శతజయంతి వేళ.. చెన్నమనేని రాజేశ్వరరావుకు అరుదైన గౌరవం

1923 ఆగష్టు 31న జన్మించిన చెన్నమనేని రాజేశ్వర రావు.. 1957లో తొలిసారి చొప్పదండి నియోజకవర్గం నుంచి పోటీ చేసి అసెంబ్లీలో అడుగుపెట్టారు.

Advertisement
Update:2023-08-31 08:30 IST

స్వాతంత్ర్య సమరయోధుడు, సీనియర్ పొలిటిషియన్ దివంగత చెన్నమనేని రాజేశ్వర రావు శతజయంతి సందర్భంగా ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు సీఎం కేసీఆర్. ఆయన సేవలకు గుర్తుగా కాళేశ్వరం ప్రాజెక్టు 9ప్యాకేజీకి చెన్నమనేని రాజేశ్వరరావు పేరు పెట్టాలని నిర్ణయించారు. మల్కాపేట రిజర్వాయర్‌తో పాటు ఆ పరిధిలోని కాల్వలకు చెన్నమనేని రాజేశ్వర్ రావు పేరు పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. స్వాతంత్ర్య సమరయోధుడిగా, తెలంగాణ మొదటితరం రాజకీయవేత్తగా చెన్నమనేని నిరంతరం ప్రజల కోసం పోరాడారన్నారు. రైతాంగం కోసం ఆ కాలంలోనే వరద కాల్వ, ఎత్తిపోతల పథకాల కోసం పోరాడిన చరిత్ర చెన్నమనేనిదని కేసీఆర్ గుర్తుచేశారు. ఆయన ఆకాంక్షలు ఫలించేలా స్వరాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు, ఎత్తిపోతల పథకాలు నిర్మించుకున్నామన్నారు. తెలంగాణ రైతాంగం ఇవాళ దేశం గర్వించే స్థాయిలో పంటలు పండిస్తోందన్నారు.

1923 ఆగష్టు 31న జన్మించిన చెన్నమనేని రాజేశ్వర రావు.. 1957లో తొలిసారి చొప్పదండి నియోజకవర్గం నుంచి పోటీ చేసి అసెంబ్లీలో అడుగుపెట్టారు. తర్వాత సిరిసిల్ల నియోజకవర్గం నుంచి ఐదుసార్లు అసెంబ్లీకి ప్రాతినిథ్యం వహించారు. చివరిసారిగా 2004లో తెలుగుదేశం పార్టీ ద్వారా గెలిచిన చెన్నమనేని.. 2009లో రాజకీయాలకు గుడ్ బై చెప్పారు. కమ్యూనిస్టు పీడీఎఫ్‌ పార్టీ తరఫున 5 సార్లు, తెలుగుదేశం తరఫున ఓ సారి ఎమ్మెల్యేగా గెలిచారు. జాతియోద్యమంలోనూ, నిజాం వ్యతిరేక పోరాటంలోనూ పాల్గొన్నారు. 93 ఏళ్ల వయసులో అనారోగ్యం కారణంగా 2016లో కన్నుమూశారు.

ప్రస్తుతం చెన్నమనేని రాజేశ్వర రావు కుమారుడు రమేష్‌బాబు వేములవాడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. దాదాపు 2009 నుంచి నాలుగుసార్లు విజయం సాధించారు. అయితే జర్మనీ పౌరసత్వం వివాదం కారణంగా వచ్చే ఎన్నికల్లో రమేష్‌బాబుకు టికెట్ నిరాకరించిన కేసీఆర్.. ఆయనను కేబినెట్ హోదాతో కూడిన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా నియమించారు.

*

Tags:    
Advertisement

Similar News