కనీసం 200 సీట్లు గెలిచి చూపించండి.. - బీజేపీకి బెంగాల్‌ సీఎం సవాల్‌

2021 పశ్చిమబెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేపీ 200కు పైగా సీట్లు గెలుస్తామని ప్రగల్భాలు పలికిందని మమతా బెనర్జీ ఈ సందర్భంగా గుర్తుచేశారు. కానీ 77 సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చిందని ఎద్దేవా చేశారు.

Advertisement
Update:2024-03-31 18:35 IST

పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి, తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత మమతా బెనర్జీ బీజేపీకి సవాల్‌ విసిరారు. ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో 400 పైచిలుకు స్థానాల్లో గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్నామంటున్న బీజేపీకి ఛాలెంజ్‌ విసిరారు. కనీసం 200 లోక్‌సభ స్థానాల్లో గెలిచి చూపించాలని ఆమె సవాల్‌ చేశారు.

తలకు గాయమై చికిత్స పొందిన మమతా బెనర్జీ ఆ గాయం నుంచి కోలుకున్నారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఆదివారం తొలిసారిగా పశ్చిమబెంగాల్‌లోని కృష్ణానగర్‌ లోక్‌సభ పరిధిలో ప్రచారంలో పాల్గొన్నారు. లోక్‌సభ నుంచి బహిష్కారానికి గురైన ఎంపీ మహువా మొయిత్రా టీఎంసీ అభ్యర్థిగా ఆ స్థానం నుంచి బరిలో ఉన్నారు. ఆమెకు మద్దతుగా ప్రచారంలో పాల్గొన్న మమతా మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు.

2021 పశ్చిమబెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేపీ 200కు పైగా సీట్లు గెలుస్తామని ప్రగల్భాలు పలికిందని మమతా బెనర్జీ ఈ సందర్భంగా గుర్తుచేశారు. కానీ 77 సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చిందని ఎద్దేవా చేశారు. ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో 400కు పైగా స్థానాల్లో గెలుస్తామని అంటున్న బీజేపీ.. ముందుగా 200 సీట్ల బెంచ్‌ మార్క్‌ను దాటాలని సవాల్‌ చేశారు. బీజేపీకి వ్యతిరేకంగా గళం విప్పినందుకే మహువా మొయిత్రాను లోక్‌సభ నుంచి బహిష్కరించారని ఈ సందర్భంగా మమతా ఆగ్రహం వ్యక్తం చేశారు.

Tags:    
Advertisement

Similar News