పొంగులేటి, వివేక్..నెక్స్ట్ టార్గెట్ రాజగోపాల్ రెడ్డేనా..?
ఇక వరుస ఐటీ, ఈడీ దాడులతో ఇటీవల పార్టీ మారిన నేతల్లో భయం మొదలైంది. ఆ లిస్టులో మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఉన్నారని తెలుస్తోంది.
మొన్న పొంగులేటి, నిన్న వివేక్ వెంకటస్వామి.. ఐటీ, ఈడీ నెక్స్ట్ టార్గెట్ ఎవరు..! సరైన టైమ్‌లో పార్టీకి హ్యాండిచ్చిన నేతలను బీజేపీ టార్గెట్ చేస్తోందా..? ఇప్పుడు ఇదే అంశంపై తెలంగాణలో చర్చ జరుగుతోంది. సరిగ్గా అసెంబ్లీ ఎన్నికల టైంలో బీజేపీకి షాకిచ్చి కాంగ్రెస్‌లో చేరిన వివేక్ వెంకటస్వామి నివాసాలు, ఆఫీసుల్లో ఐటీ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఇటీవల సోదాలు నిర్వహించింది. సోదాల అనంతరం దాదాపు రూ.100 కోట్ల మేర అక్రమ లావాదేవీలు గుర్తించింది. ఫెమా నిబంధనలు ఉల్లంఘించినట్లు పేర్కొంది. ఎన్నికల వేళ వంద కోట్ల రూపాయలంటే వివేక్ వెంకటస్వామికి పెద్ద మొత్తమే. చెన్నూర్ కాంగ్రెస్ అభ్యర్థిగా వివేక్ వెంకటస్వామి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున డబ్బులు ఖర్చు చేస్తున్నారన్న ప్రచారం ఉంది.
ఇక వరుస ఐటీ, ఈడీ దాడులతో ఇటీవల పార్టీ మారిన నేతల్లో భయం మొదలైంది. ఆ లిస్టులో మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఉన్నారని తెలుస్తోంది. తాను బలమైన లీడర్ అని కాంగ్రెస్‌కు, ఆ పార్టీ తరపున గెలిచిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరారు రాజగోపాల్ రెడ్డి. అందుకు ప్రతిఫలంగా ఆయనకు బీజేపీ రూ.18 వేల కోట్ల కాంట్రాక్టు వచ్చిందన్న ఆరోపణలు వచ్చాయి. అయితే మునుగోడు ప్రజలు అనూహ్య తీర్పుతో అటు కోమటిరెడ్డికి, ఇటు బీజేపీకి షాకిచ్చారు. ఆ ఓటమి తర్వాత మళ్లీ పునరాలోచనలో పడ్డారు కోమటిరెడ్డి. తనకు వేల కోట్ల కాంట్రాక్టులిచ్చిన బీజేపీని కాదని.. మళ్లీ సొంత గూటికి చేరారు. చేరిన రోజు వ్యవధిలోనే మునుగోడు టికెట్ ఖాయం చేసుకున్నారు.
కాగా, కరెక్ట్ టైమ్‌లో తమకు హ్యాండిచ్చిన నేతలపై ఢిల్లీ పెద్దలు ఆగ్రహంతో ఉన్నట్లు సమాచారం. ఆ నేతలే టార్గెట్‌గా ఐటీ, ఈడీ దాడులు జరుగుతున్నాయన్న చర్చ నడుస్తోంది. వివేక్‌పై ఐటీ, ఈడీ దాడులతో ఇప్పుడు కోమటిరెడ్డి బ్రదర్స్ వణికిపోతున్నారని సమాచారం. ఇవాళో, రేపో కోమటిరెడ్డి బ్రదర్స్‌పైనా ఐటీ, ఈడీ దాడులు చేసే అవకాశం ఉందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక పార్టీలో చేరతానని చివరి నిమిషంలో హ్యాండిచ్చిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని సైతం బీజేపీ లాక్ చేసింది. ఐటీ సోదాలతో ఆయన ఆర్థిక దారులన్ని మూసేసింది. ఆయనపై ఆశలు పెట్టుకున్న కాంగ్రెస్ అభ్యర్థులకు ఇది పెద్ద షాకే అని చెప్పాలి. ఇక పొంగులేటి కూడా పాలేరు దాటి రావట్లేదు. తన పరిస్థితే బాగా లేదని అనుచరులతో పొంగులేటి చెప్పినట్లు చర్చ నడుస్తోంది.