తెలంగాణకు త్వరలో ఎయిర్ అంబులెన్స్ లు
ఎయిర్ అంబులెన్స్ ల గురించి ఇటీవలే సీఎం కేసీఆర్ సూచన ప్రాయంగా తెలిపారని, ఆ నిర్ణయం త్వరలోనే అమలవుతుందన్నారు హరీష్ రావు. వైద్య రంగంలో తెలంగాణ ఎంత అడ్వాన్స్ గా ఉందో అర్థం చేసుకోవచ్చని తెలిపారు.
తెలంగాణ ప్రజలకు త్వరలో ఎయిర్ అంబులెన్స్ సౌకర్యం అందుబాటులోకి రాబోతోందని తెలిపారు మంత్రి హరీష్ రావు. ఎయిర్ అంబులెన్స్ అంటే కేవలం డబ్బున్నోళ్లకే అనే అనుమానం ఉంటుందని, కానీ తెలంగాణ ప్రభుత్వం తెచ్చేవి పేదలకోసం అని వివరించారు. ఎలాంటి చార్జీలు లేకుండా ఉచితంగా పేదలను ఆస్పత్రుల వద్దకు చేర్చేందుకు ఇవి ఉపయోగపడతాయన్నారు. తండాలు, గూడేలలో ఉన్నవారికి అత్యవసర సమయాల్లో ఇవి అక్కరకు వస్తాయన్నారు. ఆస్పత్రులకు దూరంగా ఉండే ప్రాంతాల్లో ప్రమాదాలు జరిగినా, వెంటనే ఎయిర్ అంబులెన్స్ లు బాధితుల్ని లిఫ్ట్ చేస్తాయని వివరించారు.
ఎయిర్ అంబులెన్స్ ల గురించి ఇటీవలే సీఎం కేసీఆర్ సూచన ప్రాయంగా తెలిపారని, ఆ నిర్ణయం త్వరలోనే అమలవుతుందన్నారు హరీష్ రావు. వైద్య రంగంలో తెలంగాణ ఎంత అడ్వాన్స్ గా ఉందో అర్థం చేసుకోవచ్చని తెలిపారు. సీఎం కేసీఆర్ దార్శనికతతో తీసుకుంటున్న నిర్ణయాలు రాష్ట్ర వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులుగా నిలబడుతున్నాయన్నారు.
గవర్నర్ పై ధ్వజం..
దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణల ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలను తిరస్కరిస్తూ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ నిర్ణయించడం దారుణం అని అన్నారు మంత్రి హరీష్ రావు. తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలిగా ఉన్న తమిళిసై తెలంగాణ గవర్నర్ గా ఎలా వచ్చారని ప్రశ్నించారు. పార్టీ అధ్యక్షురాలిగా ఉన్న వ్యక్తికి రాష్ట్ర గవర్నర్ పదవి ఇవ్వొచ్చా? అని అడిగారు. సర్కారియా కమిషన్ ప్రతిపాదనలను బట్టి చూస్తే గవర్నర్ పదవికి తమిళిసై అనర్హురాలని అన్నారు. తెలంగాణ విషయంలో గవర్నర్ తమిళిసై వైఖరిలో మార్పు లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తప్పు చేస్తే గవర్నర్ సరిచేయవచ్చని.. కానీ, నీతి, నిజాయితీతో పనిచేస్తే కూడా గవర్నర్ కక్షపూరితంగా వ్యవహరించడం సరికాదన్నారు హరీష్ రావు.