కొత్త సంవత్సరంలో ప్రజల్లోకి కేసీఆర్‌

'ఆస్క్‌ కేటీఆర్‌' లైవ్‌ చాట్‌లో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌

Advertisement
Update:2024-10-31 22:13 IST

బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారని కేటీఆర్‌ తెలిపారు. సోషల్‌ మీడియా ప్లాట్‌ ఫాం 'ఎక్స్‌' లో ఆస్క్‌ కేటీఆర్‌ హ్యాష్‌ ట్యాగ్‌ పై గురువారం సాయంత్రం ఆయన నెటిజన్లతో ఇంటరాక్ట్‌ అయ్యారు. కేసీఆర్‌ ఆరోగ్యం గురించి నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు కేటీఆర్‌ సమాధానమిస్తూ.. ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారని తెలిపారు. 2025 తర్వాత కేసీఆర్ విస్తృతంగా ప్రజల్లోకి వస్తారని, ప్రజల మధ్యనే ఉంటారని తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలు, 420 హామీల అమలు కోసం బాధ్యత గల ప్రతిపక్ష నేతగా కేసీఆర్‌ ప్రభుత్వానికి తగినంత సమయం ఇస్తున్నారని తెలిపారు. పదేళ్లు బీఆర్‌ఎస్‌ అధికారంలో ఉండటంతోనే ప్రజల్లో సాధారణంగా వ్యతిరేకత వచ్చిందని, ఆ కారణంతోనే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయామన్నారు. కాంగ్రెస్‌ ఇచ్చిన అబద్ధపు, బూటకపు హామీలు కూడా ప్రజల్లో ఆశలు రేకెత్తించాయని తెలిపారు. అలవికాని హామీలెన్నో ఇచ్చిన కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల కోసమంటూ చేసిందేమి లేదన్నారు. కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలన్నీ అమలు చేసే వరకు వదిలి పెట్టేది లేదన్నారు. ప్రభుత్వం ప్రజలకు జవాబుదారీగా పని చేసేలా వెంటపడుతామన్నారు. ప్రస్తుత రాజకీయాలు అధ్వనంగా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రాజకీయాలతో సంబంధం లేని కుటుంబ సభ్యులను కూడా రాజకీయాల్లోకి లాగుతున్నారని.. రాజకీయాల కోసం ఇంతలా దిగజారాలా అని మండిపడ్డారు. తాము అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి ప్రయత్నాలు చేయలేదన్నారు. 18 ఏళ్లుగా ప్రజాజీవితంలో ఉన్నానని.. ఈ కాలంలో తన కుటుంబ సభ్యులు, పిల్లలు ఎంతో ఇబ్బంది పడ్డారని తెలిపారు. ఒకానొక దశలో ఈ రాజకీయాల్లో ఎందుకు ఉన్నానా.. తప్పుకుందామని అనిపించిందని.. ప్రజల కోసం నిలబడి పోరాడాలని నిర్ణయించుకున్నానని తెలిపారు.

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలపై నెటిజన్‌ అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ.. ఆ రాష్ట్ర ప్రజలు రెండు జాతీయ పార్టీలను నమ్మొద్దని.. స్థానిక పార్టీల్లో ఏదో ఒక పార్టీకి ఓటు వేయాలని సూచించారు. తాను, తన కుటుంబం, స్నేహితులు, బీఆర్‌ఎస్‌ పార్టీ కుటుంబ సభ్యులే తన బలమని తెలిపారు. తెలంగాణ ఉన్నంత కాలం కేసీఆర్‌ ఉంటారని, కేసీఆర్‌ ఆనవాళ్లను చెరిపేయడం ఎవరి తరమూ కాదన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ఐదేళ్లు అధికారంలో ఉండాలని ప్రజలు తీర్పునిచ్చారని.. ఆ తీర్పును తాము గౌరవిస్తామని తెలిపారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఐదేళ్ల పాటు పని చేయాలని తాను కోరుకుంటున్నానని తెలిపారు. తమిళనాడులో కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేసిన హీరో విజయ్‌ కు శుభాకాంక్షలు తెలిపారు. గంటన్నర పాటు నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పిన కేటీఆర్‌ దిపావళి శుభాకాంక్షలు తెలిపి లైవ్‌ చాట్‌ ను ముగించారు.

Tags:    
Advertisement

Similar News