ఆసియాక్రీడల హాకీ ఫైనల్లో భారత్!

19వ ఆసియాక్రీడల హాకీ పురుషుల ఫైనల్స్ కు హాట్ ఫేవరెట్ భారత్ దూసుకెళ్లింది. ఎనిమిదేళ్ల తర్వాత గోల్డ్ మెడల్ రౌండ్లో అడుగుపెట్టింది.

Advertisement
Update:2023-10-05 08:30 IST

19వ ఆసియాక్రీడల హాకీ పురుషుల ఫైనల్స్ కు హాట్ ఫేవరెట్ భారత్ దూసుకెళ్లింది. ఎనిమిదేళ్ల తర్వాత గోల్డ్ మెడల్ రౌండ్లో అడుగుపెట్టింది...

ప్రపంచ హాకీ 3వ ర్యాంకర్ భారత్ జైత్రయాత్ర కొనసాగుతోంది. హాంగ్జు వేదికగా జరుగుతున్న 19వ ఆసియాక్రీడల గ్రూపు లీగ్ నుంచి సెమీఫైనల్స్ నాకౌట్ వరకూ రికార్డు విజయాలతో ఫైనల్ కు చేరుకొంది.

8 ఏళ్ల తర్వాత టైటిల్ రౌండ్లో.....

గత రెండేళ్లుగా అంతర్జాతీయ హాకీలో నిలకడగా రాణిస్తూ..కళ్లు చెదిరే విజయాలు సాధిస్తున్న భారతజట్టు ప్రస్తుత ఆసియాక్రీడల్లో సైతం అదేజోరు కొనసాగించింది. 8 సంవత్సరాల విరామం తర్వాత తిరిగి గోల్డ్ మెడల్ రౌండ్ కు అర్హత సంపాదించింది.

ఫైనల్లో చోటు కోసం జరిగిన తొలి సెమీఫైనల్లో మాజీ చాంపియన్ దక్షిణ కొరియాను భారత్ 5-3 గోల్స్ తో చిత్తు చేసి ఫైనల్లో అడుగుపెట్టింది.

మొదటి క్వార్టర్ లోనే 3 గోల్స్...

కొరియాతో పోరు మొదటి 15 నిముషాల ఆటలోనే భారత్ దూకుడుగా ఆడి 3 గోల్స్ తో పైచేయి సాధించింది. హార్దిక్, మన్ దీప్, లలిత్ ఉపాధ్యాయ తలో గోలు సాధించడంతో 3-0తో తొలి క్వార్టర్ ను ముగించింది.

అయితే..రెండో క్వార్టర్ లో కొరియా ఎదురుదాడికి దిగి..పెనాల్టీకార్నర్ లను గోల్సుగా మలచుకోడం ద్వారా భారత్ ఆధిక్యాన్ని 3-2కు తగ్గించగలిగింది.

ఆట 24వ నిముషంలో అమిత్ రోహిదాస్..పెనాల్టీ కార్నర్ ద్వారా గోల్ సాధించడంతో భారత్ నాలుగో గోలుతో 4-2తో నిలిచింది.

మూడో క్వార్టర్ లో మాత్రం భారత్ పూర్తిగా ఆత్మరక్షణలో పడిపోయింది. ఆఖరి క్వార్టర్ లో రెండుజట్లు చెరో గోలు సాధించడం తో మ్యాచ్ 5-3 గోల్స్ తేడాతో విజేతగా నిలిచింది.

గత ఆసియాక్రీడల సెమీస్ లో మలేసియా చేతిలో పెనాల్టీ షూటౌట్ ఓటమితో కాంస్య పతకానికే పరిమితమైన భారత్ ప్రస్తుత ఆసియాక్రీడల్లో మాత్రం తిరుగులేని విజయాలతో బంగారు పతకానికి గెలుపు దూరంలో నిలువగలిగింది.

ఆరుజట్ల గ్రూపు లీగ్ దశలో మొత్తం 58 గోల్స్ తో ఐదుకు ఐదు విజయాలు సాధించిన ఒకే ఒక్కజట్టుగా భారత్ చరిత్ర సృష్టించింది. చైనా- జపాన్ జట్ల రెండో సెమీఫైనల్లో నెగ్గినజట్టుతో భారత్ ఫైనల్లో తలపడనుంది.

Tags:    
Advertisement

Similar News