టాప్ -10 నుంచి తొలిసారిగా సింధు అవుట్!

తెలుగుతేజం, ప్రపంచ మాజీ చాంపియన్ పీవీ సింధు తొలిసారిగా ప్రపంచ టాప్-10 ర్యాంకింగ్స్ లో చోటు కోల్పోయింది.

Advertisement
Update:2023-03-29 12:27 IST

తెలుగుతేజం, ప్రపంచ మాజీ చాంపియన్ పీవీ సింధు తొలిసారిగా ప్రపంచ టాప్-10 ర్యాంకింగ్స్ లో చోటు కోల్పోయింది. వరుస వైఫల్యాలతో రిటైర్మెంట్ ఊబిలో కూరుకుపోతోంది....

భారత బ్యాడ్మింటన్ కు తన ఆటతీరు, అపురూప విజయాలతో వన్నె తెచ్చిన తెలుగుతేజం సింధు ప్రస్తుతం వెలవెలబోతోంది. తన కెరియర్ లో తొలిసారిగా ప్రపంచ టాప్ -10 ర్యాంక్ ప్లేయర్ల జాబితాలో చోటు కోల్పోయింది.

ప్రస్తుత 2023 బ్యాడ్మింటన్ సీజన్లో ఆడిన నాలుగుకు నాలుగుటోర్నీల ప్రారంభ రౌండ్లలోనే పరాజయాలు పొందడం ద్వారా పాతాళానికి పడిపోతోంది.

నానాటికీ తీసికట్టుగా.....

ఒకప్పుడు ప్రపంచ బ్యాడ్మింటన్ మెరుపుతీగలా సాగిన సింధు హవా..27 సంవత్సరాల వయసుకే మసకబారుతూ వస్తోంది. అంతర్జాతీయ బ్యాడ్మింటన్ సమాఖ్య ప్రకటించిన తాజా ర్యాంకింగ్స్ ప్రకారం సింధు అనూహ్యంగా 11వ ర్యాంక్ కు పడిపోయింది.

గత కొద్ది సంవత్సరాలుగా ప్రపంచ టాప్-10 ర్యాంకింగ్స్ లో తన చోటు కాపాడుకొంటూ వచ్చిన సింధు ప్రస్తుత 2023 సీజన్ వైఫల్యాలతో కిందకు పడిపోయింది.

గత మూడుమాసాల కాలంలో నాలుగు అంతర్జాతీయ టోర్నీలలో పాల్గొన్న సింధు ప్రారంభరౌండ్లలోనే పరాజయాలు చవిచూస్తూ డీలా పడిపోయింది.

సింధు మొత్తం 60,448 పాయింట్లతో 11వ ర్యాంక్‌కు దిగజారింది 2016 నవంబర్‌ నుంచి నిలకడగా రాణిస్తూ..ప్రపంచ మొదటి పది అత్యుత్తమ ర్యాంకర్లలో ఒకరిగా ఉంటూ వచ్చిన సింధు గత ఏడేళ్లకాలంలో తొలిసారిగా.. కిందికి పడిపోయింది.

పురుషుల సింగిల్స్‌లో హెచ్‌ఎస్‌ ప్రణయ్‌ 8వ స్థానంలో నిలువగా.. కిడాంబి శ్రీకాంత్‌ 21వ, లక్ష్యసేన్‌ 25వ ర్యాంక్‌ల్లో కొనసాగుతున్నారు. ఇటీవల స్విస్‌ ఓపెన్‌ టైటిల్‌ నెగ్గిన సాత్విక్‌ సాయిరాజ్‌-చిరాగ్‌ శెట్టి జంట పురుషుల డబుల్స్ లో 6వ స్థానాన్ని దక్కించుకొన్నారు.

రిటైర్మెంట్ కు దగ్గర పడినట్లేనా?

ప్రపంచ మాజీ చాంపియన్, ఒలింపిక్స్ పతక విజేత పీవీ సింధు రిటైర్మెంట్ కు సమయం దగ్గర పడుతున్నట్లే కనిపిస్తోంది. గత రెండేళ్లుగా వరుస వైఫల్యాలతో ఉక్కిరిబిక్కిరవుతోన్న సింధు..తరచూ శిక్షకులను మార్చుతున్నా ప్రయోజనం ఏమాత్రం కనిపించడం లేదు.

ఇంగ్లండ్ లోని బర్మింగ్ హామ్ వేదికగా ముగిసిన ప్రతిష్టాత్మక 2023 ఆల్ -ఇంగ్లండ్ ఓపెన్ తొలిరౌండ్లోనే సింధుకు చుక్కెదురయ్యింది. ప్రస్తుత 2023 సీజన్ లో ఇప్పటి వరకూ ఆడిన మూడుకు మూడు అంతర్జాతీయ టోర్నీల తొలిరౌండ్లోనే సింధు పరాజయాలు చవిచూసింది. అంతేకాదు..నాలుగో టోర్నీగా జరిగిన స్విస్ ఓపెన్లో సైతం సింధు చేతు లెత్తేసింది.

అచ్చిరాని ఆల్ -ఇంగ్లండ్..

ప్రపంచ టైటిల్, ఒలింపిక్స్ పతకాలు సాధించిన సింధూకి ఆల్- ఇంగ్లండ్ టైటిల్ ఏమాత్రం కొరుకుడు పడటం లేదు. ఆరునూరైనా ఆల్ ఇంగ్లండ్ టైటిల్ కొట్టాలని భావిస్తున్న సింధుపైన ఏడాది ఏడాదికీ వయసు మీద వచ్చి పడుతున్నా లక్ష్యం మాత్రం నెరవేరడం లేదు.

టోక్యో ఒలింపిక్స్ లో కాంస్య పతకం సాధించడంలో తనకు అండగా నిలిచిన కొరియా కోచ్ పార్క్ తాయ్ -సాంగ్ తో ఇటీవలే తెగతెంపులు చేసుకొని సరికొత్త కోచ్ తో బరిలోకి దిగినా సింధు అదృష్టం మారలేదు.

గత మూడేళ్లుగా ఆల్ -ఇంగ్లండ్ ఓపెన్ తొలిరౌండ్లోనే ఇంటిదారి పట్టడం సింధుకు ఓ అలవాటుగా, బలహీనతగా మారిపోయింది. ఆల్ -ఇంగ్లండ్ మెడల్, ట్రోఫీల సంగతి అటుంచి కనీసం తొలిరౌండ్ గండం నుంచి గట్టెక్కలేకపోతోంది.

గతంతో పోల్చిచూస్తే సింధు ఆటలో వాడివేడి తగ్గిపోయాయి. పైగా వయసు మీద పడటం, టైటిల్స్ సాధించాలన్న కసి తగ్గిపోడంతో సింధు ఇక రిటైర్మెంట్ ప్రకటించి..ఆంద్రప్రదేశ్ ప్రభుత్వంలో డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం చేసుకొంటూ మిగిలిన జీవితాన్ని గడిపేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

ప్రస్తుతం 27 సంవత్సరాల వయసులో ఉన్న సింధుకు ఫిట్ నెస్ కష్టాలతో పాటు..యువ ప్రత్యర్థుల నుంచి గట్టిపోటీ ఎదురుకానుంది. పారిస్ ఒలింపిక్స్ కు నేరుగా అర్హత సాధించాలంటే.. ప్రపంచ మొదటి ఐదు ర్యాంకర్లలో ఒకరిగా ఉండి తీరాలి. ఏవిధంగా చూసినా రానున్న కాలం సింధుకు పరీక్షాసమయమే.

Tags:    
Advertisement

Similar News