జాబ్ క్యాలెండర్ హామీపై కేటీఆర్ క్లారిటీ
జాబ్ క్యాలెండర్ హామీని అమలు చేస్తామని 100 శాతం నమ్మకంతో ఉన్నామని చెప్పారు కేటీఆర్. గడిచిన 9 ఏళ్లలో లక్షా 60 వేల ఉద్యోగాలు భర్తీ చేసినట్లు చెప్పారు.
బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే జాబ్ క్యాలెండర్ తీసుకువస్తామన్న హామీపై ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ మరోసారి క్లారిటీ ఇచ్చారు. ట్విట్టర్‌లో పృథ్వీరాజ్ అనే వ్యక్తి ఎన్నికల ముందు జాబ్ క్యాలెండర్ ఇస్తామన్న హామీని ఎలా నమ్మాలంటూ కేటీఆర్‌ను ప్రశ్నించారు. ఈ హామీని నెరవేర్చగలుగుతారా అంటూ అనుమానం వ్యక్తం చేశారు.
అయితే పృథ్వీరాజ్ ప్రశ్నకు స్పందించిన కేటీఆర్.. జాబ్ క్యాలెండర్ హామీని అమలు చేస్తామని 100 శాతం నమ్మకంతో ఉన్నామని చెప్పారు కేటీఆర్. గడిచిన 9 ఏళ్లలో లక్షా 60 వేల ఉద్యోగాలు భర్తీ చేసినట్లు చెప్పారు. ఇది కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో ఓ అద్భుతమన్నారు.
ఇక ఇప్పటికే వాయిదా పడిన లేదా రద్దయిన పరీక్షలను వీలైనంత త్వరగా నిర్వహిస్తామని చెప్పారు. తర్వాత జాబ్ క్యాలెండర్‌ను తీసుకువస్తామని వివరించారు. ఇక నమ్మకం గురించి మాట్లాడితే ఇప్పటివరకూ తాము చేసిన పనులే ఇందుకు సాక్ష్యమని తెలిపారు.