లక్ష్యం నెరవేరిన లక్ష్యసేన్!

భారత యువబ్యాడ్మింటన్ స్టార్ లక్ష్యసేన్ పారిస్ ఒలింపిక్స్ అర్హతకు చేరువయ్యాడు. ఆల్ -ఇంగ్లండ్ సెమీస్ చేరడం ద్వారా విలువైన ర్యాంకింగ్ పాయింట్లు సంపాదించాడు.

Advertisement
Update:2024-03-21 09:15 IST

భారత యువబ్యాడ్మింటన్ స్టార్ లక్ష్యసేన్ పారిస్ ఒలింపిక్స్ అర్హతకు చేరువయ్యాడు. ఆల్ -ఇంగ్లండ్ సెమీస్ చేరడం ద్వారా విలువైన ర్యాంకింగ్ పాయింట్లు సంపాదించాడు.

భారత బ్యాడ్మింటన్ నయాస్టార్ లక్ష్యసేన్ పారిస్ ఒలింపిక్స్ అర్హత దిశగా దూసుకుపోతున్నాడు. ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య ప్రకటించిన పురుషుల సింగిల్స్ తాజా ర్యాంకింగ్స్ ప్రకారం 13వ స్థానంలో నిలిచాడు.

వ్రతం చెడినా ఫలితం దక్కిన లక్ష్య...

రెండేళ్ల క్రితం ప్రతిష్టాత్మక ఆల్ -ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ లో రన్నరప్ గా నిలిచిన లక్ష్యసేన్ ఆ తరువాత నుంచి కొద్దిమాసాలపాటు వరుస పరాజయాలతో గతి తప్పాడు. మలేసియన్,ఇండియన్ ఓపెన్ తొలిరౌండ్ పోటీలలోనే లక్ష్య పరాజయం పొందాడు.

తాను పాల్గొనే మొత్తం ఎనిమిది అంతర్జాతీయ ర్యాంకింగ్ టోర్నీలలో ఏడింట తొలిరౌండ్లోనే విఫలమయ్యాడు. వరుస వైఫల్యాల దెబ్బతో ర్యాంకింగ్స్ లో లక్ష్య దిగజారిపోయాడు.

పారిస్ ఒలింపిక్స్ కు అర్హత సాధించడం కష్టమే అనిపించింది. అయితే..2024 సీజన్ పారిస్ ఓపెన్, ఆల్ -ఇంగ్లండ్ ఓపెన్ టోర్నీలలో సెమీస్ చేరడం ద్వారా లక్ష్య పడిలేచిన కెరటంలా దూసుకొచ్చాడు.

25 నుంచి 13వ ర్యాంక్ కు .....

22 సంవత్సరాల లక్ష్యసేన్ 2024-ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ టోర్నీలో అంచనాలకు మించి రాణించాడు. ప్రీ-క్వార్టర్ ఫైనల్స్ నుంచి సెమీస్ వరకూ ప్రపంచ మేటి ఆటగాళ్లపై సంచలన విజయాలతో పుంజుకోగలిగాడు.

గతవారం వరకూ 15వ ర్యాంక్ లో కొనసాగిన లక్ష్య..ఆల్ ఇంగ్లండ్ సెమీఫైనల్లో పోరాడి ఓడినా రెండుస్థానాల మేర తన ర్యాంకును మెరుగు పరుచుకోగలిగాడు. 2024 ఏప్రిల్ ఆఖరి వారం నాటికి ర్యాంకింగ్స్ మొదటి 16 స్థానాలలో నిలిచిన ఆటగాళ్లకు పారిస్ ఒలింపిక్స్ అర్హత దక్కుతుంది.

2022 నవంబర్ లో అత్యుత్తమంగా ప్రపంచ 6వ ర్యాంక్ సాధించిన లక్ష్య గతేడాది ఏప్రిల్ నాటికి 25వ ర్యాంక్ కు పడిపోయాడు.

ప్రస్తుత 13వ ర్యాంక్ ను లక్ష్య మరో ఐదువారాలపాటు కాపాడుకోగలిగితే పారిస్ ఒలింపిక్స్ పురుషుల సింగిల్స్ బరిలో నిలిచే అవకాశాన్ని సొంతం చేసుకోగలుగుతాడు.

భారత్ కే చెందిన 9వ ర్యాంక్ స్టార్ ప్రణయ్ ఒలింపిక్స్ లో పాల్గొనడం ఖాయంగా కనిపిస్తోంది.

భారత ఇతర సింగిల్స్ ఆటగాళ్లలో కిడాంబీ శ్రీకాంత్ 27వ ర్యాంక్ లోనూ, ప్రియాంశు రాజావత్ 32వ ర్యాంక్ లోనూ కొనసాగుతున్నారు.

ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్ లో సాత్విక్- చిరాగ్ జోడీ..

పురుషుల డబుల్స్ లో భారత సూపర్ జోడీ సాత్విక్ సాయిరాజ్- చిరాగ్ షెట్టి తమ ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్ ను నిలుపుకోగలిగారు. ఆల్ -ఇంగ్లండ్ ఓపెన్ రెండోరౌండ్లోనే పరాజయం ఎదురైనా భారత జోడీ టాప్ ర్యాంక్ కు ఎలాంటి ముప్పు వాటిల్లలేదు.

మహిళల డబుల్స్ లో అశ్వినీ పొన్నప్ప- తనీషా క్రాస్టో జోడీ 20వ ర్యాంక్ లోనూ, ట్రీసా జాలీ- గాయత్రీ గోపీచంద్ జోడీ 26వ ర్యాంక్ లోనూ కొనసాగుతున్నారు.

Tags:    
Advertisement

Similar News