నేడు నాగర్‌కర్నూల్‌ పర్యటనకు సీఎం కేసీఆర్.. రేపు ములుగుకు మంత్రి కేటీఆర్

ఈ రోజు సాయంత్రం నాగర్‌కర్నూలు శివారు పద్మనాయక ఫంక్షన్ హాల్ సమీపంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తారు. ఇందులో సీఎం కేసీఆర్ పాల్గొని, ప్రసంగించనున్నారు.

Advertisement
Update:2023-06-06 08:34 IST

నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని కొల్లాపూర్ చౌరస్తాలో రూ.53 కోట్ల వ్యయంతో నిర్మించిన నూతన కలెక్టరేట్ భవన సముదాయాన్ని సీఎం కేసీఆర్ మంగళవారం ప్రారంభించనున్నారు. ఇదే పర్యటనలో భాగంగా ఎస్పీ కార్యాలయంతో పాటు, దేశిఇటిక్యాల శివారులో నిర్మించిన బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని కూడా ప్రారంభిస్తారు. ఈ రోజు సాయంత్రం నాగర్‌కర్నూలు శివారు పద్మనాయక ఫంక్షన్ హాల్ సమీపంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తారు. ఇందులో సీఎం కేసీఆర్ పాల్గొని, ప్రసంగించనున్నారు. హైదరాబాద్ నుంచి బయలుదేరి 3.320 గంటలకు నాగర్‌కర్నూల్ చేరుకుంటారని అధికారులు తెలియజేశారు.

సీఎం కేసీఆర్ తొలిసారి నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రానికి వస్తుండటంతో అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. కలెక్టర్ ఉదయ్‌కుమార్, ఎస్పీ మనోహర్ నిరంతరం సమీక్ష నిర్వహిస్తూ.. ఏర్పాట్లలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూస్తున్నారు. ఇక బహిరంగ సభ ప్రాంతాన్ని ఎమ్మెల్యే మర్రి జనార్థన్ రెడ్డి పరిశీలించారు. బహిరంగ సభకు దాదాపు 1 లక్ష మంది వస్తారని బీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి. ప్రజలను సీఎం సభకు తరలించేందుకు ఎమ్మెల్యేలు మర్రి జనార్థన్ రెడ్డి, గువ్వల బాలరాజు, హర్షవర్థన్ రెడ్డి, జైపాల్ యాదవ్ ఏర్పాట్లు చేశారు. నాగర్‌కర్నూల్ పట్టణమంతా గులాబీ శోభను సంతరించుకున్నది.

రేపు ములుగు పర్యటనకు మంత్రి కేటీఆర్

మున్సిపల్, పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ బుధవారం (జూన్ 7) ములుగు జిల్లాలో పర్యటించనున్నారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్ మీటింగ్ హాల్‌లో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ సమీక్ష నిర్వహించారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంత్రి కేటీఆర్ జిల్లా కేంద్రంలో పలు కార్యక్రమాలకు సంబంధించిన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు.

ములుగులో రూ.65 కోట్లతో నిర్మించనున్న నూతన ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ కార్యాలయానికి మంత్రి శంకుస్థాపన చేయనున్నారు. మేడారంలో శాశ్వత ప్రాతిపదిక చేపట్టనున్న రూ.10 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. అలాగే ములుగు జిల్లా కేంద్రంలో రూ.30 లక్షల నిధులతో నిర్మించనున్న గ్రంథాలయ భవనానికి శంకుస్థాపన చేస్తారు.

దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా రేపు సాగునీటి దినోత్సవం నిర్వహించనున్నారు. ములుగు పర్యటనకు వెళ్లనున్న మంత్రి కేటీఆర్ రామప్పలో గోదావరి జలాలకు పూజ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. రామప్ప రిజర్వాయర్ పూర్తయిన నేపథ్యంలో అక్కడి చెరువుపై ఇరిగేషన్ ఉత్సవాన్ని నిర్వహించనున్నారు. అనంతరం ములుగు జిల్లా కేంద్రంలోని సాధన హై స్కూల్ పక్కన భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. అక్కడ ఐకేపీ మహిళలకు వడ్డీ లేని రుణాల చెక్కులు, గొల్ల కురుమలకు రెండో విడత గొర్రెల పంపిణీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. 

Tags:    
Advertisement

Similar News