అమ్మో అసెంబ్లీకా.. మేం పోటీ చేయం.. బీజేపీ సీనియర్లలో ఆందోళన

క్షేత్ర స్థాయిలో బీజేపీ పరిస్థితి ఎంటో తెలుసు కాబట్టి వాళ్లు పోటీకి వెనకడుగు వేస్తున్నట్లు చర్చ జరుగుతోంది.

Advertisement
Update:2023-09-28 08:19 IST

బీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం మేమే.. ఈ సారి అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటుతాం.. తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కారు ఏర్పాటు చేస్తామంటూ బీరాలు పలికే బీజేపీ నాయకులు.. తీరా పోటీ విషయం వచ్చే సరికి జంకుతున్నారు. అమ్మో అసెంబ్లీ ఎన్నికల్లో తాము పోటీకి మేం రెడీగా లేము.. లోక్‌సభకు అయితేనే పోటీ చేస్తామని చెబుతున్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో సరైన అభ్యర్థులు లేకపోవడంతో.. పార్టీలోని సీనియర్లు, ఎంపీలను అసెంబ్లీకి పోటీ చేయాలని అధిష్టానం ఆదేశించింది. కానీ తెలంగాణలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్యే పోటీ ఉంటుందని అంచనా వేసుకున్న బీజేపీ సినియర్లు అసెంబ్లీ బరిలోకి దిగడానికి జంకుతున్నట్లు తెలుస్తున్నది.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, ఎంపీలు బండి సంజయ్, ధర్మపురి అరవింద్, సోయం బాపూరావు, రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్, సీనియర్ నాయకులు రాజగోపాల్ రెడ్డి, కొండా విశ్వేశ్వర్ రెడ్డి తదితరులు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆసక్తి చూపడం లేదు. వీళ్లలో చాలా మంది గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన వారే ఉన్నారు. ఈ సారి కూడా అదే సీన్ రిపీట్ అవుతుందని అంచనా వేసుకుంటున్నారు. క్షేత్ర స్థాయిలో బీజేపీ పరిస్థితి ఎంటో తెలుసు కాబట్టి వాళ్లు పోటీకి వెనకడుగు వేస్తున్నట్లు చర్చ జరుగుతోంది.

మోడీ ఇమేజ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ మాత్రం పనికి రాదని.. కర్ణాటకలో ఎలా అయితే బీజేపీకి భంగపాటు తప్పలేదో.. అదే సీన్ తెలంగాణలో రిపీట్ అవుతుందని అంచనా వేస్తున్నారు. అదే లోక్‌సభకు అయితే మోడీ ఇమేజ్‌తో గట్టెక్కవచ్చిని భావిస్తున్నారు. 2019 ఎన్నికల్లో ఎలా అయితే బయటపడ్డామో అదే విధంగా లోక్‌సభ ఎన్నికల్లో బయట పడవచ్చని అంచనా వేస్తున్నారు. ఇప్పుడు పోటీ చేసి ఓడిపోతే.. ఆ ప్రభావం లోక్‌సభ ఎన్నికల అప్పుడు పడుతుందని కాబట్టే సీనియర్ నాయకులు అసెంబ్లీ బరిలోకి దిగడానికి సంశయిస్తున్నారు.

అంబర్‌పేట నియోజకవర్గం నుంచి 2018లో పోటీ చేసిన కిషన్ రెడ్డి స్వల్ప తేడాతో ఓడిపోయారు. అంబర్‌పేట నియోజకవర్గాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలి పెట్టేది లేదని గతంలో వ్యాఖ్యానించారు. కానీ ఈ సారి పోటీకి మాత్రం ఆసక్తి చూపడం లేదు. కిషన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన వెంకట్‌రెడ్డి గత వారమే బీఆర్ఎస్‌లో జాయిన్ అయ్యారు. దీంలో కిషన్ రెడ్డికి ఓటమి భయం మరింత పెరిగిపోయినట్లు చర్చ జరుగుతోంది. అందుకే అసెంబ్లీకి పోటీ చేయడానికి ఇష్టపడటం లేదని తెలుస్తున్నది.

ఏకంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి వెనకడుగు వేస్తుండటంతో మిగిలిన సీనియర్లు కూడా లైట్ తీసుకుంటున్నారు. రాజ్యసభ సభ్యుడైన లక్ష్మణ్ గత ఎన్నికల్లో ముషీరాబాద్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఈ సారి పోటీకి పెద్దగా ఆసక్తి చూపడం లేదు. మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి కూడా పోటీ చేయడానికి సిద్ధంగా లేరు. కంటి తుడుపు చర్యగా తన కొడుకుతో టికెట్ కోసం దరఖాస్తు చేయించారు. కొండా విశ్వేశ్వర్ రెడ్డి అయితే లోక్‌సభకు తప్ప దేనికీ పోటీ చేయనని.. తనపై ఒత్తిడి తీసుకొని రావొద్దని స్పష్టం చేసినట్లు తెలుస్తున్నది.

పార్టీలో సీనియర్లు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి ఇంట్రస్ట్ చూపించక పోవడంతో ఆయా నియోజకవర్గాల్లో అభ్యర్థుల కోసం బీజేపీ వెతుకుతోంది. గెలవక పోయినా కనీసం అన్ని నియోజకవర్గాల్లో తమకు అభ్యర్థులు ఉన్నారని చూపించుకునే ప్రయత్నం చేయాలని భావిస్తోంది. 6 వేల దరఖాస్తులు వచ్చాయని గొప్పగా చెప్పుకున్న బీజేపీకి.. అభ్యర్థులు దొరకక పోవడమేంటనే చర్చ జరుగుతోంది. సీనియర్లే పోటీకి దిగకపోతే.. ఇక మిగిలిన అభ్యర్థులకు ఎలా భరోసా ఇస్తారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

Tags:    
Advertisement

Similar News