మీరు మీలాగే ఉండండి.. వైఫల్యాలను కూడా సెలబ్రేట్ చేసుకోండి : మంత్రి కేటీఆర్

తెలంగాణ ప్రభుత్వం వ్యాపారవేత్తలకు కావల్సిన సౌకర్యాలను అన్నింటినీ కల్పిస్తోందని చెప్పారు. రాష్ట్రంలో పారిశ్రామిక అనుకూల వాతావరణం ఉందని మంత్రి కేటీఆర్ వెల్లడించారు.

Advertisement
Update:2023-04-16 06:26 IST

యువ పారిశ్రామికవేత్తలు, ఆవిష్కర్తలు తమ ఒరిజినాలిటీని కోల్పోవద్దని.. ఎప్పటికీ మీరు మీలాగే ఉండాలని.. వైఫల్యాలను కూడా సెలబ్రేట్ చేసుకోవాలని ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ సూచించారు. యువ ఆవిష్కర్తలు మూలధనం కోసం ఆందోళన చెందాల్సిన అవసరమే లేదని.. ఇప్పుడు ఆలోచనే (ఐడియా) ముఖ్యమని కేటీఆర్ అన్నారు. హైదరాబాద్‌లోని ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్‌స్టిట్యూట్ నిర్వహించిన స్టార్టప్ ఛాలెంజ్ ఫినాలే-2023 కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..

పాశ్చాత్య దేశాలతో పోలిస్తే ఇండియాలో వ్యవస్థాపకులుగా మారడం అంత సులభమైన విషయం కాదని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం వ్యాపారవేత్తలకు కావల్సిన సౌకర్యాలను అన్నింటినీ కల్పిస్తోందని చెప్పారు. రాష్ట్రంలో పారిశ్రామిక అనుకూల వాతావరణం ఉంది. కొత్త సాంకేతికత గురించి చెప్పినప్పుడు.. సీఎం కేసీఆర్ ఎప్పుడూ ఒక మాట అడుగుతుంటారు. ఆ సాంకేతికత సమాజంపై ఎంత ప్రభావం చూపిస్తుందని ప్రశ్నిస్తారని మంత్రి కేటీఆర్ అన్నారు.

ఏదైనా సాంకేతికత కొత్తగా వచ్చినప్పుడు అది సమాజంపై సానుకూల ప్రభావం చూపిస్తుందా లేదా అని సీఎం కేసీఆర్ ఎప్పుడూ అడుగుతుంటారని అన్నారు. ఇప్పుడు కొత్తగా ఆవిష్కర్తలు, వ్యవస్థాపకులుగా మారబోతున్న వారికి తాను కొన్ని సూచనలు ఇస్తాను. ఇప్పటికే మార్కెట్‌లో ఉన్న అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌డీల్ వంటివి సులభంగా సృష్టించవచ్చు. అయితే, అలాంటి వాటిని కాపీ చేసి.. ఆవిష్కరణలుగా చెప్పవద్దని మంత్రి చెప్పారు. పాశ్చాత్య దేశాల్లో ఇప్పటికే సృష్టించిన వాటితో మనకు వచ్చేది ఏమీ ఉండదని.. అందుకే ప్రపంచ స్థాయికి చేరేలా కొత్త ఆవిష్కరణలు చేయాలని కేటీఆర్ సూచించారు.

ఇప్పుడు ఏ సంస్థను ప్రారంభించాలన్నా మూలధనం సమస్య కాదని కేటీఆర్ అన్నారు. గతంలో మూల ధనం సంపాదించాలంటే ఒక సవాలుగా ఉండేది. అందుకే ముందు డబ్బు సమకూర్చుకొని.. ఆ తర్వాత ఆలోచన చేయాల్సి వచ్చేది. కానీ, ఇప్పుడు ఆలోచనే ముఖ్యమని కేటీఆర్ అన్నారు. మన ఆలోచన ఎంత గొప్పగా ఉంటే.. అంత త్వరగా మార్కెట్‌లోకి వచ్చే అవకాశం ఉంటుందని కేటీఆర్ చెప్పారు.

ఇక దేశంలో వైద్య ఖర్చులు భారీగా పెరిగిపోతున్నాయని కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. అత్యధిక జనాభా ఉన్న మన దేశంలో ఇలా జరగడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడే అవకాశం ఉందన్నారు. వ్యాపార కోణంలో ఇది మంచి అవకాశమే.. అయినప్పటికీ కేవలం లాభాల కోసమే పని చేయవద్దని కేటీఆర్ సూచించారు.

Tags:    
Advertisement

Similar News