రాహుల్ స్థానానికి ఉప ఎన్నిక ఎప్పుడు..? ఈసీ సమాధానం ఏంటంటే..?

ఒకవేళ ఆ చట్టసభ పదవీకాలం ఏడాది లోపే ఉంటే ఎన్నికకు అవసరం ఉండదు. అయితే పార్లమెంట్ పదవీకాలం ఏడాదికిపైగా ఉంది కాబట్టి వయనాడ్ విషయంలో ఉప ఎన్నిక జరగాల్సిందే.

Advertisement
Update:2023-03-29 19:23 IST

రాహుల్ గాంధీ లోక్ సభ సభ్యత్వంపై అనర్హత వేటు వేయడంతోపాటు ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న వయనాడ్ నియోజకవర్గం ఖాళీగా ఉన్నట్టు లోక్ సభ సెక్రటేరియట్ చూపించిన విషయం తెలిసిందే. ఈ రోజు కర్నాటక అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన కేంద్ర ఎన్నికల సంఘం.. వయనాడ్ కి కూడా నోటిఫికేషన్ ఇస్తుందని అనుకున్నారంతా. కానీ ఈసీ వేచి చూసే ధోరణిలో ఉంది. లోక్ సభ సెక్రటేరియట్, రాహుల్ సభ్యత్వాన్ని రద్దు చేసినంత స్పీడ్ గా ఉప ఎన్నికలపై ఈసీ స్పందించలేదు. వయనాడ్ ఉప ఎన్నికపై హడావిడి లేదని తెలిపారు సీఈసీ రాజీవ్ కుమార్.

కారణం ఏంటి..?

రాహుల్ గాంధీకి సూరత్ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించినా.. ఆయన అప్పీల్ చేసుకోవడానికి ట్రయల్‌ కోర్టు నెలరోజుల సమయం ఇచ్చింది. అందుకే ఈ విషయంలో ఈసీ వేచిచూసే ధోరణి అవలంబిస్తుంది. నెలరోజుల గడువు తర్వాత తాము స్పందిస్తామని చెప్పారు సీఈసీ రాజీవ్ కుమార్. చట్ట ప్రకారమే ఆ స్థానం ఖాళీ అయినట్లు ప్రకటించామని అన్నారు.

ఏదైనా కారణం చేత లోక్ సభ, లేదా అసెంబ్లీ స్థానం ఖాళీ అయితే అక్కడ 6 నెలల్లోపు ఉప ఎన్నిక నిర్వహించాల్సి ఉంటుంది. ఒకవేళ ఆ చట్టసభ పదవీకాలం ఏడాది లోపే ఉంటే ఎన్నికకు అవసరం ఉండదు. అయితే పార్లమెంట్ పదవీకాలం ఏడాదికిపైగా ఉంది కాబట్టి వయనాడ్ విషయంలో ఉప ఎన్నిక జరగాల్సిందే. కానీ రాహుల్ అనర్హత వేటు విషయంలో అప్పీల్ కి అవకాశం ఉంది కాబట్టి కేంద్ర ఎన్నికల సంఘం తొందరపడలేదు. అప్పీల్ కి అవకాశం ఉన్నా కూడా లోక్ సభ సెక్రటేరియట్ మాత్రం రాహుల్ విషయంలో 24గంటలు కూడా వేచి చూడకుండా అనర్హత వేటు వేసింది. అందుకే ప్రతిపక్షాలన్నీ మండిపడుతున్నాయి.

Tags:    
Advertisement

Similar News