కేసీఆర్ అభివృద్ధి ప్రదాత.. మరోసారి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

గతంలో అవుటర్ రింగ్ రోడ్ అవసరం లేదని కొందరు అన్నారని, ఇప్పుడది హైదరాబాద్ కు లైఫ్ లైన్ గా మారిందని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి.

Advertisement
Update:2024-02-21 18:58 IST

తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి.. కేసీఆర్ పై చేసిన పరుష వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. అయితే ఇటీవల కాలంలో ఆయన వరుసగా కేసీఆర్ చేసిన అభివృద్ధి గురించి, ముఖ్యంగా హైదరాబాద్ నగర అభివృద్ధికి ఆయన చేసిన కృషి గురించి ప్రస్తావిస్తున్నారు. మూడు రోజుల క్రితం రాష్ట్ర అగ్నిమాపక విభాగం కమాండ్ కంట్రోల్ సెంటర్ ని ప్రారంభించిన సందర్భంలో కేసీఆర్ హైదరాబాద్ అభివృద్ధికి చేసిన కృషిని మెచ్చుకున్నారు రేవంత్ రెడ్డి. తాజాగా మరోసారి ఆయన కేసీఆర్ సహా వైఎస్ఆర్, చంద్రబాబు కృషిని కొనియాడారు. ‘సీఐఐ తెలంగాణ’ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశం ఇందుకు వేదికగా మారింది.


రాజకీయాలు ఎలా ఉన్నా వైఎస్ఆర్, చంద్రబాబు, కేసీఆర్ హైదరాబాద్ అభివృద్ధిని కొనసాగించారని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. అభివృద్ధి విషయంలో తమ ప్రభుత్వానికి ఎలాంటి భేషజాలు లేవని చెప్పారు. నగర అభివృద్ధి కోసం గత పాలకులు తీసుకున్న మంచి నిర్ణయాలను కొనసాగిస్తామన్నారు. తెలంగాణలో విద్య, ఉపాధి అవకాశాల కల్పనలో సీఐఐతో కలిసి నడుస్తామన్నారు. 64ఐటీఐ లను స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్లుగా మారుస్తున్నామని, రూ.2000 కోట్లతో అభివృద్ధి చేయబోతున్నామన్నారు. స్కిల్ డెవలప్ మెంట్ లో జాయిన్ అయిన విద్యార్థులకు డిగ్రీ సర్టిపికెట్స్ ఇస్తామని చెప్పారు.

గతంలో అవుటర్ రింగ్ రోడ్ అవసరం లేదని కొందరు అన్నారని, ఇప్పుడది హైదరాబాద్ కు లైఫ్ లైన్ గా మారిందని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు విధానపరమైన నిర్ణయం తీసుకుని ఐడీపీఎల్‌ను ప్రారంభించినందువల్లే ఈరోజు ఫార్మా రంగంలో హైదరాబాద్‌ మెరుగైన స్థితిలో ఉందన్నారు. పాలకుల నిర్ణయాలు, విధానాలు రాష్ట్ర ఆర్థిక పురోగతికి తోడ్పడతాయని చెప్పారు రేవంత్ రెడ్డి. ప్రపంచ దేశాలతో తెలంగాణ పోటీ పడాలన్నదే తమ ప్రభుత్వ విధానమని వివరించారు. 

Tags:    
Advertisement

Similar News