సీఎం రేవంత్ గట్టి హామీ.. ఉద్యోగులు, ఉపాధ్యాయులు హ్యాపీ

ప్రతి నెలా ఒకటో తేదీనే ఉద్యోగులకు జీతాలిస్తున్నా దాన్ని తాము ప్రచారం చేసుకోలేదని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. మూడు నెలల్లో దాదాపు 30 వేల ఉద్యోగాలు భర్తీ చేశామన్నారాయన.

Advertisement
Update:2024-03-11 07:48 IST

లోక్ సభ ఎన్నికల వేళ.. తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు గట్టి హామీలిచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. పీఆర్సీలో తగిన న్యాయం చేస్తామన్నారు. పెండింగ్‌ లో ఉన్న 4 డీఏలపై మంత్రి మండలిలో నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. డీఎస్సీ-2008 అభ్యర్థులకు కూడా న్యాయం చేస్తామన్నారు సీఎం. సీపీఎస్‌ రద్దు చేస్తామని నేరుగా హామీ ఇవ్వలేదు కానీ, రద్దుని పరిశీలిస్తామని అన్నారు. బదిలీలు, పదోన్నతులపై కూడా సానుకూల నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు రేవంత్ రెడ్డి. ఈ వరాలతో ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు సంతోషం వ్యక్తం చేశాయి.

ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలతో జరిగిన చర్చల్లో గత ప్రభుత్వంపై కూడా విమర్శలు ఎక్కు పెట్టారు సీఎం రేవంత్ రెడ్డి. గత ప్రభుత్వంలో సమస్యలు చెప్పుకోడానికే అవకాశం రాలేదని, ఆ సమస్యల్ని పరిష్కరించే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుందని భరోసా ఇచ్చారు సీఎం. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించామన్నారు. ప్రభుత్వ శాఖలవారీగా ఉద్యోగ సంఘాలు ఉండాల్సిందేనన్నారు. గత ప్రభుత్వం ఆయా సంఘాలను రద్దు చేసిందని, అందుకే ఉద్యోగుల ఆగ్రహాన్ని చవిచూసిందని చెప్పారు. గుర్తింపు సంఘాలతో చర్చించకుండా తమ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకోదని హామీ ఇచ్చారు రేవంత్ రెడ్డి.

మాకు ప్రచారం ముఖ్యం కాదు..

ప్రతి నెలా ఒకటో తేదీనే ఉద్యోగులకు జీతాలిస్తున్నా దాన్ని తాము ప్రచారం చేసుకోలేదని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. మూడు నెలల్లో దాదాపు 30 వేల ఉద్యోగాలు భర్తీ చేశామన్నారాయన. 11 వేల పోస్ట్ లతో మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ జారీ చేశామన్నారు. రోజుకు 18 గంటలు పనిచేస్తూ పాలనను గాడిలో పెడుతున్నట్టు పేర్కొన్నారు. ఇకనుంచి రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీలకు ఉచిత విద్యుత్‌ సరఫరా చేస్తామన్నారు రేవంత్ రెడ్డి. స్కూల్స్ లో కిందిస్థాయి సిబ్బందిని నియమించి, వారికి జీతాలు చెల్లిస్తామన్నారు. 

Tags:    
Advertisement

Similar News