బంగ్లాదేశ్ తో నేడు భారత్ ఆఖరాట!

ఆసియాకప్ సూపర్-4 రౌండ్ ను హ్యాట్రిక్ విజయాలతో ముగించడానికి భారత్ తహతహలాడుతోంది. నేడు జరిగే ఆఖరిరౌండ్ మ్యాచ్ లో బంగ్లాదేశ్ తో తలపడనుంది.

Advertisement
Update:2023-09-15 06:15 IST

బంగ్లాదేశ్ తో నేడు భారత్ ఆఖరాట!

ఆసియాకప్ సూపర్-4 రౌండ్ ను హ్యాట్రిక్ విజయాలతో ముగించడానికి భారత్ తహతహలాడుతోంది. నేడు జరిగే ఆఖరిరౌండ్ మ్యాచ్ లో బంగ్లాదేశ్ తో తలపడనుంది.

కొలంబో వేదికగా జరుగుతున్న 2023 ఆసియాకప్ వన్డే టోర్నీలోని సూపర్ -4 రౌండ్ ముగింపు దశకు చేరింది. ప్రేమదాస స్టేడియం వేదికగా ఈరోజు జరిగే పోరులో 3వ ర్యాంకర్ భారత్ తో 7వ ర్యాంకర్ బంగ్లాదేశ్ తలపడనుంది.

కూల్ కూల్ మ్యాచ్......

ఆసియాకప్ మ్యాచ్ లంటేనే ఎక్కడలేని ఒత్తిడి, టెన్షన్ టెన్షన్. అయితే..భారత్- బంగ్లాజట్ల ఆఖరిరౌండ్ మ్యాచ్ మాత్రం ఏమాత్రం ఒత్తిడి లేకుండా కూల్ కూల్ గా జరుగనుంది.

ఇప్పటికే భారతజట్టు ఫైనల్ బెర్త్ ఖాయం చేసుకోడం, బంగ్లాదేశ్ కు ఫైనల్స్ చేరే అవకాశమే లేకపోడంతో..ఈ ఆఖరిరౌండ్ మ్యాచ్ బెంచ్ కే పరిమితమైన భారత క్రికెటర్లకు సువర్ణ అవకాశం కానుంది. బంగ్లాదేశ్ మాత్రం భారత్ లాంటి దిగ్గజజట్టును కంగు తినిపించడం ద్వారా టోర్నీ నుంచి సగర్వంగా నిష్క్ర్రమించాలని భావిస్తోంది.

సూపర్-4 మొదటి రెండురౌండ్ల మ్యాచ్ ల్లో పాకిస్థాన్ పైన 228 పరుగులు, శ్రీలంకపైన 41 పరుగుల విజయాలతో భారత్ నంబర్ వన్ జట్టుగా ఫైనల్స్ కు చేరిన ఆత్మవిశ్వాసంతో అంతగా ప్రాధాన్యం లేని ఈ ఆఖరిరౌండ్ మ్యాచ్ లో సైతం విజయం సాధించాలన్న పట్టుదలతో ఉంది.

బిగ్ త్రీకి విశ్రాంతి దక్కేనా?

బంగ్లాదేశ్ తో జరిగే ఆఖరిరౌండ్ సూపర్ -4 మ్యాచ్ లో భారత్ తన ప్రధాన ఆటగాళ్లకు విశ్రాంతి ఇచ్చే అవకాశం ఉంది. కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ కెప్టెన్ విరాట్ కొహ్లీ, సీనియర్ ఫాస్ట్ బౌలర్ జస్ ప్రీత్ బుమ్రాకు విశ్రాంతి నిచ్చి వారికి బదులుగా...సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, మహ్మద్ షమీలను తుదిజట్టులోకి తీసుకోనుంది.

రోహిత్ కు విశ్రాంతి ఇచ్చే పక్షంలో శుభ్ మన్ గిల్ తో కలసి ఇషాన్ కిషన్ భారత ఇన్నింగ్స్ ప్రారంభించనున్నాడు. మిడిలార్డర్లో సూర్యకుమార్ యాదవ్ కు సత్తా చాటుకోడానికి ఇదో అందివచ్చిన అవకాశం కానుంది. కీలక బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ కు సైతం ఈమ్యాచ్ పూర్తిస్థాయి ప్రాక్టీసుగా ఉపయోగపడనుంది.

పరువుకోసం బంగ్లా ఆరాటం...

సూపర్ -4 రౌండ్ ప్రారంభమ్యాచ్ లో పాకిస్థాన్ చేతిలో చిత్తుగా ఓడిన బంగ్లాదేశ్...కనీసం భారత్ లాంటి మేటిజట్టును కంగు తినిపించగలిగితే..స్వదేశానికి తలెత్తుకొని తిరిగి వెళ్లవచ్చునని భావిస్తోంది.

స్పిన్ ఆల్ రౌండర్ షకీబుల్ హసన్ నాయకత్వంలోని బంగ్లాజట్టులో..లిట్టన్ దాస్, నజ్ముల్ హసన్ షాంటో, తమీమ్, ముష్ ఫికుర్ రహీం,మహిదీ హసన్ మిరాజ్ లాంటి ప్రమాదకరమైన బ్యాటర్లున్నారు.

బంగ్లాజట్టు స్థాయికి తగ్గట్టుగా ఆడగలిగితే భారతజట్టుకు గట్టిపోటీ ఇవ్వగలుగుతుంది. భారత కాలమానప్రకారం ఈ మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్ కోసం..స్పిన్ పిచ్ అందుబాటులో ఉంటుందా? లేక పేస్ బౌలర్లతో పాటు స్ట్ర్రోక్ మేకర్లకు అనువుగా ఉండే పిచ్ ను ఉంచుతారా? అన్న అంశం పైనే మ్యాచ్ తుది ఫలితం ఆధారపడి ఉంది.

ఇప్పటికే ఫైనల్స్ చేరిన భారత్ ఏమాత్రం ఒత్తిడి లేకుండా బరిలోకి దిగుతుంటే..బంగ్లాదేశ్ మాత్రం పోరాడి ఓడితే వచ్చిన నష్టం ఏమీలేదన్నట్లుగా పోరుకు సై అంటోంది.

ఈ నెల 17న ప్రేమదాస స్టేడియం వేదికగానే ఆసియాకప్ టైటిల్ పోరు జరుగనున్న సంగతి తెలిసిందే.

Tags:    
Advertisement

Similar News