‘ఈగల్’ వాయిదా.. - ఫిబ్రవరి 9న విడుదల
Eagle postponed: సంక్రాంతి పండుగ సందర్భంగా సినిమాల విడుదలపై.. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ గురువారం సమావేశమయ్యాయి.
Eagle postponed: మాస్ మహరాజా రవితేజ హీరోగా ప్రతిష్టాత్మకంగా రూపొందించిన చిత్రం ‘ఈగల్’ సంక్రాంతి బరిలో దిగడం లేదు. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 9వ తేదీకి వాయిదా వేస్తున్నట్టు చిత్ర నిర్మాతలు గురువారం సాయంత్రం వెల్లడించారు. ఈ చిత్రాన్ని తొలుత సంక్రాంతి బరిలో దించాలని నిర్మాతలు భావించి అన్ని ఏర్పాట్లూ చేసుకున్నారు. విడుదల తేదీ కూడా జనవరి 13వ తేదీగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఈసారి 5 ప్రతిష్టాత్మక చిత్రాలు సంక్రాంతి బరిలో అభిమానులను అలరించేందుకు వస్తున్నాయని అంతా భావించారు. అయితే.. ఆ జాబితాలోని ‘ఈగల్’ చిత్రం ప్రస్తుతం వాయిదా పడింది.
సంక్రాంతి పండుగ సందర్భంగా సినిమాల విడుదలపై.. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ గురువారం సమావేశమయ్యాయి. రోజుల వ్యవధిలోనే ఐదు సినిమాలు విడుదలైతే ఎలాంటి పరిణామాలుంటాయనే దానిపై ఆయా నిర్మాతలతో సుదీర్ఘ చర్చలు జరిగాయి. ఈ క్రమంలో ‘ఈగల్’ చిత్ర నిర్మాత తమ సినిమాను వాయిదా వేసేందుకు అంగీకరించారు. రవితేజ హీరోగా దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీని టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల సంయుక్తంగా నిర్మించారు. జనవరి 13న రావాల్సిన ఈ చిత్రానికి ఇప్పటికే సెన్సార్ కూడా పూర్తయింది.
‘ఈగల్’ చిత్రం వాయిదాపై నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ.. ఓ సినిమా వెనక్కి తగ్గితే ఏదో జరిగినట్టు కాదని, ఇది తామంతా కలిసి తీసుకున్న నిర్ణయమని చెప్పారు. సినిమా వాయిదాకు అంగీకరించినందుకు రవితేజ, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాతలకు ఆయన ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఇదొక మంచి పరిణామమని చెప్పారు.
అభిమానులు కాలర్ ఎగరేసుకునేలా ఉంటుంది...
‘ఈగల్’ చిత్రం సంక్రాంతి బరి నుంచి తప్పుకోవడంపై ఆ చిత్ర నిర్మాతలు స్పందిస్తూ.. రవితేజ చెప్పడం వల్లే తమ సినిమా వాయిదాకు అంగీకరించామని చెప్పారు. చిత్రం వాయిదా పడిందని అభిమానులు నిరాశపడాల్సిన పనిలేదని, ఈ చిత్రం రవితేజ అభిమానులంతా కాలర్ ఎగరేసుకునేలా ఉంటుందని వారు తెలిపారు.
బరిలో నాలుగే...
ఇక సంక్రాంతి బరి నుంచి ‘ఈగల్’ చిత్రం తప్పుకోవడంతో పండగ బరిలో నాలుగు చిత్రాలు నిలవనున్నాయి. వాటిలో మహేశ్‌బాబు హీరోగా నటించిన ‘గుంటూరు కారం’ జనవరి 12న విడుదల కానుండగా, అదేరోజు తేజ సజ్జ హీరోగా నటించిన ‘హను–మాన్’ కూడా విడుదలవుతోంది. ఇక వెంకటేష్ హీరోగా నటించిన ‘సైంధవ్’ చిత్రం జనవరి 13న, నాగార్జున హీరోగా నటించిన ‘నా సామిరంగ’ జనవరి 14న విడుదల కానున్నాయి.