ఇవాళ టీ.టీడీపీ నేతలతో బాబు భేటీ.. ఎజెండా అదే!
సమావేశంలో తెలంగాణ టీడీపీ అధ్యక్షుడి నియామకంపైనా నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. ఈసారి అధ్యక్ష బాధ్యతలు యువకులకు ఇవ్వనున్నారని తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం ఘన విజయం సాధించడంతో తెలంగాణపైనా ఫోకస్ పెట్టాలని భావిస్తున్నారు చంద్రబాబు. తెలంగాణలో ఇంకా కొంత ఓట్‌బ్యాంక్ ఉండడంతో తిరిగి పార్టీని యాక్టివ్ చేయాలని యోచిస్తున్నారు. ఇందులో భాగంగా ఇవాళ ఆయన హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌కు రానున్నారు. ఏపీ సీఎంగా బాధ్యతలు చేపట్టాక ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌కు రావడం ఇది రెండో సారి.
సాయంత్రం హైదరాబాద్ చేరుకోనున్న చంద్రబాబు.. తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలతో ప్రత్యేకంగా సమావేశమవుతారు. తెలంగాణలో పార్టీ బలోపేతంపై చర్చలు జరపనున్నారు. ఈ సమావేశంలో తెలంగాణ టీడీపీ అధ్యక్షుడి నియామకంపైనా నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. ఈసారి అధ్యక్ష బాధ్యతలు యువకులకు ఇవ్వనున్నారని తెలుస్తోంది. ఇటీవల అమరావతిలో జరిగిన టీడీపీ పొలిట్‌బ్యూరో సమావేశంలోనూ తెలంగాణలో టీడీపీ బలోపేతంపై చర్చించారు చంద్రబాబు. ఇప్పటికీ తెలంగాణలో 10 శాతం ఓటు బ్యాంకు ఉందని తెలుగుదేశం భావిస్తోంది.
తెలంగాణలో ఇప్పటికే కీలకనేతలందరూ టీడీపీని వీడారు. కొంతమంది బీఆర్ఎస్‌లో చేరగా.. మరికొంత మంది కాంగ్రెస్‌లో చేరారు. మొన్నటి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్న టీడీపీ.. పరోక్షంగా కాంగ్రెస్‌కు మద్దతు తెలిపింది. అయితే టీడీపీని వీడిన నేతలందరినీ తిరిగి పార్టీలోకి ఆహ్వానించాలని చంద్రబాబు నిర్ణయించినట్లు తెలుస్తోంది. తద్వారా త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీని సిద్ధం చేయాలని ఆయన భావిస్తున్నారు.