ఐపీఎల్ -16 లో విరాట్ ఘనం..రోహిత్ 'శూన్యం'!
ఐపీఎల్ -16 లీగ్ లో బెంగళూరు మాజీ కెప్టెన్ విరాట్ కొహ్లీ కళకళ లాడుతుంటే...ముంబై సారథి రోహిత్ శర్మ వెలవెలపోతున్నాడు.
ఐపీఎల్ -16 లీగ్ లో బెంగళూరు మాజీ కెప్టెన్ విరాట్ కొహ్లీ కళకళ లాడుతుంటే...ముంబై సారథి రోహిత్ శర్మ వెలవెలపోతున్నాడు....
ఐపీఎల్ -2023 సీజన్ రెండంచెల డబుల్ రౌండ్ రాబిన్ లీగ్ సమరం ఆసక్తికరంగా సాగుతోంది. రౌండ్ రౌండ్ కూ ఆధిక్యత చేతులు మారుతోంది. కోట్ల కాంట్రాక్టుతో ఆడుతున్న ఆటగాళ్లు విఫలమవుతుంటే..లక్షల వేతనం పై ఆడుతున్న ఆటగాళ్లు అంచనాలకు మించి రాణిస్తూ తమ కెరియర్ ను పటిష్టం చేసుకొంటున్నారు.
ఇక..ఐపీఎల్ సూపర్ స్టార్లలో విరాట్ కొహ్లీ వరుస హాఫ్ సెంచరీలతో హోరెత్తిస్తుంటే..రోహిత్ శర్మ మాత్రం వరుస డకౌట్లతో బేజారెత్తిపోతున్నాడు.
ఒకే ఒక్కడు విరాట్ కొహ్లీ...
బెంగళూరు రాయల్ చాలెంజర్స్ స్టార్ బ్యాటర్ విరాట్ కొహ్లీ ఐపీఎల్ లో ఓ అరుదైన రికార్డు నెలకొల్పాడు. 7వేల పరుగుల మైలురాయిని చేరిన తొలి బ్యాటర్ గా చరిత్ర సృష్టించాడు.
న్యూఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన 10వ రౌండ్ మ్యాచ్ లో అర్థశతకం సాధించడం ద్వారా విరాట్ 7వేల పరుగుల రికార్డును నెలకొల్పగలిగాడు.
అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్ల వరుసలో విరాట్ అగ్రస్థానంలో నిలిస్తే..రెండోస్థానంలో కొనసాగుతున్న శిఖర్ ధావన్ 500 పరుగులతో వెనుకబడి ఉన్నాడు.
ప్రస్తుత సీజన్లో సూపర్ ఫామ్ తో పరుగుల మోత మోగిస్తున్న విరాట్ కు గత 10 రౌండ్లలో ఇది ఆరో హాఫ్ సెంచరీ కావడం విశేషం.
233 మ్యాచ్ లు..7వేల పరుగులు
2008 ప్రారంభ ఐపీఎల్ నుంచి బెంగళూరు రాయల్ చాలెంజర్స్ జట్టు తరపున ఆడుతున్న విరాట్ కొహ్లీ ప్రస్తుత సీజన్ 10వ రౌండ్ వరకూ 233 మ్యాచ్ లు ఆడి 7వేల పరుగుల ఘనతను సొంతం చేసుకోగలిగాడు.
పంజాబ్ కెప్టెన్ శిఖర్ ధావన్ 213మ్యాచ్ ల్లో 6వేల 536 పరుగులతో రెండు, ఢిల్లీ క్యాపిటల్స్ సారథి డేవిడ్ వార్నర్ 171 మ్యాచ్ ల్లో 6వేల 189 పరుగులతో మూడు, ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ 237 మ్యాచ్ ల్లో 6వేల 63 పరుగులతో నాలుగు స్థానాలలో కొనసాగుతున్నారు.
2016 ఐపీఎల్ సీజన్లో అత్యధికంగా 16 మ్యాచ్ ల్లో 973 పరుగులతో రికార్డు నెలకొల్పిన కొహ్లీకి 5 శతకాలు, 50 అర్థశతకాలతో 7వేల 43 పరుగులు సాధించగలిగాడు.
ప్రస్తుత సీజన్ మొదటి 10 రౌండ్లలో విరాట్ అరడజను హాఫ్ సెంచరీలతో సహా 419 పరుగులు సాధించాడు. డబుల్ రౌండ్ రాబిన్ లీగ్ లో కొహ్లీ మరో నాలుగుమ్యాచ్ లు ఆడాల్సి ఉంది.
డకౌట్లలో రోహిత్ చెత్తరికార్డు...
మరోవైపు..ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన కెప్టెన్, సూపర్ ఓపెనర్ రోహిత్ శర్మ మాత్రం..ప్రస్తుత సీజన్ ఐపీఎల్ లో ఓ అత్యంత చెత్తరికార్డును మూటగట్టుకొన్నాడు.
చెన్నై చెపాక్ స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన 10వ రౌండ్ పోటీలో రోహిత్ డకౌట్ కావడం ద్వారా..ఐపీఎల్ చరిత్రలోనే అత్యధికంగా 16సార్లు డకౌటైన బ్యాటర్ గా రికార్డుల్లో చేరాడు.
ముంబై ఇన్నింగ్స్ 5వ ఓవర్లో వన్ డౌన్లో బ్యాటింగ్ కు దిగిన రోహిత్ ఎదుర్కొన్న తొలిబంతికే క్యాచ్ అవుటయ్యాడు. పేసర్ దీపక్ చహార్ బౌలింగ్ లో రవీంద్ర జడేజా పట్టిన క్యాచ్ తో వెనుదిరిగాడు.
ప్రస్తుత సీజన్లో ముంబై ఆడిన మొత్తం 10 రౌండ్ల మ్యాచ్ ల్లో రోహిత్ డకౌట్ కావడం ఇది నాలుగోసారి. గత 16 సీజన్లలో ఇప్పటి వరకూ రోహిత్ 16సార్లు డకౌటైన తొలిబ్యాటర్ గా నిలిస్తే..బెంగళూరు వికెట్ కీపర్ బ్యాటర్ దినేశ్ కార్తీక్, మన్ దీప్ సింగ్, కోల్ కతా ఆల్ రౌండర్ సునీల్ నరైన్ 15 డకౌట్లతో సంయుక్త ద్వితీయస్థానంలో కొనసాగుతున్నారు.
చెన్నై మిడిలార్డర్ బ్యాటర్ అంబటి రాయుడు 14 డకౌట్లతో మూడోస్థానంలో ఉన్నాడు.
పాపం! హిట్ మ్యాన్...!
ఐపీఎల్ తో పాటు వైట్ బాల్ క్రికెట్లో అత్యంత విజయవంతమైన ఓపెనర్ గా పేరున్న, రికార్డుల మోత మోగించిన హిట్ మ్యాన్ రోహిత్ శర్మకు ప్రస్తుత చెన్నై మ్యాచ్ వరకూ ఆడిన 237 మ్యాచ్ ల్లో ఓ సెంచరీ, 41 హాఫ్ సెంచరీలతో 6వేల 63 పరుగులు సాధించిన రికార్డు ఉంది. 29.87 సగటు మాత్రమే నమోదు చేయగలిగాడు.
ప్రస్తుత 16వ సీజన్ లీగ్ లో రోహిత్ ఇప్పటి వరకూ ఆడిన 10 రౌండ్ల మ్యాచ్ ల్లో 65 పరుగులు అత్యధిక స్కోరుతో 184 పరుగులు మాత్రమే సాధించగలిగాడు.129.58
స్ట్ర్రయిక్ రేట్ తో 20 సగటుతో మిగిలాడు.
2011 నుంచి ముంబై ఫ్రాంచైజీకి ఆడుతున్న రోహిత్ శర్మ 2013లో జట్టు పగ్గాలు చేపట్టి..2020 వరకూ ఐదుసార్లు ముంబై ఇండియన్స్ ని విజేతగా నిలపడం ద్వారా అత్యంత విజయవంతమైన కెప్టెన్ గా రికార్డు నెలకొల్పాడు.
ప్రస్తుత సీజన్ మిగిలిన నాలుగురౌండ్ల మ్యాచ్ ల్లో నైనా రోహిత్ భారీస్కోర్లతో పరువు దక్కించుకోగలడా?...వేచిచూడాల్సిందే.