ఉత్త‌ర భార‌తంలో ఎల్లో అలర్ట్‌.. - మ‌రో ఆరు రోజుల‌పాటు కోల్డ్ స్పెల్‌కు అవ‌కాశం

రానున్న ఐదు రోజుల్లో ఢిల్లీ స‌హా పంజాబ్‌, హ‌ర్యానా, చండీగ‌ఢ్‌, ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌, రాజ‌స్థాన్ త‌దిత‌ర ప్రాంతాల్లో ద‌ట్ట‌మైన మంచు కురిసే అవ‌కాశ‌ముంద‌ని ఐఎండీ వెల్ల‌డించింది.

Advertisement
Update:2023-01-17 12:13 IST

ఉత్త‌ర భార‌తంలో ఎల్లో అలర్ట్‌.. - మ‌రో ఆరు రోజుల‌పాటు కోల్డ్ స్పెల్‌కు అవ‌కాశం

ఉత్త‌ర భార‌తం వ‌ణికిపోతోంది. ఎన్న‌డూ లేనంత‌గా ఉష్ణోగ్ర‌త‌లు ప‌డిపోతున్నాయి. దీంతో వాతావ‌ర‌ణ శాఖ హెచ్చ‌రిక‌లు జారీ చేసింది. గ‌త కొద్ది రోజులుగా ఉత్త‌రాది రాష్ట్రాల్లో అత్య‌ల్ప ఉష్ణోగ్ర‌త‌లు న‌మోద‌వుతున్నాయి. దేశ రాజ‌ధాని ఢిల్లీలో అయితే ఉష్ణోగ్ర‌త‌లు భారీగా ప‌త‌న‌మ‌వుతున్నాయి. నేటి నుంచి వ‌రుసగా మూడు రోజుల‌పాటు మ‌రో కోల్డ్ స్పెల్ ఏర్ప‌డే అవ‌కాశ‌ముంద‌ని వాతావ‌ర‌ణ శాఖ అధికారులు వెల్ల‌డించింది. 3 డిగ్రీల కంటే త‌క్కువ ఉష్ణోగ్ర‌త‌లు న‌మోద‌య్యే అవ‌కాశ‌ముంద‌ని పేర్కొంది.

ఢిల్లీలో క‌నిష్ట‌ ఉష్ణోగ్ర‌త 1.4 సెల్సియ‌స్‌గా న‌మోద‌వుతుండటంతో ప్ర‌జ‌లు చ‌లి తీవ్ర‌త‌ను త‌ట్టుకోలేక‌ తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నారు. ఈ సీజ‌న్‌లో ఇంత త‌క్కువ స్థాయిలో ఉష్ణోగ్ర‌త‌లు న‌మోదు కావ‌డం ఇదే తొలిసారి కావ‌డం గ‌మ‌నార్హం. దీంతో ఐఎండీ ఢిల్లీలో ఈ నెల 17 నుంచి ఆరు రోజుల పాటు ఎల్లో అల‌ర్ట్ జారీ చేసింది.

రానున్న ఐదు రోజుల్లో ఢిల్లీ స‌హా పంజాబ్‌, హ‌ర్యానా, చండీగ‌ఢ్‌, ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌, రాజ‌స్థాన్ త‌దిత‌ర ప్రాంతాల్లో ద‌ట్ట‌మైన మంచు కురిసే అవ‌కాశ‌ముంద‌ని ఐఎండీ వెల్ల‌డించింది. వాయువ్య ప్రాంతం నుంచి వీస్తున్న చ‌లిగాలుల‌తో ఆయా ప్రాంతాల్లో జ‌న‌వ‌రి 18 నుంచి 2 నుంచి 3 డిగ్రీల ఉష్ణోగ్ర‌త‌లు న‌మోద‌య్యే అవ‌కాశ‌ముంద‌ని అధికారులు అంచ‌నా వేస్తున్నారు. తాజా ప‌రిస్థితుల నేపథ్యంలో ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సూచించారు.

ఈనెల 5 నుంచి 9వ తేదీ మ‌ధ్య ఏర్ప‌డిన కోల్డ్ స్పెల్ కార‌ణంగా ఢిల్లీ ప‌రిస‌ర ప్రాంతాల్లో వ‌రుస‌గా అత్య‌ల్ప ఉష్ణోగ్ర‌త‌లు న‌మోద‌య్యాయి. గ‌త ప‌దేళ్ల కాలంలో ఇంత‌టి త‌క్కువ స్థాయి ఉష్ణోగ్ర‌త‌లు న‌మోద‌వ‌డం ఇది రెండోసారి కావ‌డం గ‌మ‌నార్హం. గ‌డ‌చిన 15 రోజుల్లో 50 గంట‌ల‌పాటు పొగ‌మంచు కురిసింది. 2019 త‌ర్వాత ఇంత పెద్ద మొత్తంలో మంచు కుర‌వ‌డం ఇదే మొద‌టిసారని అధికారులు చెబుతున్నారు.

Tags:    
Advertisement

Similar News