పురుషుల ప్రపంచకప్ మ్యాచ్ కు మహిళా రిఫరీలు!
ఫిఫా ప్రపంచకప్ పురుషుల ఫుట్ బాల్ టోర్నీలో మహిళలు ఈరోజు సరికొత్త చరిత్ర సృష్టించబోతున్నారు.
ఫిఫా ప్రపంచకప్ పురుషుల ఫుట్ బాల్ టోర్నీలో మహిళలు ఈరోజు సరికొత్త చరిత్ర సృష్టించబోతున్నారు. జర్మనీ- కోస్టారికాజట్ల నడుమ జరిగే గ్రూప్ లీగ్ మ్యాచ్ ను మహిళా రిఫరీలే తొలిసారిగా నిర్వహించనున్నారు...
రంగం ఏదైనా మహిళలు దూసుకుపోతున్నారు. తమకు అవకాశం ఇస్తే పురుషులతో సమానంగా రాణించగలమని పదేపదే చాటి చెబుతున్నారు. దానికి క్రీడారంగం సైతం ఏమాత్రం మినహాయింపు కాదు.
మెరుపువేగంతో సాగిపోయే ఫుట్ బాల్ లో రిఫరీ బాధ్యతలు ఎంతో సవాలుతో కూడుకొని ఉంటాయి. ఆటగాళ్లతో పాటు రిఫరీలు సైతం ఆ చివరి నుంచి ఈ చివరికి..ఈ చివరి నుంచి ఆ చివరికి నిరంతరం పరుగుగెడుతూనే ఉంటూ మ్యాచ్ ను నిర్వహించాలి. అలాంటి కష్టమైన, క్లిష్టతరమైన సవాళ్లను స్వీకరించడానికి మహిళలు సైతం ముందుకు వస్తున్నారు.
మహిళా ప్రపంచకప్ టు పురుషుల ప్రపంచకప్...
అంతర్జాతీయ ఫుట్ బాల్ సమాఖ్య మహిళలను వివిధ విభాగాలలో ప్రోత్సహించడానికి తగిన చర్యలు చేపట్టింది. పురుషులతో సమానంగా మహిళలకు సైతం అవకాశాలు కల్పించడానికి నడుం బిగించింది.
ఫుట్ బాల్ మ్యాచ్ లను నిర్వహించే రిఫరీలు, లైన్ అంపైర్ల విభాగంలో మహిళలకు సైతం శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. మహిళల ఫుట్ బాల్ మ్యాచ్ లను మహిళా రిఫరీలే నిర్వహించేలా ఇప్పటి వరకూ సహకరిస్తూ వచ్చింది.
మహిళల ప్రపంచకప్ ఫుట్‌బాల్ మ్యాచ్ లను మహిళా అంపైర్లు, రిఫరీలు నిర్వహించుకొనేలా గత కొద్ది సంవత్సరాలుగా ఏర్పాట్లు చేస్తూ వచ్చింది. అయితే..ప్రస్తుత 2022 పిఫా పురుషుల ప్రపంచకప్ లో సైతం రిఫరీలుగా, లైన్ అంపైర్లుగా మహిళలకు తొలిసారిగా అవకాశం కల్పించింది.
ప్రపంచకప్ గ్రూప్- ఇ లీగ్ లో భాగంగా జర్మనీ- కోస్టారికాజట్ల మధ్య జరిగే ఆఖరిమ్యాచ్ ను నిర్వహించే బాధ్యతను మహిళా రిఫరీల బృందానికి అప్పజెప్పింది.
ఫ్రెంచ్ రిఫరీకి అరుదైన గౌరవం..
పురుషుల ప్రపంచకప్ ఫుట్ బాల్ చరిత్రలో రిఫరీగా వ్యవహరించిన తొలి మహిళ గౌరవాన్ని ఫ్రెంచ్ రిఫరీ స్టెఫానీ ప్రాఫర్ట్ దక్కించుకోనుంది.
జర్మనీ-కోస్టారికా జట్ల మధ్య గురువారం జరిగే మ్యాచ్‌లో ఫ్రాపర్ట్ అంపైర్‌గా బాధ్యతలు నిర్వర్తించనుంది. ప్రపంచకప్‌లో ప్రధాన రిఫరీగా వ్యవహరించనున్న తొలి మహిళ ఫ్రాపర్ట్.
అంతేగాక ఈ మ్యాచ్‌కు రిఫరీలందరూ మహిళలే కావడం విశేషం. బ్రెజిల్‌కు చెందిన న్యూజా బాక్, మెక్సికోకు చెందిన కరేన్ డయాజ్ మెడిన సహాయ రిఫరీలుగా వ్యవహరించనున్నారు.
అమెరికాకు చెందిన కాథరిన్ నెస్బిట్ నాలుగో అంపైర్‌గా వీడియా రివ్యూ జట్టులో ఆఫ్‌సైడ్ స్పెషలిస్ట్‌గా బాధ్యతలు చేపట్టనున్నది. ఈ మేరకు ఫిఫా ఒక ప్రకటన విడుదల చేసింది.