గుడ్ బ్యాడ్ రికార్డుల బ్రాడ్
తొలి టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియా డాషింగ్ ఆల్‌రౌండర్ యువరాజ్‌సింగ్ ..స్టువర్ట్ బ్రాడ్ ఆరు బంతులు ఆరు విధాలుగా వేసినా.. ఆరు సిక్సులుగా మలిచాడు. బ్రాడ్ బ్యాడ్ రికార్డుగా ఇది చరిత్రకెక్కింది.
జెంటిల్‌మెన్ గేమ్ క్రికెట్‌లో మంచి ప్రతిభ రికార్డులుగా నమోదు అవుతాయి. అలాగే చెత్త ప్రదర్శనా రికార్డు అవుతుంది. గుడ్ ఆర్ బ్యాడ్.. ఏదైనా రికార్డుగా నమోదు కావడం తప్పనిసరి. అయితే గుడ్ -బ్యాడ్ రెండు రికార్డులు ఒకే క్రికెటర్ పేరిట నమోదైతే.. ఆ పేరు స్టువర్ట్ బ్రాడ్ అనొచ్చు. ఇంగ్లండ్ మాజీ ఆల్ రౌండర్ క్రిస్ బ్రాడ్ తనయుడే స్టువర్ట్ బ్రాడ్. మీడియం పేసర్, బ్యాటర్‌గానూ రాణించే స్టువర్ట్ బ్రాడ్ 2007లో ఇంగ్లాండ్ టెస్టు టీమ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. వన్డేలు, టీ20లోనూ సత్తాచాటాడు. ప్రతిభతో టీమ్‌లో స్థానం సంపాదించి కొనసాగిన బ్రాడ్ బ్యాడ్ రికార్డులకి ఇండియా బ్యాట్స్‌మెన్‌లు కారకులు కావడం యాధృచ్ఛికమే.
యువరాజ్ దెబ్బ..బ్రాడ్ అబ్బా
2007లో సౌతాఫ్రికా వేదికగా జరిగిన తొలి టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియా డాషింగ్ ఆల్‌రౌండర్ యువరాజ్‌సింగ్ ..స్టువర్ట్ బ్రాడ్ ఆరు బంతులు ఆరు విధాలుగా వేసినా.. ఆరు సిక్సులుగా మలిచాడు. బ్రాడ్ బ్యాడ్ రికార్డుగా ఇది చరిత్రకెక్కింది.
బుమ్రా బాదుడు..బ్రాడ్ బావురు
ఇండియా-ఇంగ్లాండ్ మధ్య ఎడ్జబాస్టన్ వేదికగా జరిగిన రీషెడ్యూల్డ్ టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా తాత్కాలిక సారథి జస్ప్రీత్ బుమ్రా బాదుడికి మరో చెత్త రికార్డు బ్రాడ్ సొంతమైంది. భారత తొలి ఇన్నింగ్స్ 84వ ఓవర్‌లో బ్రాడ్ బౌలింగ్ చేయగా బ్యాటింగ్ లో చెలరేగిన బుమ్రా 4, 5 (వైడ్ ప్లస్ ఫోర్), 7 (నోబాల్ ప్లస్ సిక్స్), 4,4,4,6,1 కొట్టడంతో 35 పరుగులు వచ్చాయి. టెస్టులో అత్యధిక పరుగులు సమర్పించుకున్న ఓవర్‌గా బ్రాడ్ పేరుతో లిఖితమైంది.
గుడ్ రికార్డులూ బ్రాడ్‌వే
చెత్త రికార్డులతో ప్రపంచ క్రికెట్ చరిత్రలో తనపేరుతో లిఖించుకున్న స్టువర్ట్ బ్రాడ్ గుడ్ రికార్డులని సాధించాడు.
555 టెస్ట్ వికెట్ల వీరుడు
స్టువర్ట్ బ్రాడ్ ఇప్పటి వరకూ 157 టెస్టులాడి 555 వికెట్లు పడగొట్టి, అతి ఎక్కువ టెస్ట్‌వికెట్లు పడగొట్టిన ఐదవ బౌలర్‌గా రికార్డు పుటలకెక్కాడు. ఇందులో మూడు సార్లు 10 వికెట్ల మార్క్‌ని అందుకున్న బ్రాడ్ 19 సార్లు 5 వికెట్లు సాధించాడు. టెస్టు మ్యాచ్‌లో అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శనగా 121 పరుగులకి 11 వికెట్లు తీయగా, ఒకే ఇన్నింగ్స్‌లో 15 పరుగులు ఇచ్చి 8 వికెట్లు తీసిన ఘనత సొంతం చేసుకున్నాడు.
రెండో ఇంగ్లాండ్ బౌలర్
లార్డ్స్ మైదానంలో 100వ వికెట్ సాధించిన రెండో ఇంగ్లాండ్ బౌలర్‌గా సౌతాఫ్రికా బ్యాట్స్‌మెన్ కైల్ వెరిన్నేను ఔట్ చేయడం ద్వారా రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు. లార్డ్స్‌లో 117 వికెట్లు పడగొట్టిన జేమ్స్ ఆండర్సన్ మొదటి స్థానంలో ఉన్నాడు.
మూడో ఇంగ్లాండ్ ప్లేయర్
ఇంగ్లాండ్ తరఫున ఎక్కువ టెస్టు మ్యాచ్‌లు ఆడిన మూడో ప్లేయర్‌గా స్టువర్ట్ బ్రాడ్ రికార్డు సాధించాడు. ఇంగ్లాండ్ నుంచి జేమ్స్ అండర్సన్ 167, ఆలిస్టర్ కుక్ 161 టెస్టులు ఆడగా స్టువర్ట్ బ్రాడ్ 157 టెస్టులు ఆడిన మూడో ప్లేయర్‌గా నిలిచాడు.