అజిత్ అగార్కర్..ఇక భారత చీఫ్ సెలెక్టర్!

భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ గా అజిత్ అగార్కర్ ను ఎంపిక చేసినట్లు బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది.

Advertisement
Update:2023-07-05 15:22 IST

భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ గా అజిత్ అగార్కర్ 

భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ గా అజిత్ అగార్కర్ ను ఎంపిక చేసినట్లు బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. ఐదుగురు సభ్యుల ఎంపిక సంఘానికి అగార్కర్ నేతృత్వం వహించనున్నారు.

ప్రపంచంలోనే అత్యంత భాగ్యవంతమైన క్రికెట్ బోర్డు బీసీసీఐ ఎట్టకేలకు చీఫ్ సెలెక్టర్ ను ఎంపిక చేసుకోగలిగింది. పూర్తిస్థాయి చీఫ్ సెలెక్టర్ లేని లోటును మాజీ ఆల్ రౌండర్ అజిత్ అగార్కర్ ద్వారా భర్తీ చేసుకోగలిగింది.

ఐదుగురు సభ్యులతో సెలెక్షన్ కమిటీ...

ఆరుమాసాల క్రితం చీఫ్ సెలెక్టర్ గా ఉన్న చేతన్ శర్మ రాజీనామా చేయడంతో...తాత్కాలిక చీఫ్ గా శివసుందర్ దాస్ నేతృత్వంలో భారతజట్ల ఎంపిక తంతును నిర్వర్తిస్తూ వచ్చారు.

అయితే..భారత్ వేదికగా అక్టోబర్ లో జరుగనున్న ఐసీసీ వన్డే ప్రపంచకప్ లో పాల్గొనే భారతజట్టు ఎంపిక కోసం పూర్తిస్థాయి ఎంపిక సంఘం కోసం బోర్డు క్రికెట్ సలహామండలి కసరత్తులు చేసింది.

చీఫ్ సెలెక్టర్ పోస్ట్ కోసం బీసీసీఐ కొద్దిరోజుల క్రితమే దరఖాస్తులను ఆహ్వానించింది. భారత్ తరపున టెస్టులు, వన్డేలు, టీ-20 మ్యాచ్ లు ఆడిన అపారఅనుభవం కలిగిన అజిత్ అగార్కర్ సెలెక్షన్ కమిటీ చైర్మన్ పదవికి దరఖాస్తు చేసుకొన్నాడు.

అగార్కర్ దరఖాస్తును పరిశీలించిన భారత క్రికెట్ సలహామండలి ఆమోదం తెలపడంతో బీసీసీఐ..అగార్కర్ ఎంపికను అధికారికంగా ప్రకటించింది.

అజిత్ అగార్కర్ చైర్మన్ గా, శివసుందర్ దాస్, సలీల్ అంకోలా, సుబ్రతో బెనర్జీ, ఎస్. శరత్ సభ్యులుగా పూర్తిస్థాయి ఎంపిక సంఘం ఏర్పాటైనట్లయ్యింది.

వెస్టిండీస్ తో జరిగే ఐదుమ్యాచ్ ల టీ-20 సిరీస్ లో పాల్గొనే భారతజట్టును అగార్కర్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ ఎంపిక చేయనుంది.

అరుదైన రికార్డుల అజిత్ అగార్కర్...

సౌరాష్ట్ర్ర ప్రత్యర్థిగా ముంబై తరపున 1996- 97 సీజన్లో రంజీ తొలిమ్యాచ్ ఆడిన అగార్కర్ నమ్మదగిన మీడియం పేస్ ఆల్ రౌండర్ గా గుర్తింపు తెచ్చుకొన్నాడు.

1998 ఆస్ట్ర్రేలియా సిరీస్ లో భారత్ తరపున వన్డే అరంగేట్రం చేసిన అగార్కర్ ఆ తర్వాత మరి వెనుదిరిగి చూసింది లేదు.

వన్డే క్రికెట్లో అత్యంత వేగంగా 50 వికెట్లు పడగొట్టిన మీడియం ఫాస్ట్ బౌలర్ గా రికార్డు నెలకొల్పిన అగార్కర్ వరుసగా 7 సార్లు డకౌటైన క్రికెటర్ గానూ ఓ చెత్తరికార్డును మూటగట్టుకోగలిగాడు.

చారిత్రక లార్డ్స్ మైదానంలో టెస్టు సెంచరీ బాదిన అరుదైన ఘనత సైతం అగార్కర్ కు ఉంది. భారత్ తరపున 26 టెస్టులు ఆడి 58 వికెట్లు, 191 వన్డేలు ఆడి 288 వికెట్లు

పడగొట్టిన రికార్డు అగార్కర్ కు ఉంది. నాలుగు టీ-20 మ్యాచ్ ల్లో సైతం అగార్కర్ భారత్ కు ప్రాతినిథ్యం వహించాడు.

1999, 2003, 2007 వన్డే ప్రపంచకప్‌లలో భారత జట్టులో సభ్యుడిగా ఉన్న అగార్కర్ ‌.. 2007 టీ -20 ప్రపంచకప్‌ చేజిక్కించుకున్న భారతజట్టులోనూ సభ్యుడిగా ఉన్నాడు.

2012-13 సీజన్లో అగార్కర్ నాయకత్వంలోనే ముంబైజట్టు 40వసారి రంజీట్రోఫీని గెలుచుకోగలిగింది. 2013 సీజన్లోనే క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన అగార్కర్ సహాయ శిక్షకుడిగా, క్రికెట్ వ్యాఖ్యాతగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. ముంబై క్రికెట్ సంఘానికి చీఫ్ సెలెక్టర్ గా కూడా అగార్కర్ సేవలు అందించాడు.

చీఫ్ సెలెక్టర్ గా అగార్కర్ ఏడాదికి కోటి రూపాయలు వేతనం అందుకోనున్నాడు. అంతర్జాతీయ సిరీస్ లు, ప్రపంచ టోర్నీలకు తగిన భారతజట్లను ఎంపిక చేయటం కత్తిమీద సాము లాంటిదే.

Tags:    
Advertisement

Similar News