సీఎం రేవంత్ రెడ్డికి 5వ తరగతి విద్యార్థిని లేఖ.. ఏం రాసిందంటే..?

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఆదిభట్లలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో అంజలి అనే విద్యార్థిని 5వ తరగతి చదువుతోంది. తాను చదువుతున్న పాఠశాలలో ఉన్న సమస్యల గురించి ముఖ్యమంత్రికి తెలియజేయాలని భావించింది.

Advertisement
Update:2023-12-21 17:03 IST

తమ సమస్యల పరిష్కారం కోసం ప్రజా ప్రతినిధులకు, అధికారులకు పౌరులు లేఖలు రాయడం మామూలే. గతంలో కూడా ఎంతోమంది ముఖ్యమంత్రులకు, ప్రధానులకు లేఖలు రాసిన సందర్భాలు ఉన్నాయి. వాటికి ప్రభుత్వాల నుంచి స్పందన వచ్చి సమస్యలు ప‌రిష్కార‌మైన సందర్భాలూ ఉన్నాయి. తాజాగా తెలంగాణ రాష్ట్రంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో 5వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాసింది. తాను చదువుతున్న ప్రభుత్వ పాఠశాలకు ఉచిత విద్యుత్ అందించాలని ఆ లేఖ ద్వారా కోరింది. ఆ చిన్నారి రాసిన లేఖ ప్రస్తుతం వైరల్‌గా మారింది.

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఆదిభట్లలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో అంజలి అనే విద్యార్థిని 5వ తరగతి చదువుతోంది. తాను చదువుతున్న పాఠశాలలో ఉన్న సమస్యల గురించి ముఖ్యమంత్రికి తెలియజేయాలని భావించింది. వెంటనే సీఎం రేవంత్ రెడ్డికి ఓ ఉత్త‌రం రాసింది. 'గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి నమస్కరించి వ్రాయునది.. సీఎంగా మీరు ఎన్నికైనందుకు శుభాకాంక్షలు. దయచేసి మా ప్రభుత్వ పాఠశాలకు ఉచిత విద్యుత్‌ అందించాలని మనవి' అని విద్యార్థిని అంజలి లేఖ రాసి పోస్ట్ చేసింది.

విద్యార్థినికి అభినందనల వెల్లువ

తమ పాఠశాలకు ఉచిత విద్యుత్‌ అందించాలని చిన్నారి అంజలి లేఖ రాయడంపై పలువురు అభినందనలు తెలుపుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల నిర్వహణకు ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు చాలా తక్కువ. పాఠశాల నిర్వహణకు పలు ఖర్చులు ఉంటాయి. వచ్చే అరకొర నిధుల్లో కొంత విద్యుత్‌ బిల్లుకు కూడా కేటాయించాల్సి రావడం ఇబ్బందిగా మారుతోంది.

ఈ సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లేందుకు చిన్నారి చేసిన ప్రయత్నాన్ని పలువురు మెచ్చుకుంటున్నారు. గతంలో చిన్నారులు రాసిన లేఖలకు ముఖ్యమంత్రులు స్పందించిన సందర్భాలు ఉన్నాయి. అంజలి రాసిన లేఖకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందిస్తారో లేదో చూడాల్సి ఉంది. తమ పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి ఇంటికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తామని ఇప్పటికే కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఇప్పుడు స్కూళ్లకు కూడా ఉచిత విద్యుత్‌ ఇవ్వాలని విద్యార్థిని లేఖ రాయడంతో ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి.

Tags:    
Advertisement

Similar News