ఇంటికొచ్చిన సీఐడీ.. రామోజీరావు, శైలజ విచారణ

ముందుగానే నోటీసులు ఇచ్చి ఈరోజు శైలజా కిరణ్ ఇంట్లో విచారణ చేపట్టారు రామోజీరావుని కూడా అక్కడికే పిలిపించారు.

Advertisement
Update:2023-04-03 11:36 IST

మార్గదర్శి చిట్‌ ఫండ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కేసులో.. రామోజీరావు, శైలజా కిరణ్ కి ఏపీ సీఐడీ అధికారులు పలు ప్రశ్నలు సంధించారు. సంస్థ చైర్మన్ హోదాలో రామోజీరావు, ఎండీ హోదాలో శైలజా కిరణ్ విచారణ ఎదుర్కొంటున్నారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని శైలజ ఇంటిలో ఈరోజు విచారణ మొదలైంది. దాదాపు 200 మంది సీఐడీ సిబ్బంది శైలజ ఇంటికి వచ్చినట్టు తెలుస్తోంది. చిట్‌ ఫండ్‌ చట్టం నిబంధనలు ఉల్లంఘించి నిధులు మళ్లించడంపై ఏ–1గా రామోజీరావు, ఏ–2గా శైలజతోపాటు మార్గ­దర్శి చిట్‌ఫండ్స్‌ మేనేజర్లపై సీఐడీ అధికారులు కేసులు నమోదుచేశారు, విచారణ చేపట్టారు.

మార్గదర్శి చిట్‌ ఫండ్స్‌ కార్యాలయాల్లో సీఐడీ అధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించి పలు కీలక రికార్డులు స్వాధీనం చేసుకున్నారు, అదే సమయంలో నలుగురు బ్రాంచ్ మేనేజర్లను అరెస్ట్ చేశారు. చిట్‌ ఫండ్‌ చట్టానికి విరుద్ధంగా చందాదారుల సొమ్మును మ్యూచువల్‌ ఫండ్స్, షేర్‌ మార్కెట్లలో పెట్టుబడులుగా పెట్టడం, ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా డిపాజిట్లు సేకరిస్తున్నారనే ఆరోపణలతో ఈ విచారణ మొదలైంది.

బ్యాలెన్స్‌ షీట్‌, చిట్‌ గ్రూప్‌ లకు చెందిన ఫామ్‌ 21ని కూడా మార్గదర్శి సంస్థ సమర్పించలేదని సీఐడీ అధికారులు చెబుతున్నారు. మొత్తం ఏడు మార్గదర్శి బ్రాంచ్‌ల్లో తనిఖీలు చేయగా అక్రమాలు జరిగినట్టు గుర్తించామంటున్నారు. ముందుగానే నోటీసులు ఇచ్చి ఈరోజు శైలజా కిరణ్ ఇంట్లో విచారణ చేపట్టారు రామోజీరావుని కూడా అక్కడికే పిలిపించారు. మార్గదర్శి వ్యవహారంలో అటు వైసీపీ నుంచి తీవ్ర విమర్శలు ఎదురవుతున్నాయి. రామోజీరావు చట్టానికి అతీతుడిగా వ్యవహరిస్తున్నారని, తప్పు చేసి, కేసులు నమోదు చేస్తే కక్షసాధింపు అంటున్నారని మండిపడ్డారు వైసీపీ నేతలు. 

Tags:    
Advertisement

Similar News