రేవంత్ భాష మార్చుకో.. కేసీఆర్ వార్నింగ్
కాళేశ్వరం వంద కాంపోనెంట్లలో మేడిగడ్డ ఒకటని.. అందులోని 300 పిల్లర్లలో రెండు పిల్లర్లు కుంగితే దేశమే ఆగమైనట్లు చేస్తున్నారని విమర్శించారు కేసీఆర్.
సీఎం రేవంత్ రెడ్డి భాషపై విమర్శలు గుప్పించారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. తాను ఉద్యమ సమయంలో పరుషంగా మాట్లాడానని, కానీ సీఎం అయ్యాక కాదన్నారు. కరీంనగర్‌లో నిర్వహించిన కదనభేరి సభతో లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి కేసీఆర్ శ్రీకారం చుట్టారు. రైతుల దయనీయ పరిస్థితి చూస్తే కన్నీళ్లు వస్తున్నాయన్నారు కేసీఆర్. మూడు నెలల్లోనే రాష్ట్రాన్ని కాంగ్రెస్ ఆగం చేసిందని విమర్శించారు.
తెలంగాణలో ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి ఉంటే దేశాన్ని చైతన్యం చేసేవాడినన్నారు కేసీఆర్. బీఆర్ఎస్ ప్రభుత్వం పోగానే కరెంటు ఇబ్బందులు, రైతుబంధు కట్ అయ్యాయన్నారు. త్వరలోనే బీఆర్ఎస్ మళ్లీ వస్తుందని.. తెలంగాణను అద్భుతంగా అభివృద్ధి చేస్తుందన్నారు.
కాళేశ్వరం వంద కాంపోనెంట్లలో మేడిగడ్డ ఒకటని.. అందులోని 300 పిల్లర్లలో రెండు పిల్లర్లు కుంగితే దేశమే ఆగమైనట్లు చేస్తున్నారని విమర్శించారు కేసీఆర్. త్వరలోనే టీవీల్లోకి వచ్చి కాళేశ్వరం గొప్పతనం వివరిస్తానన్నారు. కాంగ్రెస్ హామీలన్ని బోగస్ అంటూ ఫైర్ అయ్యారు కేసీఆర్.
ఇక సోషల్‌మీడియాలో పోస్టులుపెడితే పోలీసులు కేసులు పెడుతున్నారని.. పోలీసులకు రాజకీయాలకు సంబంధం ఏంటని ప్రశ్నించారు కేసీఆర్. రాజకీయాల్లో పోలీసులు తలదూర్చొద్దని సూచించారు. సీఎం రేవంత్ ఢిల్లీ పర్యటనలపైనా కేసీఆర్ విమర్శలు గుప్పించారు. సీఎం ఎన్నిసార్లు ఢిల్లీ వెళ్తారని.. తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఢిల్లీకి తాకట్టు పెడుతున్నారంటూ విమర్శించారు.