ఎలిమినేటర్ పోరులో రాజస్థాన్ కు బెంగళూరు గండం!

ఐపీఎల్ -17వ సీజన్లో రౌండ్ రాబిన్ లీగ్ 70 మ్యాచ్ ల తొలి అంచె విజయవంతంగా ముగిసింది. మొత్తం 10 జట్లలో అధికశాతం 14 రౌండ్లమ్యాచ్ లను ఆడగలిగాయి.

Advertisement
Update:2024-05-20 17:15 IST

ఐపీఎల్ -17వ సీజన్లో రౌండ్ రాబిన్ లీగ్ 70 మ్యాచ్ ల తొలి అంచె విజయవంతంగా ముగిసింది. మొత్తం 10 జట్లలో అధికశాతం 14 రౌండ్లమ్యాచ్ లను ఆడగలిగాయి.

గౌహతీ వేదికగా రాజస్థాన్ రాయల్స్- కోల్ కతా నైట్ రైడర్స్ జట్ల నడుమ జరగాల్సిన ఆఖరి, 70 మ్యాచ్ వానదెబ్బతో టాస్ పడకుండానే రద్దుల పద్దులో చేరిపోయింది.

దీంతో రెండుజట్లు చెరో పాయింట్ ను పంచుకోవాల్సి వచ్చింది.

రాజస్థాన్ రాయల్స్ ను ముంచిన వాన...

కోల్ కతా నైట్ రైడర్స్ తో జరిగే ఆఖరిరౌండ్ మ్యాచ్ లో నెగ్గడం ద్వారా లీగ్ టేబుల్ రెండోస్థానాన్ని నిలుపుకోవాలన్న రాజస్థాన్ రాయల్స్ అడియాస లయ్యాయి.

రౌండ్ రాబిన్ లీగ్ తొలిదశ మొదటి 9 రౌండ్లలో 8 విజయాలతో దూసుకెళ్లిన రాజస్థాన్..ఆ తరువాతి ఐదు రౌండ్లలో వరుస పరాజయాలతో మరి తేరుకోలేకపోయింది.

ప్లే-ఆఫ్ రౌండ్ కు చేరుకోగలిగినా..మొదటి రెండుజట్లలో ఒకటిగా నిలువలేక చివరకు మూడోస్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

లీగ్ టేబుల్ టాపర్ గా కోల్ కతా...

మాజీ చాంపియన్ , రెండుసార్లు విజేత కోల్ కతా నైట్ రైడర్స్ అత్యధిక విజయాలతో డబుల్ రౌండ్ రాబిన్ లీగ్ లో అత్యంత విజయవంతమైన జట్టుగా నిలిచింది. మొత్తం 14 రౌండ్లలో 9 విజయాలు, 3 పరాజయాలు, రెండుమ్యాచ్ లు వానదెబ్బతో లభించిన 2 పాయింట్లతో కలిపి 20 పాయింట్లు సాధించడ ద్వారా లీగ్ టేబుల్ టాపర్ గా క్వాలిఫైయర్ -1 పోరుకు అర్హత సంపాదించింది. క్వాలిఫైయర్ -1 లో సన్ రైజర్స్ తో పోటీపడనుంది. నిబంధనల ప్రకారం క్వాలిఫైయర్-1 పోరులో ఓడిన జట్టుకు ఫైనల్స్ చేరటానికి మరో అవకాశం ఉంటుంది. నెగ్గిన జట్టు నేరుగా ఫైనల్స్ కు చేరుకోగా..ఓడిన జట్టు..రెండో క్వాలిఫైయర్ పోరులో ఎలిమినేటర్ రౌండ్ విన్నర్ తో తలపడాల్సి ఉంది.

మెరుగైన రన్ రేట్ తో రెండోస్థానంలో సన్ రైజర్స్..

మొత్తం 14 రౌండ్లలో 8 విజయాలతో 17 పాయింట్లు సాధించడం ద్వారా..రాజస్థాన్ రాయల్స్ తో సమఉజ్జీగా నిలిచిన హైదరాబాద్ సన్ రైజర్స్..మెరుగైన రన్ రేటు తో రెండోస్థానం కైవసం చేసుకోగలిగింది.

రౌండ్ రాబిన్ లీగ్ దశలో రెండుసార్లు అత్యధిక టీమ్ స్కోర్లు, అత్యధిక ఫోర్లు, అత్యధిక సిక్సర్లు, పవర్ ప్లే ఓవర్లలో అత్యధిక స్కోర్ల రికార్డులతో వీరవిహారం చేసిన సన్ రైజర్స్ పవర్ ఫుల్ జట్టుగా నిలిచింది.

అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా ఈనెల 21న జరిగే క్వాలిఫైయర్ -1 పోరులో టేబుల్ టాపర్ కోల్ కతా నైట్ రైడర్స్ తో తలపడనుంది.

ఆరంభంలో జోరు...చివర్లో బేజారు...

ఐపీఎల్ డబుల్ రౌండ్ రాబిన్ లీగ్ తొలి అంచెలోని మొత్తం 9 రౌండ్లలో ఎనిమిది విజయాలతో అదరగొట్టిన రాజస్థాన్ ..ఆఖరి ఆరు రౌండ్లలో కనీసం ఒక్క విజయమూ సాధించలేకపోయింది.

14 రౌండ్లలో 17 పాయింట్లు మాత్రమే సాధించినా..మెరుగైన రన్ రేట్ లో సన్ రైజర్స్ కంటే దిగువన ఉండటం కారణంగా మూడోస్థానానికి పరిమితం కావాల్సి వచ్చింది.

సన్ రైజర్స్ నెట్ రన్ రేటు 0.414 కాగా..రాజస్థాన్ రాయల్స్ నెట్ రన్ రేట్ 0.273.గా మాత్రమే ఉంది.

అహ్మదాబాద్ వేదికగా బుధవారం జరిగే ఎలిమినేటర్ రౌండ్లో సంచలన విజయాల బెంగళూరు రాయల్ చాలెంజర్స్ ను రాజస్థాన్ రాయల్స్ ఢీ కొనాల్సి ఉంది.

జోస్ బట్లర్ లాంటి డాషింగ్ ఓపెనర్ అందుబాటులో లేకపోడం, యువఓపెనర్ యశస్వి జైశ్వాల్ అంతంత మాత్రం ఫామ్ లో ఉండటం రాజస్థాన్ పాలిట శాపంగా మారింది.

వారేవ్వా...బెంగళూరు....

డబుల్ రౌండ్ రాబిన్ లీగ్ ఆఖరి 7 రౌండ్లలో ఆరు వరుస విజయాలతో సంచలనం సృష్టించిన బెంగళూరు రాయల్ చాలెంజర్స్ 14 రౌండ్లలో 7 విజయాలు, 7 పరాజయాల తో 14 పాయింట్లు సాధించడం ద్వారా లీగ్ టేబుల్ 4వ స్థానంలో నిలిచింది. ప్లే-ఆఫ్ రౌండ్ చేరే అవకాశం ఏమాత్రం లేని బెంగళూరు అసాధ్యాన్ని సుసాధ్యం చేసి..ఆఖరిరౌండ్లో చెన్నై సూపర్ కింగ్స్ పై సంచలన విజయంతో చరిత్ర సృష్టించింది.

ఎలిమినేటర్ రౌండ్ పోరులో రాజస్థాన్ రాయల్స్ పని పట్టడానికి బెంగళూరు ఉరకలేస్తోంది. ఎలిమినేటర్ పోరులో హాట్ ఫేవరెట్ జట్టు ఏదంటే బెంగళూరు మాత్రమే అనుకొనేలా చేసింది.

ఆరెంజ్ క్యాప్ హీరో విరాట్ కొహ్లీ...

ఐపీఎల్ గత 16 సీజన్ల చరిత్రలో అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్లకు ఇచ్చే ఆరెంజ్ క్యాప్ ను అందుకోడం విరాట్ కొహ్లీకి ఇదే మొదటిసారి కాదు. ప్రస్తుత 17వ సీజన్ రౌండ్ రాబిన్ లీగ్ లో విరాట్ వీరవిహారమే చేశాడు. తన కెరియర్ లో రెండోసారి 700కు పైగా పరుగులు సాధించడం ద్వారా సరికొత్త రికార్డు నెలకొల్పాడు.

ప్రస్తుత సీజన్ మొత్తం 14 రౌండ్ల మ్యాచ్ ల్లో విరాట్ ఓ సెంచరీ, 5 హాఫ్ సెంచరీలతో సహా 708 పరుగులు సాధించాడు. 64.36 సగటు, 155.60 స్ట్ర్రయిక్ రేట్ తో ఆరెంజ్ క్యాప్ సాధించాడు. ఎలిమినేటర్ రౌండ్ మ్యాచ్ సైతం విరాట్ ఆడాల్సి ఉంది.

డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ 5, ఢిల్లీ క్యాపిటల్స్ 6, లక్నో సూపర్ జెయింట్స్ 7, గుజరాత్ టైటాన్స్ 8, పంజాబ్ కింగ్స్ 9, ముంబై ఇండియన్స్ 10 స్థానాలలో నిలిచాయి.

ప్లే-ఆఫ్ రౌండ్లలోని మొదటి క్వాలిఫైయర్, ఎలిమినేటర్ రౌండ్ మ్యాచ్ లకు అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియం ఆతిథ్యమిస్తోంది. క్వాలిఫైయర్ -2, టైటిల్ సమరం మ్యాచ్ లను చెన్నై చెపాక్ స్టేడియం వేదికగా నిర్వహించనున్నారు.

Tags:    
Advertisement

Similar News