మ్యాటర్ వీక్, ప్రచారం పీక్.. రేవంత్‌పై కేటీఆర్ సెటైర్లు
గౌడన్నలను చెట్ల మీద గంటల తరబడి నిలబెట్టి, వారి వృత్తి మీద చౌకబారు జోకులు వేస్తూ దాన్ని ప్రచారానికి వాడుకోవడం అమానవీయం, దుర్మార్గం అన్నారు కేటీఆర్.
ఆదివారం కాటమయ్య రక్షణ కవచం కిట్ల పంపిణీ కార్యక్రమం సందర్భంగా గీత కార్మికుల పట్ల సీఎం రేవంత్ రెడ్డి వ్యవహరించిన తీరుపై ఫైర్ అయ్యారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. గౌడన్నల పట్ల ముఖ్యమంత్రి దుర్మార్గంగా ప్రవర్తించారంటూ మండిపడ్డారు. గంటల తరబడి గౌడన్నలను చెట్ల మీద ఉంచడం సరికాదన్నారు. ఈ మేరకు ఓ ట్వీట్ చేశారు కేటీఆర్.
మానవత్వం ఉన్న నాయకుడెవరూ ఇటువంటి వికృత చేష్టలకు పాల్పడరని విమర్శించారు కేటీఆర్. గౌడన్నలను చెట్ల మీద గంటల తరబడి నిలబెట్టి, వారి వృత్తి మీద చౌకబారు జోకులు వేస్తూ దాన్ని ప్రచారానికి వాడుకోవడం అమానవీయం, దుర్మార్గం అన్నారు కేటీఆర్. మ్యాటర్ వీక్ ఉన్నప్పుడే.. ప్రచారం పీక్ ఉంటుందని, సీఎం రేవంత్ మతి లేని చర్యలు చూస్తే ఈ విషయం తెలంగాణ ప్రజలకు కూడా అర్థమవుతుందన్నారు.
ఆదివారం రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ లష్కర్‌గూడలో కాటమయ్య రక్షణ కవచం స్కీమ్ ప్రారంభించారు సీఎం రేవంత్. ఈ స్కీమ్ కింద గీత కార్మికలకు సేఫ్టీ కిట్లను అందజేశారు. సేఫ్టీ మోకులను గౌడన్నలతో కలిసి చెక్ చేయించారు. వాటి పనితీరు ఎలా ఉందని గౌడన్నలు అడిగి తెలుసుకున్నారు. అయితే ఈ సందర్భంగా గీత కార్మికులను చెట్లపై నిలబెట్టి మాట్లాడడం వివాదాస్పదంగా మారింది. దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.