హైదరాబాద్ ఐపీఎల్ లో పరుగుల తుపాను, రికార్డుల సునామీ!

ఐపీఎల్ చరిత్రలోనే పలు అరుదైన సరికొత్త రికార్డులకు హైదరాబాద్ రాజీవ్ గాంధీ స్టేడియం వేదికగా నిలిచింది. మాజీ చాంపియన్లు ముంబై, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల పోరులో ప్రపంచ రికార్డు స్కోరు నమోదయ్యింది.

Advertisement
Update:2024-03-28 09:43 IST

ఐపీఎల్ చరిత్రలోనే పలు అరుదైన సరికొత్త రికార్డులకు హైదరాబాద్ రాజీవ్ గాంధీ స్టేడియం వేదికగా నిలిచింది. మాజీ చాంపియన్లు ముంబై, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల పోరులో ప్రపంచ రికార్డు స్కోరు నమోదయ్యింది.

భారతగడ్డపై గత 17 సీజన్లుగా జరుగుతూ వస్తున్న ఐపీఎల్ కొత్తపుంతలు తొక్కుతోంది. సీజన్ సీజన్ కూ తన రూపును మార్చుకొంటూ అభిమానులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.

2024 -సీజన్ మొదటివారం రోజుల పోటీలలోనే రికార్డుల వెల్లువకు తెరలేచింది. హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా మాజీ చాంపియన్లు హైదరాబాద్ సన్ రైజర్స్- ముంబై ఇండియన్స్ జట్ల పోరు పలు సరికొత్త రికార్డులకు వేదికగా నిలిచింది.

40 ఓవర్లలో 523 పరుగులు.....

పరుగుల గని, బ్యాటర్ల స్వర్గం రాజీవ్ స్టేడియం పిచ్ పైన ముందుగా కీలక టాస్ నెగ్గిన ముంబైజట్టు ఫీల్డింగ్ ఎంచుకోడం ద్వారా కోరి కష్టాలను కొని తెచ్చుకొంది.

ముందుగా బ్యాటింగ్ కు దిగిన ఆతిథ్యజట్టు సన్ రైజర్స్ దంచి కొట్టింది.

20 ఓవర్లలో కేవలం 3 వికెట్లు మాత్రమే నష్టపోయి 277 పరుగుల రికార్డు స్కోరు సాధించింది. 2008లో ప్రారంభమైన ఐపీఎల్ 17 సంవత్సరాల చరిత్రలో ఇదే అత్యధిక టీమ్ స్కోరుగా నిలిచింది.

సన్ రైజర్స్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ ముందుగా 18 బంతుల్లోనే రికార్డు హాఫ్ సెంచరీ సాధించాడు. ఆ తరువాత 20 నిముషాల వ్యవధిలోనే వన్ డౌన్ అభిషేక్ శర్మ 16 బంతుల్లోనే మెరుపు అర్థశతకంతో హెడ్ రికార్డును అధిగమించాడు.

2015, 2018 సీజన్లలో డేవిడ్ వార్నర్ నెలకొల్పిన మెరుపు హాఫ్ సెంచరీల రికార్డును హెడ్, అభిషేక్ తెరమరుగు చేయగలిగారు.

పవర్ ప్లే ఓవర్లలో సన్ రైజర్స్ 'పవర్' !

ఓపెనర్ హెడ్, వన్ డౌన్ అభిషేక్ 2వ వికెట్ కు 68 పరుగుల భాగస్వామ్యంతో చెలరేగిపోడంతో సన్ రైజర్స్ పవర్ ప్లే ఓవర్లలో 81 పరుగులు, మొదటి 10 ఓవర్లలో 2 వికెట్లకు 148 పరుగుల స్కోరు నమోదు చేయగలిగింది. ఓవర్ కు 14.8 పరుగుల చొప్పున సాధించడం ద్వారా సరికొత్త రికార్డు నెలకొల్పింది.

హెడ్ 24 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లతో 62 పరుగులు, అభిషేక్ 23 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్సర్లతో 63 పరుగుల స్కోర్లు సాధించడంతో ప్రపంచ రికార్డు స్కోరుకు పునాది పడింది.

చివరి 6 ఓవర్లలో మిడిలార్డర్ బ్యాటర్లు మర్కరమ్- క్లాసెన్ శివమెత్తిపోయారు. ముంబై బౌలర్లను చీల్చి చెండాడారు. మర్కరమ్ 28 బంతుల్లో 42, వీరబాదుడు క్లాసెన్ 34 బంతుల్లో 4 ఫోర్లు, 7 సిక్సర్లతో 80 పరుగుల నాటౌట్ స్కోర్లు సాధించడంతో సన్ రైజర్స్ 277 పరుగుల రికార్డు స్కోరు సాధించగలిగింది.

ముంబై బౌలర్లలో బుమ్రా, పాండ్యా, కొట్జే తలో వికెట్ పడగొట్టారు.

ముంబై పేరుతో మరో చెత్త రికార్డు....

ఇప్పటికే ఐపీఎల్ లో ఎన్నో గొప్పగొప్ప రికార్డులు నెలకొల్పిన ముంబై పలు చెత్త రికార్డులను సైతం మూటగట్టుకొంది. టీ-20 చరిత్రలోనే అత్యధిక పరుగులు సమర్పించుకొన్నజట్టుగా నిలిచింది. ప్రత్యర్థిజట్టుకు 20 ఓవర్లలో 277 పరుగులిచ్చిన తొలిజట్టుగా రికార్డుల్లో చేరింది.

278 పరుగుల రికార్డు లక్ష్యంతో చేజింగ్ కు దిగిన ముంబై చివరకు 20 ఓవర్లలో 5 వికెట్లకు 246 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఓపెనర్లు రోహిత్ శర్మ 26, ఇషాన్ కిషన్ 34, వన్ డౌన్ నమన్ ధర్ 30, రెండోడౌన్ తిలక్ వర్మ 62, పాండ్యా 24, టిమ్ డేవిడ్ 42, రొమారియా షెఫర్డ్ 15 పరుగులు చేసినా..ముంబైకి 31 పరుగుల పరాజయం తప్పలేదు.

సన్ రైజర్స్ బౌలర్లలో కమిన్స్, ఉనద్కత్ చెరో 2 వికెట్లు, షాబాజ్ అహ్మద్ 1 వికెట్ పడగొట్టారు. సన్ రైజర్స్ విజయంలో ప్రధానపాత్ర వహించిన అభిషేక్ వర్మకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

ప్రస్తుత లీగ్ ప్రారంభరౌండ్లలో ముంబైకి ఇది వరుసగా రెండో ఓటమి కాగా..హైదరాబాద్ సన్ రైజర్స్ కు ఇదే తొలిగెలుపు.

రికార్డులే రికార్డులు......

ప్రస్తుత సీజన్ లీగ్ 8వ మ్యాచ్ లోనే సన్ రైజర్స్, ముంబై ఇండియన్స్ జట్లు కలసి అరడజనుకు పైగా సరికొత్త రికార్డులు నమోదు చేయగలిగాయి. అత్యధిక టీమ్ స్కోరు, అత్యధిక ఫోర్లు, సిక్సర్లు, రెండో ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ కు దిగిన జట్టు సాధించిన అత్యధిక స్కోరు రికార్డులు సరికొత్తగా వచ్చి చేరాయి.

2013 సీజన్లో బెంగళూరు వేదికగా నమోదైన 5 వికెట్లకు 263 పరుగుల అత్యధిక టీమ్ స్కోరును ప్రస్తుత ఈ మ్యాచ్ ద్వారా సన్ రైజర్స్ 277 పరుగుల స్కోరుతో తెరమరుగు చేయగలిగింది. లీగ్ లో మాత్రమే కాదు..అంతర్జాతీయ టీ-20ల్లో సైతం ఇదే అత్యధిక టీమ్ స్కోరు కావడం విశేషం.

అత్యధిక బౌండ్రీల రికార్డు...

ముంబై, సన్ రైజర్స్ జట్లు కలసి సాధించిన మొత్తం 523 పరుగుల స్కోరులో మొత్తం 69 ఫోర్లు, సిక్సర్ల షాట్లు ఉన్నాయి. 2010 సీజన్లో చెన్నై- రాజస్థాన్ రాయల్స్ జట్ల మ్యాచ్ లో నమోదైన 69 బౌండ్రీ షాట్ల రికార్డును ప్రస్తుత ఈ మ్యాచ్ ద్వారా రెండుజట్లూ కలసి సమం చేయగలిగాయి.

సన్ రైజర్స్ బ్యాటర్లు మొత్తం 18 సిక్సర్ షాట్లు బాదితే...ముంబై బ్యాటర్లు 20 సిక్సర్లు బాదారు. రెండుజట్లూ కలసి 38 సిక్సర్లతో వారేవా అనిపించుకొన్నాయి.

అంతర్జాతీయ టీ-20 చరిత్రలో సైతం ఇదే అత్యధిక సిక్సర్ల మ్యాచ్ గా నిలిచింది.

అత్యధిక మ్యాచ్ స్కోరు రికార్డు...

ఈ మ్యాచ్ ద్వారా రెండుజట్లు కలసి 523 పరుగులు సాధించడం ద్వారా సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పాయి. ఐపీఎల్ లో మాత్రమే కాదు...అంతర్జాతీయ టీ-20 చరిత్రలో సైతం అత్యధిక స్కోరు నమోదైన మ్యాచ్ గా ముంబై- సన్ రైజర్స్ మ్యాచ్ రికార్డుల్లో చేరింది.

2023 సీజన్లో సెంచూరియన్ వేదికగా దక్షిణాఫ్రికా- వెస్టిండీస్ జట్ల నడుమ జరిగిన అంతర్జాతీయ టీ-20 మ్యాచ్ లో నమోదైన 517 పరుగులే ఇప్పటి వరకూ ప్రపంచ రికార్డు స్కోరుగా ఉంది. ఆ రికార్డును సన్ రైజర్స్- ముంబై జట్ల మ్యాచ్ లో నమోదైన 523 పరుగుల స్కోరు తెరమరుగు చేయగలిగింది.

278 పరుగుల ప్రపంచ రికార్డు చేజింగ్ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ కు దిగిన ముంబై మొదటి 3 ఓవర్లలోనే 16.67 సగటుతో వికెట్ నష్టపోకుండా 50 పరుగులు సాధించడంతో పాటు 5 వికెట్లకు 246 పరుగులు చేయడం ద్వారా ప్రపంచ రికార్డు నెలకొల్పగలిగింది.

ముంబై బ్యాటింగ్ ఆర్డర్లోని మొదటి ఆరుగురు బ్యాటర్లు 20కి పైగా స్కోర్లు సాధించడం ఐపీఎల్ చరిత్రలోనే ఇదే మొదటిసారి.

రికార్డుల వెల్లువలా సాగిన ఈ మ్యాచ్ కు 35వేల మంది హాజరు కావడం, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం కళకళ లాడటం విశేషం.

Tags:    
Advertisement

Similar News