2వేల ఫేక్ నోటుపై పార్లమెంట్ లో విస్తుపోయే నిజాలు..

తాజాగా లోక్ సభలో కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి 2 వేల రూపాయల నోట్ల గురించి కీలక విషయాలను వెల్లడించారు. 2016 నుంచి 2020 వరకు దేశంలో ఫేక్ 2 వేల నోట్ల సంఖ్య భారీగా పెరిగిపోయిందని చెప్పారు.

Advertisement
Update:2022-08-03 09:18 IST

భారత్ లో గతంలో ఫేక్ నోట్ల చలామణి ఎలా ఉన్నా, డీమానిటైజేషన్ తర్వాత అది మరింతగా పెరిగింది. పెరుగుతున్న టెక్నాలజీతో అసలును పోలిన నకిలీని తయారు చేయడం కేటుగాళ్లకు సులభమైంది. అదే సమయంలో ఐదు, పది నోట్లతో ఎంతకాలం, ఎంత సంపాదించినా వేస్ట్ అనుకున్నారేమో.. ఏకంగా 2వేల నోట్లనే టార్గెట్ చేశారు. విచిత్రం ఏంటంటే.. కనీసం పెద్ద నోట్ల విషయంలో అయినా గతంలో అత్యధిక భద్రతా ప్రమాణాలు పాటించేవారు. కానీ ఈ దఫా చిన్నా పెద్దా తేడా లేకుండా అన్నీ రంగు రంగుల నోట్లు.. నకిలీగాళ్లకు వరంగా మారాయి. దీంతో 2వేల నోట్లు అసలు కంటే నకిలీవే ఎక్కువగా చలామణిలోకి వచ్చాయి. ఆర్థిక వ్యవస్థను కుప్పకూల్చాయి. నకిలీనోట్ల బెడద తప్పిపోతుందని, విదేశాల్లోని బ్లాక్ మనీకి కాలం చెల్లుతుందని ప్రభుత్వం అనుకుంటే, దానికి పూర్తిగా రివర్స్ లో జరిగింది వ్యవహారం.

ఇవీ లెక్కలు..

తాజాగా లోక్ సభలో కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి 2 వేల రూపాయల నోట్ల గురించి కీలక విషయాలను వెల్లడించారు. 2016 నుంచి 2020 వరకు దేశంలో ఫేక్ 2 వేల నోట్ల సంఖ్య భారీగా పెరిగిపోయిందని చెప్పారు. వాటి సంఖ్య ఏకంగా 107 రెట్లు పెరిగిందని వివరించారు. 2016లో 2,272 ఫేక్ రూ.2 వేల నోట్లను ప్రభుత్వం సీజ్ చేసింది. వివిధ షాపుల్లో, బ్యాంకులలోకి వచ్చిన ఈ నోట్లను సీజ్ చేశారు. 2017లో ఫేక్ నోట్ల సంఖ్య 74,898కు పెరిగింది. 2018లో 54,776 ఫేక్ రూ.2 వేలు నోట్లు మార్కెట్లోకి రాగా వాటిని సీజ్ చేశారు. 2019లో 90,566గా, 2020లో 2,44,834 ఫేక్ 2వేల నోట్లను ప్రభుత్వం సీజ్ చేసింది. అంటే 2016 నుంచి ఇప్పటివరకు ఫేక్ 2వేల నోట్ల సంఖ్య భారీగా పెరిగింది. అయితే బ్యాంకుల వరకు వచ్చే ఈ ఫేక్ నోట్ల కన్నా బైట చలామణిలో ఎక్కువ నోట్లు ఉన్నాయని పంకజ్ చౌదరి చెప్పారు.

నోట్ల రద్దు తర్వాత ఫేక్‌ కరెన్సీ మార్కెట్ జోరు కొనసాగుతోందని కేంద్రం లెక్కలు చెబుతున్నాయి. అంటే కేంద్రం ఏ ఉద్దేశంతో అయితే నోట్లు రద్దు చేసిందో అది నెరవేరకపోగా అభాసుపాలవుతోంది. ఆ తర్వాతే ఫేక్ నోట్ల చలామణి భారీగా పెరిగింది. గతంలో చిన్న చిన్న నోట్లు నకిలీ రూపంలో వచ్చినా, ఇప్పుడు ఏకంగా 2వేలరూపాయల నోటుకే డూప్లికేట్ తయారు చేస్తున్నారు. నకిలీ నోట్లను అరికట్టేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలేవీ సఫలం కావడంలేదు.

Tags:    
Advertisement

Similar News