14న బీజేపీ తొలి జాబితా.. అంతకు ముందే అమిత్ షా సభ

అమిత్ షా ఈ నెల 10 ఆదిలాబాద్ జిల్లా పర్యటనకు రానున్నారు. అక్కడ జరుగనున్న భారీ బహిరంగ సభలో ప్రసంగిస్తారు.

Advertisement
Update:2023-10-05 07:24 IST

14న బీజేపీ తొలి జాబితా.. అంతకు ముందే అమిత్ షా సభ

తెలంగాణ ఎన్నికలకు సంబంధించి రేపో మాపో షెడ్యూల్ విడుదలవుతుందన్న ప్రచారం నేపథ్యంలో బీజేపీ కూడా దూకుడు పెంచింది. ఇప్పటికే రాష్ట్రానికి వరాల జల్లు కురిపిస్తూ కేంద్ర కేబినెట్ నిర్ణయాలు తీసుకున్నది. పసుపు బోర్డు, గిరిజన యూనివర్సిటీ, కృష్ణా ట్రిబ్యునల్ ఏర్పాటులో కీలకమైన నిర్ణయాలు తీసుకున్న బీజేపీ ప్రభుత్వం.. ఇక పార్టీ పరంగా దూకుడు పెంచనున్నది. ఇప్పటికే ప్రధాని మోడీ వరుసగా రెండు బహిరంగ సభల్లో పాల్గొని పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు. ఇక పార్టీ అగ్రనేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటన కూడా కన్ఫార్మ్ అయ్యింది.

అమిత్ షా ఈ నెల 10 ఆదిలాబాద్ జిల్లా పర్యటనకు రానున్నారు. అక్కడ జరుగనున్న భారీ బహిరంగ సభలో ప్రసంగిస్తారు. బీజేపీ గత ఎన్నికల్లో గెలిచిన నిజామాబాద్, ఆదిలాబాద్ పైనే ఎక్కువగా దృష్టి పెట్టింది. ఆయా లోక్‌సభ పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లలో గెలవాలని గట్టిగా ప్రయత్నిస్తోంది. ఇప్పటికే పలు దఫాలుగా కొన్ని బలమైన సెగ్మెంట్లలో సర్వే కూడా చేయించింది. ఈ నెల 14న లేదా ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేయనున్నారు. ఇప్పటికే నియోజకవర్గానికి ఇద్దరు, ముగ్గురు చొప్పున లిస్టును ఢిల్లీకి పంపారు. కేంద్ర ఎన్నికల కమిటీ ఈ లిస్టుపై పూర్తి స్థాయిలో కసరత్తు చేసి ఫైనల్ అభ్యర్థులను ఖరారు చేయనున్నది. తొలి జాబితాలోనే సాధ్యమైనన్ని ఎక్కువ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉన్నది.

ఇక ఇవాళ, రేపు పార్టీ నాయకులు హైదరాబాద్‌కు రానున్నారు. రాష్ట్ర ఎన్నికల ఇంచార్జి ప్రకాశ్ జావదేకర్, రాష్ట్ర పార్టీ ఇంచార్జులు తరుణ్ చుగ్, సునీల్ బన్సల్ వరుసగా సమావేశాలు నిర్వహించనున్నారు. రాష్ట్రంలో ఎన్నికలకు సంబంధించిన అంశాలను వీరే పూర్తిగా పర్యవేక్షించనున్నారు.శుక్రవారం బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ. నడ్డా కూడా హైదరాబాద్ వస్తారు. ఎన్నికల్లో బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అమలు చేయనున్న వ్యూహాలను ఆయన నాయకులకు వివరించనున్నారు.

Tags:    
Advertisement

Similar News