27 బంతుల్లోనే టీ-20 ప్రపంచ రికార్డు సెంచరీ!

ధూమ్ ధామ్ టీ-20 క్రికెట్ రికార్డుల మోతతో దద్దరిల్లుతోంది. బ్యాటింగ్ లో ఎస్తోనియా, బౌలింగ్ లో న్యూజిలాండ్ ఆటగాళ్లు ప్రపంచ రికార్డులు నెలకొల్పారు.

Advertisement
Update:2024-06-18 18:20 IST

ధూమ్ ధామ్ టీ-20 క్రికెట్ రికార్డుల మోతతో దద్దరిల్లుతోంది. బ్యాటింగ్ లో ఎస్తోనియా, బౌలింగ్ లో న్యూజిలాండ్ ఆటగాళ్లు ప్రపంచ రికార్డులు నెలకొల్పారు.

20 ఓవర్లలో 60 థ్రిల్స్ తో సాగిపోయే ధూమ్ ధామ్ టీ-20 ఫార్మాట్లో..ఒకేరోజున రెండు అరుదైన రికార్డులు నమోదయ్యాయి. సైప్రస్- ఎస్తోనియాజట్ల సిరీస్ లో బ్యాటింగ్ రికార్డు, ప్రపంచకప్ గ్రూప్ ఆఖరి లీగ్ మ్యాచ్ లో పాపువా న్యూగినియా- న్యూజిలాండ్ జట్ల పోరులో బౌలింగ్ రికార్డు వచ్చి చేరాయి.

18 సిక్సర్లతో సునామీ సెంచరీ....

అంతర్జాతీయ క్రికెట్ పసికూనజట్లు ఎస్తోనియా- సైప్రస్ జట్ల నడుమ జరుగుతున్న ఆరుమ్యాచ్ ల ద్వైపాక్షిక సిరీస్ రెండో టీ-20 మ్యాచ్ లోనే సరికొత్త ప్రపంచ రికార్డు నమోదయ్యింది.

ఎస్తోనియా జట్టులోని భారత సంతతి బ్యాటర్ సాహిల్ చౌహాన్ కేవలం 27 బంతుల్లోనే మెరుపు శతకం బాదడం ద్వారా గతంలో ఉన్న 33 బంతుల ప్రపంచ రికార్డును తెరమరుగు చేయగలిగాడు.

ఈ ఏడాది ప్రారంభంలో నమీబియా బ్యాటర్ జాన్ నికోల్ లోఫ్టీ-ఈటన్ సాధించిన 33 బాల్ శతకం రికార్డును సాహిల్ 27 బంతుల సెంచరీతో అధిగమించాడు.

192 పరుగుల విజయలక్ష్యంతో చేజింగ్ కు దిగిన ఎస్తోనియా మొదటి 8 బంతుల్లోనే ఓపెనర్ల వికెట్లు, పవర్ ప్లే ఓవర్లు ముగిసే నాటికి టాపార్డర్ లోని మూడు వికెట్లు నష్టపోయి ఎదురీదుతున్న తరుణంలో క్రీజులోకి వచ్చిన సాహిల్ శివమెత్తిపోయాడు. పూనకం వచ్చినవాడిలా బ్యాట్ ఝళిపిస్తూ సిక్సర్లు, ఫోర్లతో చెలరేగిపోయాడు.

సాహిల్ విధ్వంసకర బ్యాటింగ్ తో కేవలం 13 ఓవర్లలోనే ఎస్తోనియా 6 వికెట్ల విజయం సాధించింది.

41 బంతుల్లో 144 నాటౌట్...

ఆరుమ్యాచ్ ల సిరీస్ లోని ఈ రెండోమ్యాచ్ లో సాహిల్ 27 బంతుల్లోనే శతకం బాదడంతో పాటు..మొత్తం 41 బంతుల్లో 18 సిక్సర్లు, 6 ఫోర్లతో 144 పరుగుల నాటౌట్ స్కోరుతో నిలిచాడు. కేవలం 14 బంతుల్లోనే మొదటి 50 పరుగులు సాధించిన సాహిల్ ఆ తర్వాత మరింతగా చెలరేగిపోయాడు.

2013 ఐపీఎల్ సీజన్లో పూనే వారియర్స్ తో జరిగిన మ్యాచ్ లో బెంగళూరు రాయల్ చాలెంజర్స్ ఓపెనర్ క్రిస్ గేల్ సాధించిన 30 బంతుల శతకం రికార్డు సైతం...సాహిల్ దెబ్బతో రెండోస్థానానికి చేరింది.

సిక్సర్ల బాదుడులోనూ ప్రపంచ రికార్డు...

టీ-20 క్రికెట్ ఓ ఇన్నింగ్స్ లో అత్యధికంగా 18 సిక్సర్లు బాదిన తొలి బ్యాటర్ గా సాహిల్ మరో ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఇప్పటి వరకూ అప్ఘనిస్థాన్ ఆటగాడు హజ్రతుల్లా జజాయ్ పేరుతో ఉన్న 16 సిక్సర్ల రికార్డును సాహిల్ 18 సిక్సర్లతో అధిగమించాడు. 2019లో ఐర్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో జజాయ్ ఈ ప్రపంచ రికార్డు ఫీట్ సాధించాడు.

2023 సీజన్లో ఎస్తోనియా తరపున అంతర్జాతీయ టీ-20 అరంగేట్రం చేసిన సాహిల్ కెరియర్ లో ఇది కేవలం 4వ మ్యాచ్ మాత్రమే. ప్రస్తుత సిరీస్ లోని తొలిమ్యాచ్ లో డకౌట్ గా వెనుదిరిగిన సాహిల్..రెండో మ్యాచ్ లో మాత్రం సునామీ ఇన్నింగ్స్ తో జంట ప్రపంచ రికార్డులు నమోదు చేయడం విశేషం.

4 ఓవర్లలో ఒక్క పరుగూ ఇవ్వని కివీ పేసర్...

మరోవైపు..వెస్టిండీస్, అమెరికా దేశాల సంయుక్త ఆతిథ్యంలో జరుగుతున్న 2024-ఐసీసీ టీ-20 ప్రపంచకప్ లో సైతం మరో అసాధారణ రికార్డు నమోదయ్యింది. ట్రినిడాడ్ అండ్ టొబాగోలోని బ్రయన్ లారా ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా పసికూన పాపువా న్యూగినియాతో జరిగిన మ్యాచ్ లో న్యూజిలాండ్ మెరుపు ఫాస్ట్ బౌలర్ లాకీ ఫెర్గూసన్ తన కోటా 4 ఓవర్లలోని 24 బంతుల్ని ..డాట్ బాల్స్ ( ఒక్క పరుగు ఇవ్వకుండా )గా వేసి చరిత్ర సృష్టించాడు.

లాకీ 4 ఓవర్లలో 4 మేడిన్లతో 3 వికెట్లు పడగొట్టాడు. నాలుగుకు నాలుగు ఓవర్లూ మేడిన్లుగా వేసిన రెండో బౌలర్ గా రికార్డుల్లో చేరాడు.

మొత్తం మీద..ఇటు బ్యాటింగ్..అటు బౌలింగ్ విభాగాలలో ఒకేరోజున అరుదైన రికార్డులు నమోదు కావడం విశేషం.

Tags:    
Advertisement

Similar News