యశస్వి రికార్డు సెంచరీ, ఆసియాక్రీడల సెమీస్ లో భారత్!
19వ ఆసియాక్రీడల క్రికెట్ పురుషుల సెమీఫైనల్ కు భారత్ చేరుకొంది.తొలిక్వార్టర్ ఫైనల్లో భారత్ 23 పరుగుల తేడాతో నేపాల్ ను అధిగమించింది.
19వ ఆసియాక్రీడల క్రికెట్ పురుషుల సెమీఫైనల్ కు భారత్ చేరుకొంది.తొలిక్వార్టర్ ఫైనల్లో భారత్ 23 పరుగుల తేడాతో నేపాల్ ను అధిగమించింది.
ఆసియాక్రీడల క్రికెట్ పురుషుల తొలిమ్యాచ్ లోనే భారత యువఓపెనర్ యశస్వి జైశ్వాల్ మెరుపు సెంచరీతో అదరగొట్టాడు. అత్యంత చిన్నవయసులో టీ-20 శతకం బాదిన భారత క్రికెటర్ గా సరికొత్త రికార్డు నెలకొల్పాడు.
హాంగ్జులోని పింగ్ ఫెంగ్ కాంపస్ క్రికెట్ ఫీల్డ్ వేదికగా ముగిసిన తొలి క్వార్టర్ ఫైనల్స్ లో భారత్ గట్టి పోటీ ఎదుర్కొని నేపాల్ పై 23 పరుగుల విజయంతో సెమీస్ బెర్త్ ఖాయం చేసుకోగలిగింది.
21 ఏళ్ల 13 రోజుల్లోనే శతకం.....
ఈ నాకౌట్ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ కు దిగిన భారత్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 202 పరుగులు చేయగలిగింది. ఇందులో యశస్వి జైశ్వాల్ సాధించిన పరుగులే 100 ఉన్నాయి.
యశస్వి కేవలం 48 బంతుల్లోనే మెరుపు శతకం బాదినా భారత్ పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోలేకపోయింది. నేపాల్ పేసర్ సోమ్ పాల్ కామీ బౌలింగ్ లో ఒక్క పరుగు తీయడం ద్వారా యశస్వి మూడంకెల స్కోరును చేరుకోగలిగాడు. 21 సంవత్సరాల 13 రోజుల వయసులోనే టీ-20 అంతర్జాతీయ శతకం బాదిన భారత తొలి క్రికెటర్ గా నిలిచాడు.
న్యూజిలాండ్ పై శుభ్ మన్ గిల్ 23 ఏళ్ల 143 రోజుల వయసులో సాధించిన టీ-20 రికార్డును యశస్వి తెరమరుగు చేయగలిగాడు.
భారత 8వ బ్యాటర్ యశస్వి.....
ఆసియాక్రీడల టీ-20 శతకం సాధించడం ద్వారా టీ-20 క్రికెట్లో సెంచరీ బాదిన భారత 8వ క్రికెటర్ గా యశస్వి జైశ్వాల్ నిలిచాడు. యశస్వి కంటే టీ-20 ఫార్మాట్లో సెంచరీలు సాధించిన భారత బ్యాటర్లలో విరాట్ కొహ్లీ, కెఎల్ రాహుల్, రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, సురేశ్ రైనా, దీపక్ హుడా, శుభ్ మన్ గిల్ ఉన్నారు.
తన టీ-20 కెరియర్ లో కేవలం 8వ మ్యాచ్ లోనే యశస్వి జైశ్వాల్ సెంచరీ నమోదు చేయడం విశేషం. భారత కెప్టెన్ రితురాజ్ గయక్వాడ్ 25 పరుగులకు అవుట్ కాగా...రింకూ సింగ్ 37 పరుగుల నాటౌట్ స్కోరుతో నిలిచాడు. నేపాల్ బౌలర్లలో దీపేంద్ర సింగ్ అయిరీ 2 వికెట్లు పడగొట్టాడు.
మ్యాచ్ నెగ్గాలంటే 20 ఓవర్లలో 203 పరుగులు చేయాల్సిన నేపాల్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 179 పరుగులు మాత్రమే చేయగలిగింది. నేపాలీ బ్యాటర్లలో దీపేంద్ర సింగ్ అయిరీ 32 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు.
భారత బౌలర్లలో రవి బిష్నోయ్ 3 వికెట్లు, ఆవేశ్ ఖాన్ 3 వికెట్లు పడగొట్టారు. బుధవారం జరిగే సెమీఫైనల్ పోరులో భారత్ పోటీకి దిగనుంది.