మళ్లీ ప్రజల్లోకి కేసీఆర్.. రేపు మూడు సభలు
సీఎం కేసీఆర్ అక్టోబర్ 15 నుంచి 18 మధ్య దాదాపు ఏడు బహిరంగ సభల్లో పాల్గొన్నారు. నవంబర్ 9 నాటికి మరో 35 సభల్లో కేసీఆర్ పాల్గొంటారు.
సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచారాన్ని మళ్లీ ముమ్మరం చేయనున్నారు. దసరా పండుగ కారణంగా ప్రచారానికి విరామమిచ్చిన గులాబీ బాస్.. గురువారం మూడు నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటన చేయనున్నారు. గురువారం అచ్చంపేట, వనపర్తి, మునుగోడు సభల్లో సీఎం కేసీఆర్ పాల్గొని ప్రసంగిస్తారు. ఇక అక్టోబర్ 27 అంటే శుక్రవారం కూడా మూడు సభల్లో పాల్గొంటారు సీఎం కేసీఆర్. పాలేరు, మహబూబబాద్, వర్ధన్నపేటలో జరిగే సభల్లో ప్రసంగిస్తారని పార్టీ వర్గాలు స్పష్టం చేశాయి.
వాస్తవానికి గురువారం అచ్చంపేట, మునుగోడుతో పాటు నాగర్‌కర్నూల్‌లో ముఖ్యమంత్రి ప్రసంగించాల్సి ఉండగా.. షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు చేశారు. నాగర్‌కర్నూల్‌ను తొలగించి వనపర్తిని చేర్చారు. అక్టోబర్ 27న కూడా పాలేరు, స్టేషన్ ఘన్‌పూర్ సమావేశాల్లో కేసీఆర్ పాల్గొనాల్సి ఉండగా.. స్టేషన్ ఘన్‌పూర్ తొలగించి మహబూబబాద్, వర్ధన్నపేటను చేర్చారు.
సీఎం కేసీఆర్ అక్టోబర్ 15 నుంచి 18 మధ్య దాదాపు ఏడు బహిరంగ సభల్లో పాల్గొన్నారు. నవంబర్ 9 నాటికి మరో 35 సభల్లో కేసీఆర్ పాల్గొంటారు. నవంబర్ 9న గజ్వేల్, కామారెడ్డి స్థానాల్లో నామినేషన్ దాఖలు చేస్తారు. సీఎం కేసీఆర్ షెడ్యూల్‌లో మరిన్ని బహిరంగ సభలు చేర్చే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. నవంబర్ 28న ప్రచారం ముగిసేనాటికి దాదాపు 100 నియోజకవర్గాల్లో కేసీఆర్ పాల్గొంటారని తెలుస్తోంది. నవంబర్ 30న తెలంగాణ అసెంబ్లీకి పోలింగ్ జరగనుంది.