బీజేపీ తరపున పోటీ చేయడానికి అభ్యర్థులు కూడా కరువయ్యారు : రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్

ఒకవైపు అధికార బీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలపై విరుచుకు పడుతూనే.. బీజేపీకి అభ్యర్థులు కూడా కరువయ్యారు అంటూ మాట్లాడారు.

Advertisement
Update:2023-06-12 07:30 IST

తెలంగాణలో బీజేపీ పరిస్థితి ఏంటో స్వయంగా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడే స్పష్టం చేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి రావాలని హైకమాండ్ లక్ష్యంగా పెడితే.. పార్టీ తరపున పోటీ చేయడానికి అభ్యర్థులే లేరంటూ తేల్చి పారేశారు. రాజన్న సిరిసిల్లా జిల్లా వేములవాడ నియోజకవర్గం బీజేపీ సీనియర్ కార్యకర్తల సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఆయన నోరు జారారా? లేదంటే మనసులో మాట బయటపెట్టారా అనే చర్చ ఇప్పుడు పార్టీలో జరుగుతోంది.

వేములవాడలో జరిగిన సమావేశంలో మాజీ కేంద్ర మంత్రి, బీజేపీ నాయకుడు ప్రకాశ్ జవదేకర్‌తో పాటు బండి సంజయ్ కూడా ఉన్నారు. ఒకవైపు అధికార బీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలపై విరుచుకు పడుతూనే.. బీజేపీకి అభ్యర్థులు కూడా కరువయ్యారు అంటూ మాట్లాడారు. అంతే కాకుండా బీజేపీ తెలంగాణకు విలన్ అంటూ సంబోధించారు. అయితే, తాను ఎంత పొరపాటుగా మాట్లాడానో గ్రహించిన బండి సంజయ్.. వెంటనే మిస్టేక్‌లో నాలుక జారిందని వివరణ ఇచ్చుకున్నారు.

కాగా, బండి సంజయ్ నోరు జారలేదని.. కావాలనే తమ పార్టీ గురించి బయటకు చెప్పారని సర్వత్రా చర్చ జరుగుతోంది. ప్రస్తుతం బీజేపీలో గ్రూపు తగాదాలు బయటకు వస్తున్నాయి. పాత, కొత్త నాయకుల మధ్య సమన్వయం లేకపోవడం.. చీటికీ మాటికీ ఢిల్లీకి వెళ్లి బండి సంజయ్‌పై అధిష్టానానికి ఫిర్యాదులు చేయడంతో ఇటీవల ఆయన అసహనంగా ఉన్నారు. తన పని తీరుపై పదే పదే ఫిర్యాదులు చేయడంతో ఒక వర్గం నాయకులపై ఆగ్రహంగా కూడా ఉన్నారు.

ఇటీవల అధిష్టానం పెద్దలు కూడా రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో పార్టీ తరపున పోటీ చేయడానికి సరైన అభ్యర్థులను గుర్తించాలని కూడా సూచించారు. కానీ ఎంత వెదికినా బరిలోకి దిగి పోటీ చేసే సత్తా ఉన్న నాయకులు కరువయ్యారు. ఈ క్రమంలోనే బండి సంజయ్ తన అసహనాన్ని ఇలా వెళ్లగక్కారనే చర్చ జరుగుతోంది. టంగ్ స్లిప్ అవడం కాదని.. మనసులో మాటే అని పార్టీలో ఒక వర్గం నాయకులు కూడా చర్చించుకోవడం గమనార్హం. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు పోటీ ఇచ్చే దమ్మున నాయకులు బీజేపీలో లేరనే విషయం గ్రహించే ఈ మాట అనుంటారని భావిస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News