వాళ్లని బంగాళాఖాతంలో కలిపేద్దాం -కేసీఆర్

రాష్ట్రంలో మళ్లీ ఆ దుర్మార్గులు అధికారంలోకి వస్తే కరెంటు పోతుందని, రైతుబంధుకు రాం రాం చెబుతారని, దళితబంధుకు జై భీమ్‌ కొడతారని హెచ్చరించారు కేసీఆర్.

Advertisement
Update:2023-06-04 20:51 IST

గతంలో రెవెన్యూ విభాగంలో భయంకరమైన అవినీతి ఉండేదని, ధరణి పోర్టల్ వల్ల ఆ అవినీతికి అడ్డుకట్ట పడిందని అన్నారు సీఎం కేసీఆర్. ఏ భూమి ఎవరి పేరుతో ఉందో సులభంగా తెలిసిపోతోందన్నారు. ధరణి పోర్టల్‌ ను బంగాళాఖాతంలో వేస్తామని కాంగ్రెస్‌ నేతలు చెబుతున్నారని, ఆ మాటలన్న వారినే బంగాళాఖాతంలో కలిపేద్దామన్నారు. ధరణి పోర్టల్‌ ఉండటం వల్లే 15 నిమిషాల్లో రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తవుతోందని వివరించారు. ధరణిని తొలగిస్తే రైతుల ఖాతాల్లో డబ్బులు పడతాయా? అని ప్రశ్నించారు. నిర్మల్ కలెక్టరేట్ ని, బీఆర్ఎస్ కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం ఎల్లపల్లిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేసీఆర్ విపక్షాలపై విరుచుకుపడ్డారు.

రాష్ట్రంలో మళ్లీ ఆ దుర్మార్గులు అధికారంలోకి వస్తే కరెంటు పోతుందని, రైతుబంధుకు రాం రాం చెబుతారని, దళితబంధుకు జై భీమ్‌ కొడతారని హెచ్చరించారు.ఎన్నికల సమయం దగ్గరకి వచ్చే సరికి అడ్డం, పొడుగు.. ఇష్టం వచ్చినట్లు మాట్లాడతారని 60 సంవత్సరాల్లో వారు ఏమైనా చేశారా అని ప్రశ్నించారు. ఇవాళ బ్రహ్మాండంగా అభివృద్ధి కళ్లముందు జరుగుతోందని వివరించారు కేసీఆర్.

SRSP కింద 2 స్కీమ్‌ లు త్వరలో పూర్తి చేస్తామన్న సీఎం కేసీఆర్.. లక్ష ఎకరాలకు సాగునీరు అందిస్తామని చెప్పారు. నిర్మల్ జిల్లాలోని 396 గ్రామ పంచాయతీలకు ప్రత్యేకంగా రూ.10లక్షల చొప్పున మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు. ఒక్కో మండల కేంద్రానికి రూ.20లక్షల చొప్పున జిల్లాలోని 19 మండలాలకు నిధులు విడుదల చేస్తామన్నారు. బాసర ఆలయ పునర్నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమానికి తానే వస్తానన్నారు. బాసర ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పారు.

ఏడాదికి రూ.12వేల కోట్లు ఖర్చు పెట్టి రైతులకు ఉచిత విద్యుత్‌ ఇస్తున్నామని, గృహలక్ష్మి పథకం కింద ప్రతి నియోజకవర్గానికి 3వేల ఇళ్లు మంజూరు చేస్తున్నామని చెప్పారు సీఎం కేసీఆర్. సొంత స్థలంలో ఇల్లు కట్టుకునే ప్రతి ఒక్కరికి రూ.3లక్షలు చొప్పున మంజూరు చేస్తామన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాకు ఇంజినీరింగ్‌ కాలేజీ మంజూరు చేస్తున్నామని చెప్పారు.

Tags:    
Advertisement

Similar News