నిన్న పీఏసీ మీటింగ్.. నేడు జిల్లా అధ్యక్షుడు జంప్
మీటింగ్ జరిగిన గంటల వ్యవధిలోనే ఆయన ప్రగతి భవన్ కి వెళ్లి బీఆర్ఎస్ నేతల్ని కలవడం విశేషం. ఆ తర్వాత సీఎం కేసీఆర్ సమక్షంలో గులాబి కండువా కప్పుకున్నారు.
ఆదివారం తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ మీటింగ్ జరిగింది. 100రోజుల ప్రణాళిక ప్రకటించారు, ప్రచారం హోరెత్తించాలన్నారు, అందరూ కలసి ముందుకు నడవాలన్నారు. అక్కడ సీన్ కట్ చేస్తే సోమవారం భువనగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అనిల్ కుమార్ రెడ్డి.. ప్రగతి భవన్ కి వెళ్లారు. తర్వాత కేసీఆర్ సమక్షంలో ఆయన బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు.
కోమటిరెడ్డిపై ఆరోపణలు..
భువనగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కుంభం అనిల్ కుమార్ రెడ్డికి కోమటిరెడ్డి కుటుంబంతో విభేదాలున్నాయి. కోమటిరెడ్డి బ్రదర్స్ ఇద్దరూ ఒకే పార్టీలో ఉన్నప్పుడు కుటుంబ రాజకీయాలకు బీజం వేశారని, ఇప్పుడు వెంకట్ రెడ్డి కూడా కుటుంబంలోని వారికే టికెట్లు ఇప్పించుకోవాలనుకుంటున్నారని, మిగతా వారిని ఎదగనీయడంలేదనేది అనిల్ కుమార్ రెడ్డి ఆరోపణ. ప్రస్తుతం భువనగిరి టికెట్ బీసీలకివ్వాలంటున్నారు కోమటిరెడ్డి. అయితే తన ఇంట్లోనే ఐదారు టికెట్లు తీసుకున్నప్పుడు భువనగిరి టికెట్ బీసీలకివ్వాలని కోమటిరెడ్డికి గుర్తులేదా అని ప్రశ్నిస్తున్నారు అనిల్ కుమార్ రెడ్డి. ఎంపీ కోమటిరెడ్డి చేస్తున్నది తప్పు అని అంటున్నారాయన. భువనగిరిలోని ఓ ఫంక్షన్ హాల్ లో మీటింగ్ పెట్టిన అనిల్ కుమార్ రెడ్డి.. తిరుగుబాటు జెండా ఎగరేశారు. కోమటిరెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు.
తానప్పుడే పార్టీ మారేది లేదని ఫంక్షన్ హాల్ మీటింగ్ లో చెప్పిన అనిల్ కుమార్ రెడ్డి.. కోమటిరెడ్డిపై అధిష్టానానికి ఫిర్యాదు చేస్తానన్నారు. అయితే ఆ మీటింగ్ జరిగిన గంటల వ్యవధిలోనే ఆయన ప్రగతి భవన్ కి వెళ్లి బీఆర్ఎస్ నేతల్ని కలవడం విశేషం. ఆ తర్వాత సీఎం కేసీఆర్ సమక్షంలో గులాబి కండువా కప్పుకున్నారు. దీంతో యాదాద్రి-భువనగిరి జిల్లాలో కాంగ్రెస్ ఖాళీ అవుతుందనే చెప్పాలి. అనిల్ కుమార్ రెడ్డి చేరికతో భువనగిరి నియోజకవర్గంతోపాటు ఆలేరు, మునుగోడు నియోజకవర్గాలపై తీవ్ర ప్రభావం పడే అవకాశముంది.