రేవంత్ ఊరిలో మహిళా జర్నలిస్టులపై దాడి.. భయమెందుకంటూ కేటీఆర్ ట్వీట్
దాడికి తెగబడిన కాంగ్రెస్ గుండాలపై వెంటనే కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు తెలంగాణ డీజీపీని ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు. మహిళా కమిషన్ కూడా దీనిపై స్పందించాలని కోరారు కేటీఆర్.
సీఎం రేవంత్ రెడ్డి సొంత గ్రామం కొండారెడ్డిపల్లిలో మహిళా జర్నలిస్టులపై దాడిని తీవ్రంగా ఖండించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. జర్నలిస్టులు సరిత, విజయారెడ్డిలపై సీఎం రేవంత్ అనుచరులు దాడి చేయడం దారుణమన్నారు. ఇందిరమ్మ పాలన అంటూ ఫోజులు కొట్టే ఈ కాంగ్రెస్ పాలనలో మహిళా జర్నలిస్టులకే రక్షణ లేకపోతే ఎలా అని ప్రశ్నించారు. రుణమాఫీ సరిగా జరిగి ఉంటే సీఎంకు అంత భయమెందుకన్నారు కేటీఆర్. విధి నిర్వహణలో ఉన్న జర్నలిస్టులపై దాడి చేయడం హేయమైన చర్యగా అభివర్ణించారు. దాడికి తెగబడిన కాంగ్రెస్ గుండాలపై వెంటనే కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు తెలంగాణ డీజీపీని ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు. మహిళా కమిషన్ కూడా దీనిపై స్పందించాలని కోరారు కేటీఆర్.
ఇంతకీ ఏం జరిగిందంటే!
రైతు రుణమాఫీ ప్రక్రియపై నిజాలు తెలుసుకునేందుకు సీఎం సొంత గ్రామం కొండారెడ్డిపల్లికి వెళ్లారు మిర్రర్ టీవీ జర్నలిస్ట్ విజయా రెడ్డి, తెలుగు స్క్రైబ్ జర్నలిస్టు సరిత ఆవుల. అయితే ఈ ఇద్దరు మహిళా రిపోర్టర్లను కొంతమంది అడ్డుకున్నారు. అంతేకాదు వారి చేతుల్లో మైకులను లాక్కుని వేధించారు. బూతులు తిట్టారు.
ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ ఘటనపై పలువురు ప్రముఖ జర్నలిస్టులు తీవ్రంగా మండిపడుతున్నారు. ఇలాంటి చర్యలు ఆమోదయోగ్యం కాదని, బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.