మేము బీ టీమ్ కాదు.. మీరు సీ(చోర్) టీమ్..
తెలంగాణ భవన్‌లో జరిగిన వికలాంగుల కృతజ్ఞత సభలో పాల్గొన్న కేటీఆర్ రాబోయే ఎన్నికల్లో ఒక్కొక్కరు పది మందిని బీఆర్ఎస్‌కు ఓటు వేసేలా ప్రోత్సహించాలన్నారు.
కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ చేసిన కామెంట్స్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. BRS ఎవరికీ బీ టీమ్ కాదన్న కేటీఆర్.. A టూ Z స్కామ్‌లకు పాల్పడిన కాంగ్రెస్ సీ టీమ్ అని ఆరోపించారు. సీ టీమ్ అంటే చోర్ టీమ్ తప్ప మరొకటి కాదంటూ హస్తం పార్టీపై విరుచుకుపడ్డారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని బీజేపీ కోవర్ట్‌గా ఆరోపించిన కేటీఆర్.. ఏదో ఓ రోజు ఉన్న కొద్ది మంది ఎమ్మెల్యేలతో రేవంత్ బీజేపీలోకి వెళ్లడం ఖాయమంటూ కాంగ్రెస్‌కు వార్నింగ్ ఇచ్చారు. గాంధీ భవన్‌ను గాడ్సేకు అప్పగించారంటూ తీవ్ర విమర్శలు చేశారు కేటీఆర్.
మనిషి జీవితంలోని ప్రతి దశను కవర్ చేసేలా బీఆర్ఎస్ పథకాలు అమలు చేస్తోందన్నారు కేటీఆర్. తెలంగాణ భవన్‌లో జరిగిన వికలాంగుల కృతజ్ఞత సభలో పాల్గొన్న కేటీఆర్ రాబోయే ఎన్నికల్లో ఒక్కొక్కరు పది మందిని బీఆర్ఎస్‌కు ఓటు వేసేలా ప్రోత్సహించాలన్నారు. గడిచిన తొమ్మిదన్నరేళ్లలో వికలాంగుల పింఛను కోసం రూ.10 వేల 300 కోట్లు ఖర్చు చేశామన్నారు. దాదాపు 5 లక్షల 65 వేల మందికి లబ్ధి చేకూర్చామన్నారు.
కాంగ్రెస్ పాలిత ఛత్తీస్‌గఢ్‌లో వికలాంగుల పింఛను కేవలం రూ.200 మాత్రమే ఇస్తున్నారని, లబ్ధిదారులు కూడా లక్షా 25 వేల మందేనని చెప్పారు. ఇక బీజేపీ పాలిత గుజరాత్‌లో కేవలం 47 వేల 34 మంది వికలాంగులకు నెలకు రూ.600 నుంచి వెయ్యి పింఛను ఇస్తున్నారని చెప్పారు. వికలాంగులకు మరింత మంచి చేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు కేటీఆర్. తెలంగాణ దశాబ్ధి పండుగ సందర్భంగా రూ.3 వేల పింఛన్ రూ.4,016కు పెంచిన విషయాన్ని గుర్తు చేశారు. కేసీఆర్ మరోసారి సీఎం అయితే ఆ మొత్తాన్ని రూ. 6,016 కు పెంచుతామని హామీ ఇచ్చారు.