కాంగ్రెస్ ఆరు గ్యారెంటీల అమలుపై బీజేపీ పాదయాత్రలు
కాంగ్రెస్ ఆరు గ్యారెంటీల అమలుపై డిసెంబర్ 1 నుంచి అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా బీజేపీ పాదయాత్రలు చేపట్టనుంది
గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయడం లేదని డిసెంబర్ 1 నుంచి అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా బీజేపీ పాదయాత్రలు చేపట్టనుంది. ఎన్నికల సమయంలో హస్తం పార్టీ ఆరు గ్యారెంటీలతో పాటు 420 ఇతర హామీలు ఇచ్చిందని... ఈ హామీలు అమలు చేయడం లేదని ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీలు విమర్శలు గుప్పిస్తున్నాయి. నియోజకవర్గాల వారీగా పాదయాత్ర చేపట్టి ప్రజాక్షేత్రంలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని కాషాయ పార్టీ నిర్ణయించింది.
అదే సమయంలో ఈ నెల 15వ తేదీన లేదా 16వ తేదీన మూసీ పరీవాహక ప్రాంతాల్లో రాత్రి వేళల్లో బస చేయాలని కమలం నేతలు నిర్ణయించారు. మూసీ ప్రాంతంలో బస చేయాలని సీఎం రేవంత్ రెడ్డి సవాల్ చేసిన నేపథ్యంలో బీజేపీ ఈ నిర్ణయం తీసుకుంది. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో రాత్రివేళ అక్కడ బస చేయనున్నారు.