పూరన్, స్టోయినిస్ బాదుడే బాదుడు..లక్నో సూపర్ చేజ్!
ఐపీఎల్ లీగ్ నాలుగోరౌండ్ మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ సూపర్ చేజింగ్ విజయం సాధించింది. బెంగళూరును ఒక్క వికెట్ తేడాతో అధిగమించింది.
ఐపీఎల్ లీగ్ నాలుగోరౌండ్ మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ సూపర్ చేజింగ్ విజయం సాధించింది. బెంగళూరును ఒక్క వికెట్ తేడాతో అధిగమించింది...
ఐపీఎల్ -16వ సీజన్ లీగ్ ప్రారంభరౌండ్ మ్యాచ్ లు ఒక దానిని మించి ఒకటి ఉత్కంఠతో సాగిపోతున్నాయి. గుజరాత్ జెయింట్స్ పై కోల్ కతా నైట్ రైడర్స్ సాధించిన సంచలన విజయం మజా నుంచి అభిమానులు తేరుకోక ముందే..రాయల్ చాలెంజర్స్ బెంగళూరు పై లక్నో సూపర్ జెయింట్స్ మరో అనూహ్య విజయంతో సంచలనం సృష్టించింది.
బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా మ్యాచ్ ఆఖరి బంతి వరకూ నువ్వానేనా అన్నట్లుగా సాగిన హైస్కోరింగ్ థ్రిల్లర్లో లక్నోజట్టు కళ్లు చెదిరే విజయం నమోదు చేసింది.
బెంగళూరు బ్యాంగ్ బ్యాంగ్...
హోంగ్రౌండ్ చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన ఈ పోరులో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు 20 ఓవర్లలో కేవలం 2 వికెట్లు మాత్రమే నష్టపోయి 212 పరుగుల భారీస్కోరు నమోదు చేసింది.
మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ 44 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 61), కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ (46 బంతుల్లో 79 నాటౌట్; 5 ఫోర్లు, 5 సిక్సర్లు), గ్లెన్ మ్యాక్స్‌వెల్ (29 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్సర్లతో 59) పరుగులతో చెలరేగారు.
ఓపెనింగ్ జోడీ విరాట్ కొహ్లీ- డూప్లెసిస్ మొదటి వికెట్ కు అద్దిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. లక్నో ఫాస్ట్ బౌలర్ ఆవేశ్ ఖాన్ వేసిన ఓవర్లో విరాట్ ఓ సిక్సర్, బౌండ్రీతో పరుగుల వేట మొదలు పెట్టాడు. ఆ తర్వాతి ఓవర్లో సైతం మరో రెండు ఫోర్లు బాదాడు. స్పిన్నర్ కృణాల్ ను సైతం విరాట్ విడిచి పెట్టలేదు.
సిక్సర్ తో చుక్కలు చూపించాడు. మెరుపు ఫాస్ట్ బౌలర్ మార్క్ వుడ్ ఓవర్లో 4,6తో దూకుడు పెంచాడు. దీంతో బెంగళూరు పవర్ ప్లే ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 55 స్కోరుతో భారీస్కోరుకు పునాది వేసుకొంది.
స్పిన్నర్ల రాకతో స్కోరు వేగం మందగించింది. కోహ్లీ 35 బంతుల్లోనే తన 46వ ఐపీఎల్ హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. లెగ్ స్పిన్నర్ అమిత్ మిశ్రా బౌలింగ్ లో విరాట్ ఔట్ కాగా.. మ్యాక్స్‌వెల్ రాకతో బెంగళూరు జోరు టాప్ గేర్ కి చేరింది.
అమిత్ మిశ్రా ఓవర్‌లో మాక్స్ వెల్ 4,6తో బాదుడు మొదలు పెట్టాడు.. మరుసటి ఓవర్‌లో డుప్లెసిస్ రెండు, మ్యాక్స్ ఒక సిక్సర్ బాదారు. డుప్లెసిస్ కొట్టిన ఒక షాట్ 115 మీటర్ల దూరం( చిన్నస్వామి స్టేడియం బయట ) వెళ్లి పడింది. డుప్లెసిస్ 35 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేశాడు. ఉనాద్కట్ వేసిన 18వ ఓవర్లో 6,6,4 కొట్టగా.. 19వ ఓవర్లో రెండు సిక్సర్లతో మ్యాక్స్‌వెల్ ఫిఫ్టీ మార్క్ దాటాడు. లక్నో బౌలర్లలో అమిత్ మిశ్రా, మార్క్‌వుడ్ చెరో వికెట్ పడగొట్టారు
స్టోయినిస్ హిట్, పూరన్ సూపర్ హిట్...
మ్యాచ్ నెగ్గాలంటే 213 పరుగుల భారీలక్ష్యంతోచేజింగ్ కు దిగిన లక్నో సూపర్ జెయింట్స్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 213 పరుగుల స్కోరుతో ఆఖరి బంతి విజయం సాధించింది.
తొలి ఓవర్‌లోనే షాక్ తగిలింది. సిరాజ్ బౌలింగ్‌లో కైల్ మేయర్స్(0) బౌల్డ్ అయ్యాడు. పార్నెల్ తన తొలి ఓవర్లోనే రెండు వికెట్లు తీసి లక్నోను దెబ్బకొట్టాడు. వరుస బంతుల్లో దీపక్ హుడా(9), కృనాల్ పాండ్యాను పెవిలియన్ పంపడంతో 23 పరుగులకే లక్నో మూడు వికెట్లు కోల్పోయింది.
తొలి ఓవర్ మూడో బంతికే విధ్వంసక ఆటగాడు మయేర్స్‌ను సిరాజ్ క్లీన్‌బౌల్డ్ చేశాడు. పార్నెల్ వేసిన నాలుగో ఓవర్‌లో హుడా, కృనాల్ కూడా వెనుదిరగడంతో పవర్‌ప్లే (6 ఓవర్లు) ముగిసే సరికి లక్నో 37/3తో పీకలోతు కష్టాలలో పడిపోయింది.మరోవైపు క్రీజులో కుదురుకున్న కెప్టెన్ రాహుల్ స్కోరుబోర్డును పరుగెత్తించడానికి నానాకష్టాలు పడ్డాడు. మరో వైపు స్టొయినిస్ భారీ షాట్లతో బెంగళూరు బౌలర్లను బెంబేలెత్తించాడు.
పేసర్ హర్షల్ పటేల్ వేసిన ఎనిమిదో ఓవర్‌లో 6,4,4 కొట్టిన స్టోయినిస్ చివరకు లెగ్ స్పిన్నర్ కరణ్ శర్మ బౌలింగ్‌లోనూ దంచికొట్టాడు.
హాఫ్ సెంచరీతో జోరుమీదున్న స్టోయినిస్(65)ను కరణ్ శర్మ ఔట్ చేశాడు. నాలుగో వికెట్‌కు 76 రన్స్ జోడించారు. ఆ వెంటనే సిరాజ్ బౌలింగ్‌లో కేఎల్ రాహుల్(18) ఔట్ కావడంతో లక్నోకు గెలుపు అసాధ్యమేననిపించింది.
పూరన్ ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ...
మిడిలార్డర్ బ్యాటర్లు నికోలస్ పూరన్- ఆయుష్ బదౌనీ బాధ్యతాయుతంగా, సమయోచితంగా ఆడి మ్యాచ్ స్వరూపాన్నే మార్చి వేశారు. 16 కోట్ల రూపాయల వేలం ధరకు లక్నోకు ఆడుతున్న పూరన్ తన ఆటతీరుతో పైసా వసూల్ అనుకొనేలా చేశాడు. పూరన్ వచ్చీరావడంతోనే బెంగళూరు బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కరణ్ శర్మ బౌలింగ్‌లో రెండు సిక్సర్లు బాదిన పూరన్.. హర్షల్‌కు 6,4,6 రుచి చూపించాడు. పార్నెల్ బౌలింగ్‌లో 4,6,4తో 15 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. ఈ సీజన్‌లో ఇదే అత్యంత వేగవంతమైన అర్థశతకంగా రికార్డుల్లో చేరింది.లక్నో విజయానికి 19 బంతుల్లో 24 పరుగులు చేయాల్సిన దశలో పూరన్ ఔట్ కావడంతో ఉత్కంఠ నెలకొన్నా.. లక్నో ఆఖరి బంతిలో విజయలక్ష్యాన్ని చేరుకోగలిగింది.
బెంగళూరు బౌలర్లలో పేసర్లు సిరాజ్, వెనే పార్నెల్ చెరో 3 వికెట్లు పడగొట్టారు. లక్నోకు అపూర్వ విజయం అందించిన నికోలస్ పూరన్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.
లక్నోకు నాలుగురౌండ్లలో ఇది రెండో మూడో గెలుపు కాగా..బెంగళూరుకు మూడురౌండ్లలో వరుసగా రెండో ఓటమి.
ఈరోజు జరిగే పోరులో ముంబై ఇండియన్స్ తో ఢిల్లీ క్యాపిటల్స్ తలపడనుంది. రాత్రి 7-30కి ఈ మ్యాచ్ న్యూఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరుగనుంది.
ప్రస్తుత లీగ్ లో ఢిల్లీ, ముంబై జట్లు కనీసం ఒక్క గెలుపు లేకుండా లీగ్ టేబుల్ ఆఖరి రెండుస్థానాలలో కొట్టిమిట్టాడుతున్నాయి.