మీ లెక్కలన్నీ పింక్ బుక్‌లో రాస్తున్నం.. మేం అధికారంలోకి వచ్చాక తిరిగి చెల్లిస్తాం
కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హెచ్చరిక
కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న తప్పులు.. ఆ పార్టీ నేతల లెక్కలన్నీ పింక్ బుక్‌లో రాస్తున్నామని.. బీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన వెంటనే తిరిగి చెల్లిస్తామని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హెచ్చరించారు. గురువారం జనగామలో ఆమె మీడియాతో మాట్లాడారు. బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి వేధింపులకు గురి చేస్తున్నారని.. కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని అన్నారు. వారి లెక్కలన్నీ తిరిగి అప్పజెప్తామన్నారు. రైతు డిక్లరేషన్ అమలుపై ప్రజలు నిలదీస్తారనే భయంతోనే రాహుల్ గాంధీ వరంగల్ పర్యటన రద్దు చేసుకున్నారని అన్నారు. సోషల్ మీడియాలో చిన్న విమర్శ చేసినా రేవంత్ భయపడుతున్నాడని అన్నారు. పోస్టు పెట్టిన తెల్లారే పోలీసులు పెట్టినవాళ్ల ఇంటికి వెళ్లి వేధింపులకు గురి చేస్తున్నారని అన్నారు. రాజ్యాంగాన్ని పట్టుకొని తిరిగే రాహుల్ గాంధీ తెలంగాణలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతున్నా ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ అంటనే దగా, మోసం అని మరోసారి తేలిపోయిందన్నారు.
కేసీఆర్ ఆరంభించిన తెలంగాణ ఉద్యమానికి భయపడే చంద్రబాబు 2001లో ఆఘమేఘాల మీద దేవాదుల ప్రాజెక్టును ప్రారంభించినా కేసీఆర్ సీఎం అయ్యాకే ఆ పనులు పూర్తయ్యాయన్నారు. 95 శాతం నిర్మాణం పూర్తి చేసిన సమ్మక్క బ్యారేజీకి అవసరమైతే ఎన్‌వోసీ తేలేని చేతగాని దద్దమ్మ ప్రభుత్వం ఇది అని మండిపడ్డారు. దేవాదుల, సమ్మక్క బ్యారేజీ వినియోగంలోకి తేవడంలో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని కడియం శ్రీహరి ఎందుకు ప్రశ్నించడం లేదో చెప్పాలన్నారు. పార్టీ ఫిరాయింపుల కేసులో కడియం శ్రీహరి సహా మిగతా వాళ్లపై వేటు పడుతుందన్న నమ్మకం తనకు ఉందన్నారు. ఉప ఎన్నికలు వస్తే పదికి పది స్థానాల్లో బీఆర్‌ఎస్ జెండా ఎగరడం ఖాయమన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను ఎప్పుడు అమలు చేస్తారో చెప్పాలన్నారు. స్కాలర్‌షిప్, ఫీ రీయింబర్స్‌మెంట్ బకాయిలు కూడా ఇవ్వడం లేదన్నారు. రైతుభరోసా ఇవ్వకుండా రైతులను వేధిస్తున్నారని అన్నారు. సంక్రాంతి నుంచే సన్నబియ్యం ఇస్తామని చెప్పి మోసం చేశారన్నారు. కాంగ్రస్ అబద్ధాలను ప్రజల్లో ఎండగడతామన్నారు. వచ్చే ఎన్నికల్లో తప్పకుండా బీఆర్‌ఎస్ విజయం సాధిస్తుందని అన్నారు.
బీసీలకు విద్య, ఉద్యోగ, రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలే
బీసీలకు విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో రిజర్వేషన్లు కల్పించేందుకు అసెంబ్లీలో వేర్వేరు బిల్లులు పెట్టి పాస్ చేయాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. విద్య, ఉద్యోగ రంగాల్లో 46 శాతం, స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లులను అసెంబ్లీలో పెట్టి పాస్ చేయాలని డిమాండ్ చేశారు. ఆయా బిల్లులను పాస్ చేసుకుంటేనే బీసీలకు న్యాయం జరుగుతుందన్నారు. కుల గణన రీ సర్వే బీసీలందరి విజయమన్నారు. ఇది తొలి విజయమేనని.. రానున్న రోజుల్లో ఈ ప్రభుత్వం మెడలు వంచి ఇచ్చిన హామీలన్నీ అమలు చేసేలా ఒత్తిడి చేస్తామన్నారు. మళ్లీ కులగణన చేస్తున్న విషయంపై ప్రజల్లో విస్తృత ప్రచారం కల్పించాలన్నారు. కుల గణన సర్వే కోసం అందుబాటులోకి తెచ్చిన టోల్ ఫ్రీ నంబర్ పైనా విస్తృత ప్రచారం కల్పించాలని కోరారు. 15 రోజుల్లో సర్వే పూర్తయ్యే అవకాశం లేదని.. నెల రోజుల పాటు అవకాశం కల్పించాలన్నారు. హైదరాబాద్ లో 60 శాతం మంది తమ ఇళ్లకు సర్వే చేసేవాళ్లు రాలేదని చెప్తున్నారని.. ఈ అంశాలను ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాలన్నారు.