాత్రపు జీతానికి వారితో పనిచేయించుకుంటాయి. అదే శిక్షణ ముందుగానే తీసుకుంటే ఉద్యోగ అవకాశాలు మరింత సులభంగా లభిస్తాయి. అందుకే ఈ స్కిల్ యూనివర్శిటీ ఏర్పాటు చేస్తున్నట్టు తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది. తన హయాంలోనే స్కిల్ యూనివర్శిటీ తెరపైకి రావాలని గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. 

Tags:    
Advertisement

Similar News