ఫిబ్రవరి 2న ప్రజల్లోకి.. ఎంపీ అభ్యర్థులపై రేవంత్ రెడ్డి క్లారిటీ..!
ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే ఆశావహులు గాంధీ భవన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు రేవంత్ రెడ్డి. మార్చి 3 సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు చెప్పారు.
ప్రజల్లోకి వెళ్లేందుకు ఫిబ్రవరి 2 నుంచి బహిరంగ సభలు నిర్వహించనున్నట్లు చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. ఫిబ్రవరి 2న ఇంద్రవెల్లిలో బహిరంగ సభ నిర్వహిస్తామన్నారు. గాంధీభవన్‌లో జరిగిన తెలంగాణ ప్రదేశ్ ఎన్నికల కమిటీ సమావేశం తర్వాత సీఎం రేవంత్ మీడియాతో మాట్లాడారు. రాబోయే రాజ్యసభ అభ్యర్థులను ఎంపిక చేసే అధికారం అధిష్టానానికి అప్పజెప్తూ తీర్మానం చేశామన్నారు.
ఇక పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే ఆశావహులు గాంధీ భవన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు రేవంత్ రెడ్డి. మార్చి 3 సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు చెప్పారు. జనరల్ సీట్లలో పోటీ చేయాలనుకునే వారు అప్లికేషన్ ఫామ్‌తో పాటు రూ. 50 వేలు ఫీజు, ఎస్సీ, ఎస్టీ, వికలాంగులైతే రూ.25 వేలు చెల్లించాలన్నారు. దరఖాస్తులను స్క్రీనింగ్ కమిటీ పరిశీలిస్తుందన్నారు. సీఈసీ సమావేశాల్లో అభ్యర్థులపై అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. 17 పార్లమెంట్ స్థానాలు గెలవాలని టార్గెట్‌గా పెట్టుకున్నామన్నారు రేవంత్ రెడ్డి. సోనియాగాంధీ ఖమ్మం నుంచి పోటీ చేయడం ప్రచారం మాత్రమేనని.. తెలంగాణ నుంచి పోటీ చేయాలని మాత్రమే తీర్మానం చేశామని చెప్పారు.
తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ చచ్చిపోయిందన్న రేవంత్ రెడ్డి.. ఆ పార్టీకి పార్లమెంట్ ఎన్నికల్లో ఓటేస్తే మూసీలో వేసినట్లేనన్నారు రేవంత్ రెడ్డి. కేసీఆర్ మోడీతో రహస్య ఒప్పందాలు చేసుకుంటున్నారని ఆరోపించారు. రాజకీయ కుట్రతోనే ఎమ్మెల్సీల ప్రమాణస్వీకారం జరగకుండా ఆపారన్నారు రేవంత్ రెడ్డి. ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తనను కలవడంపైనా స్పందించారు రేవంత్ రెడ్డి. కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు వచ్చినా అపాయింట్‌మెంట్ ఇస్తానని చెప్పారు.